తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

టెస్టోస్టిరాన్ తగ్గితే ఇబ్బందా? ఇంజెక్షన్లు ఎవరికి అవసరం? - టెస్టోస్టెరాన్ స్థాయిని ఎలా పెంచాలి

వయసు పెరిగే కొద్దీ టెస్టోస్టిరాన్ స్థాయిలు తగ్గుతూ వస్తుంటాయి. ఈ హార్మోన్​ తక్కువైతే మానసిక ఆరోగ్య స్థితిపై ప్రభావం పడుతుంది. నిద్రపైనా దీని ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా వీర్యం ఉత్పత్తితో పాటు కండరాలు, ఎముకలకు సంబంధించి అనేక ఇబ్బందులు ఎదురవుతుంటాయి. టెస్టోస్టిరాన్ తగ్గితే.. చికిత్స ఏమిటి? అందుకు ఎటువంటి ఇతర జాగ్రత్తలు తీసుకోవాలి?

low-testosterone-causes-in-males-and-how-to-increase-testosterone-level
తక్కువ టెస్టోస్టెరాన్ పరిష్కార మార్గాలు

By

Published : Apr 18, 2023, 1:11 PM IST

సాధారణంగా టెస్టోస్టిరాన్ స్థాయిలు యవ్వన దశలో పెరుగుతాయి. వయసు పెరుగుతున్న కొద్దీ వాటి స్థాయిలు తగ్గుతూ వస్తుంటాయి. ఇదే హార్మోన్ నిర్ణీత వయసు తర్వాత పురుషుల్లో కొంత తక్కువగానే ఉండవచ్చు. కానీ, మరీ తక్కువైతే మాత్రం పెద్ద సమస్యగానే భావించాలి. హార్మోన్ లోపిస్తే.. ముందస్తు సూచనగా కొన్ని లక్షణాలు, సంకేతాలు కనిపిస్తాయి.

అవి..

  • పురుషుల్లో జననేంద్రియ అవయవాలు తగినంత అభివృద్ధి చెందకపోవడం.
  • జీవిత భాగస్వామితో కలయిక వేళ కోరికలు కలగకపోవడం.
  • శారీరకంగా కొన్ని మార్పులు వస్తాయి. అవి కండరాల పరిమాణం, పెరుగుదలపైనా ప్రభావం చూపుతాయి.
  • ఎముకలు సాంద్రత తగ్గి.. ఓ దశలో చాలా బలహీనమవుతాయి.
  • బలం తగ్గిపోతుంది. ఇంకా మరిన్ని సమస్యలు కలుగుతాయి.

పురుషుల్లో తక్కువ టెస్టోస్టిరాన్ అనేక భావోద్వేగ పరిణామాలకూ దారితీస్తుంది. రోజులు గడిచేకొద్దీ వారిలో ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. ఏ చిన్న పని చేయడానికీ ఆసక్తి ఉండదు. శక్తి సామర్థ్యాలు సన్నగిల్లుతాయి. త్వరగా అలసిపోతారు. ఎందులోనూ ఏకాగ్రత చూపరు. ఏదీ గుర్తులేనట్లు పరిస్థితి తయారవుతుంది. ఇంకా చెప్పాలంటే.. ఓ విధమైన అలసత్వం ఏర్పడుతుంది. ఏ పనీ చేయకుండా సోమరిగా ఉండాలనిపిస్తుంది.

చికిత్స విధానాలు అనేకం..
శరీరంలో టెస్టోస్టిరాన్ పెంపుదలకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. దీన్నే రీప్లేస్​మెంట్ థెరపీగానూ వ్యవహరిస్తుంటారు. మొదటగా.. క్లియర్ జెల్ ఉపయోగించడం ద్వారా ఫలితాలు రాబట్టవచ్చు. అదే విధంగా, చర్మం పరంగా స్కిన్ ప్యాచెస్ (అతుకు) ప్రక్రియ అనుసరించవచ్చు.

నిజానికి టెస్టోస్టిరాన్ అంతా బాడీ మెటబాలిజం అనే చెప్పాలి. మెదడులో రసాయనిక ఉత్పత్తే అన్నింటికీ మూలాధారం. దీని ప్రసరణ ఇతర భాగాలకు ఏ మేరకు ఉందన్నదే వైద్యులు చేసే మొదటి పరిశీలన. వృషణాల పరిస్థితిని మొదట వారు గమనిస్తారు. వాటికి దెబ్బ ఏమైనా తగిలిందా, లేదా చిన్నవిగా అయ్యాయా అనేది చెక్ చేస్తారు. కండరాలకు, శరీరంలోని ఇతర భాగాలకు ప్యాచెస్ తదుపరి చర్యగా ఇంజెక్షన్ల వినియోగం ఉంటుంది. ఇలా రెగ్యులర్ చెకప్ అవసరమవుతుంది.

సమస్య సత్వర పరిష్కారానికి మరికొన్ని విధానాలూ ఉన్నాయి. ఆరోగ్యకర జీవనశైలి అన్నింటికన్నా మిన్న. శరీర దారుఢ్యానికి నిత్య వ్యాయామం తప్పనిసరి. అంతా నియంత్రణలో ఉండాలి. ఆహారంలో భాగంగా పండ్లు, విత్తనాలు, గింజలను బాగా తీసుకోవాలి. మత్తుపదార్థాలకు ఎప్పుడూ దూరంగా ఉండాలి. నిపుణులు సూచించిన ఔషధాలను క్రమం తప్పకుండా వాడాలని వైద్యులు చెబుతున్నారు.

నిబ్బరం కోల్పోకూడదు..
సమస్యాత్మక పరిస్థితి ఎదురైందని భయాందోళన చెందకూడదు. దైర్యం కోల్పోకుండా, నివారణ మార్గాలపైనే దృష్టి సారించడం మేలు. హార్మోన్ సమస్య ఎదురైన వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలి. రక్తపరీక్షల ఫలితాల్ని బట్టి, తదుపరి చర్యలకు సంసిద్ధం కావాలి. దేహంలో టెస్టోస్టిరాన్​ను తరచుగా సాధారణ స్థితికి తేవాల్సి ఉంటుంది. అందుకు రీప్లేస్​మెంట్ చికిత్స అవసరం. తగినన్ని జాగ్రత్తలు పాటిస్తూ, సరైన సమయంలో వైద్యం చేయించుకుంటే మంచిది. దీంతో కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి పొందవచ్చు.

ABOUT THE AUTHOR

...view details