ఇంట్లోకి దొంగలు చొరపడకుండా కుక్కను పెంచుకున్నాం. కానీ అది మనల్నే దొంగగా పొరపడి దాడిచేస్తే? లూపస్‌ను తేలికగా అర్థం చేసుకోవటానికి ఈ ఉదాహరణ అతికినట్టు సరిపోతుంది. మన రోగనిరోధకశక్తి నిరంతరం శరీరాన్ని కనిపెట్టుకొని ఉంటుంది. సూక్ష్మక్రిముల వంటి హానికారకాలు లోనికి ప్రవేశించినప్పుడు ఉత్తేజితమై యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. ఇవి హానికారకాల మీద దాడి చేసి నిర్వీర్యం చేసేస్తాయి. లేదూ వాటిని నిర్మూలించమంటూ ఇతర కణాలకు సందేశాలు పంపుతాయి. ఇలా జబ్బుల బారినపడకుండా, ఒకవేళ జబ్బులు తలెత్తినా త్వరగా కోలుకునేలా చేస్తాయి.
ఎందుకనో కొందరిలో ఈ రోగనిరోధక వ్యవస్థ గాడి తప్పుతుంది. హాని కారకాలకు, ఆరోగ్య కణజాలానికి మధ్య తేడాను గుర్తించలేక విపరీతంగా స్పందిస్తుంది. దీంతో పెద్దఎత్తున ఉత్పత్తయ్యే యాంటీబాడీలు మన శరీర కణజాలం మీదే దాడి చేస్తాయి. లూపస్‌లో జరిగేది ఇదే. మన రోగనిరోధకశక్తి మన మీదే దాడిచేయటం వల్ల తలెత్తే ఇలాంటి వాటిని స్వీయరోగనిరోధక (ఆటోఇమ్యూనిన్) జబ్బులు అంటారు. ఇవి సాధారణంగా ఏదో ఒక భాగానికే పరిమితమవుతుంటాయి. కానీ లూపస్‌లో శరీరమంతా ప్రభావితమవుతుంది. లూపస్ అంటే లాటిన్ భాషలో తోడేలు అని అర్థం. లూపస్ బాధితుల్లో కొందరికి ముఖానికి ఇరువైపులా సీతాకోకచిలుక ఆకారంలో దద్దు వస్తుంటుంది. ఇది మాంసం తింటున్నప్పుడు తోడేలు ముఖం మీది మరకల్లా కనిపిస్తుంది. అందుకే ఆ పేరు!
తేలికగా లూపస్ అని పిలుచుకుంటున్నా దీన్ని సిస్టమిక్ లూపస్ ఎరీథిమాటోసస్ (ఎస్‌ఎల్‌ఈ) అంటారు. కొందరికి ఎర్రగా, పెద్దగా, గుండ్రంగా మందమైన పొలుసులతో కూడిన దద్దులూ రావొచ్చు. అక్కడ శాశ్వతమైన మచ్చలు ఏర్పడొచ్చు. దీన్ని డిస్కాయిడ్ లూపస్ అంటారు.
ముందే గుర్తించటం కీలకం..లూపస్‌తో బాధపడేవారిలో చాలామంది చూడటానికి ఆరోగ్యంగానే కనిపిస్తుంటారు. కానీ వీరిలో సగటున మూడేళ్ల క్రితం నుంచే లక్షణాలు, సంకేతాలు పొడసూపుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. మొదట్లో నిస్సత్తువ, కొద్దిగా జ్వరం వంటి మామూలు లక్షణాలే ఉంటాయి. ఇవి కూడా అందరిలో అన్నీ ఉండవు. ఎప్పుడూ ఉండవు. వస్తూ పోతుంటాయి. అప్పుడప్పుడు ఎక్కువవుతుంటాయి. అందువల్ల ఏదో ఒత్తిడికి లోనవుతున్నారనో, మరేదైనా ఇన్‌ఫెక్షన్ ఉందనో భావిస్తుంటారు. ఇలా ఇతరత్రా సమస్యలుగా పొరపడటం మూలంగా లూపస్‌ను గుర్తించటం ఆలస్యమైపోతుంది. లోలోపల అనర్థం జరుగుతూనే ఉంటుంది. జబ్బు నిర్ధరణ అయ్యేసరికే కొందరిలో గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీల వంటి కీలక అవయవాలు దెబ్బతిని పోవటం చూస్తుంటాం. కాబట్టి ముందే మేల్కొనటం ముఖ్యం.
నిర్ధరణ పద్ధతిగా..మనలో చాలామందికి జుట్టు ఊడిపోతుంటుంది. ఎప్పుడైనా కీళ్ల నొప్పులూ వేధించొచ్చు. కాలేజీలకు వెళ్లే అమ్మాయిలకు అప్పుడప్పుడు నోట్లో పుండ్లు అవటం, ఎండలోకి వెళ్లినప్పుడు బుగ్గలు ఎర్రబడటం మామూలే. కాబట్టి ఏవో కొద్దిపాటి లక్షణాల ఆధారంగా లూపస్‌ను నిర్ధరించలేం. ఆయా లక్షణాల తీరుతెన్నులు ఎలా ఉన్నాయి? వాటి మధ్య సంబంధం ఏదైనా ఉంటోందా? అనేవి చాలా క్షుణ్నంగా పరిశీలించాల్సి ఉంటుంది. లూపస్‌ను అనుమానించినప్పుడు ముందుగా యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీ (ఏఎన్‌ఏ) పరీక్ష చేస్తారు. ఇది పాజిటివ్‌గా వచ్చినంత మాత్రాన లూపస్ ఉన్నట్టు కాదు. నూటికి 5 మందికి జబ్బు లేకపోయినా పాజిటివ్‌గా రావొచ్చు. అందుకని డబుల్‌స్ట్రాండ్ డీఎన్‌ఏ (డీఎస్ డీఎన్‌ఏ) పరీక్ష చేస్తారు. ఇది పాజిటివ్‌గా ఉంటే లూపస్ ఉందని గట్టిగా నిర్ధరణకు రావొచ్చు. అలాగే రక్తంలో సీ3, సీ4 ప్రొటీన్లు.. యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ పరీక్షలు కూడా చేస్తారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని, ఒకోదానికి కొన్ని మార్కుల చొప్పున కేటాయిస్తారు. ఉదాహరణకు- కీళ్లనొప్పులకు 4, జుట్టు ఊడిపోతే 2, నోట్లో పుండ్లకు 2, డీఎస్ డీఎన్‌ఏకు 6.. ఇలా మార్కులు కేటాయిస్తారు. చివరికి వీటన్నింటినీ కలిపి ఒక స్కోర్ ఇస్తారు. దీన్నే ‘ఏసీఆర్/యులార్ క్రైటీరియా’ అంటారు. ఇది 10, అంతకన్నా ఎక్కువగానీ ఉంటే లూపస్‌గా నిర్ధరిస్తారు.
ఆడవారిలో ఎక్కువ!..లూపస్ ఎందుకొస్తుందనేది కచ్చితంగా తెలియదు. జన్యువులు కారణం కావొచ్చని భావిస్తున్నారు. ఈ జన్యువులు వ్యక్తం కావటానికి ఇన్‌ఫెక్షన్ కారకాలు, అతి నీలలోహిత కాంతి, మానసిక ఒత్తిడి వంటివి కారణమవుతుండొచ్చు. ఒకరకంగా లూపస్‌ను ఆడవారి సమస్య అనుకోవచ్చు. దీని బారినపడుతున్నవారిలో 90% మంది మహిళలే మరి. వీరిలోనూ 90% మంది 15-45 ఏళ్ల వయసు వారే. మహిళల్లో, అదీ సంతానం కనే వయసులోనే ఎందుకు వస్తుందనేది స్పష్టంగా తెలియదు. స్త్రీ హార్మోన్లు చురుకుగా ఉండటం కారణం కావొచ్చనేది ఒక భావన. లూపస్ మహిళల్లో ఎక్కువే అయినా మగవారికి రాకూడదనేమీ లేదు. శిశువుల దగ్గర్నుంచి వృద్ధుల వరకు ఎవరికైనా, ఏ వయసులోనైనా రావొచ్చు.
లక్షణాలు రకరకాలు
- జుట్టు ఎక్కువగా ఊడిపోవటం.
- ఎండలోకి వెళ్లినప్పుడు బుగ్గల మీద రెండు వైపులా సీతాకోక చిలుక ఆకారంలో దద్దు రావటం. కొందరికి చెవులు, మెడ, మాడు, వీపు మీద బిళ్లల మాదిరిగానూ మచ్చలు ఏర్పడొచ్చు. ఎండకు చర్మం కందినట్టు అయ్యి నల్లగా అవ్వచ్చు.
- తరచూ బుగ్గ లోపల, నాలుక మీద, అంగిలి మీద పుండ్లు రావటం, తగ్గటం. ఇవి వస్తూ పోతుంటాయి.
- ఇతరత్రా కారణాలేవీ లేకుండా కొద్దిగా జ్వరం రావటం.
- తీవ్రమైన నీరసం, నిస్సత్తువ.
- కీళ్ల నొప్పులు వేధించటం. నొప్పులు ఒక కీలు నుంచి మరో కీలుకు మారుతుంటాయి. కొందరికి రుమటాయిడ్‌లో మాదిరిగా ఒకేసారి శరీరానికి రెండు వైపులా కీళ్లలో నొప్పి రావొచ్చు.
- తలనొప్పి, పార్శ్వనొప్పి (మైగ్రేన్).
- చల్లటి వాతావరణానికి చేతి, కాలి వేళ్ల కొసలు నీలం రంగులోకి మారటం. ముందు ఊదా రంగులోకి, తర్వాత నీలి రంగులోకి మారతాయి. చివరికి ఎర్రగా అవుతాయి.
మందులు క్రమం తప్పకుండా..ఒకప్పుడు లూపస్‌ను భయంకరమైన జబ్బుగా భావించేవారు. ప్రాణాలు నిలవటమే కష్టంగా ఉండేది. ఇప్పుడు మంచి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. క్రమం తప్పకుండా మందులు వాడుకుంటే అందరిలా హాయిగా గడపొచ్చు. అన్ని పనులూ చేసుకోవచ్చు. ఉద్యోగాలు చేసుకోవచ్చు. పెళ్లి చేసుకోవచ్చు. పిల్లల్ని కనొచ్చు. అయితే చాలామంది ఎవరో ఏదో చెప్పారని హఠాత్తుగా మందులు ఆపేస్తుంటారు. ఇతర చికిత్సలు తీసుకుంటుంటారు. ఇది చాలా పెద్ద పొరపాటు. మందులు ఆపేస్తే జబ్బు తీవ్రం కావటమే కాదు, ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశమూ ఎక్కువవుతుంది.
*లూపస్‌లో ప్రధానమైన ఔషధం హైడ్రాక్సీ క్లోరోక్విన్ (హెచ్‌సీక్యూ). తేలికపాటి జబ్బుకు ఇదే సరిపోతుంది. రోజుకు ఒక మాత్ర చొప్పున జీవితాంతం వేసుకోవాలి. సమస్య తీవ్రమైనప్పుడు ఇతరత్రా మందులు వాడినా దీన్ని కొనసాగించాల్సిందే. లూపస్ ఒక మాదిరిగా ఉంటే అజథయాప్రిన్ ఇస్తారు. కీళ్లనొప్పులు మాత్రమే ఉంటే మిథట్రక్సేట్ ఇస్తారు. లూపస్ తీవ్రంగా ఉంటే తాక్రోలిమస్, మైకోఫినలైట్, సైక్లుఫాస్ఫమైడ్ ఉపయోగపడతాయి.
*అవసరాన్ని బట్టి స్టిరాయిడ్ మందులూ వేసుకోవాల్సి ఉంటుంది. లూపస్‌లో ఇవి ప్రాణ రక్షణ ఔషధాలు. కొందరికి లూపస్ ఉన్నట్టుండి బాగా ఉద్ధృతమవుతుంటుది. దీన్ని అదుపులోకి తేవటం చాలా కష్టమైన పని. వీరికి పెద్దమొత్తంలో స్టిరాయిడ్ ఇంజెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. దీన్నే పల్స్ స్టిరాయిడ్ థెరపీ అంటారు. జబ్బు అదుపులోకి వచ్చాక మాత్రలు వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత నెమ్మదిగా మందు మోతాదు తగ్గిస్తూ వస్తారు. లూపస్ ఉపశమన దశలోకి చేరుకున్నాక స్టిరాయిడ్స్ ఆపేస్తారు.
*మందులకు లొంగని మొండిజబ్బుకు రిటిక్సుమాబ్, బెలిముమాబ్ అనే బయలాజికల్ ఇంజెక్షన్లు ఉపయోగపతాయి. అలాగే ఐవీఐజీ, ప్లాస్మా ఫెరిసిస్ చికిత్సలూ మేలు చేస్తాయి.