తీవ్ర కరోనా బాధితుల్లో సుమారు 1-2% మంది పక్షవాతం బారినపడుతున్నారు. మెదడు రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టటం, రక్తనాళాలు చిట్లి మెదడులో రక్తస్రావం కావటం.. ఇలా రెండు రకాలుగా పక్షవాతం రావొచ్చు సాధారణంగా 60 ఏళ్లు పైబడ్డవారిలో పక్షవాతం రావటం చూస్తుంటాం. ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, మితిమీరి మద్యం తాగటం, తగినంత శారీరక శ్రమ చేయకపోవటం వంటివి దీనికి దారితీస్తుంటాయి. కానీ కొవిడ్-19 మహమ్మారి దీన్ని మార్చేసింది. ముప్పు కారకాలేవీ లేకపోయినా కరోనా వైరస్ ఇన్‌ఫెక్షన్ అనంతరం ఎంతోమంది చిన్న వయసులోనూ పక్షవాతం బారినపడటం కనిపిస్తోంది. రోగనిరోధక వ్యవస్థ అతిగా స్పందించటం, వాపు ప్రక్రియ మూలంగా రక్తనాళాలు పూడుకుపోవటమే దీనికి చాలావరకు దోహదం చేస్తున్నాయి. మెదడులో ఇలాంటిది తలెత్తితే పక్షవాతం సంభవిస్తుంది. కొవిడ్ చికిత్సలో భాగంగా కొందరికి రక్తాన్ని పలుచగా చేసే మందులు ఇవ్వాల్సి వస్తోంది. కొందరిలో ఇవి మెదడులో రక్తస్రావమయ్యేలా చేయొచ్ఛు ప్లేట్‌లెట్లు తగ్గటంతోనూ రక్తం లీక్ కావొచ్ఛు ఇదీ పక్షవాతానికి దారితీస్తుంది. వీరిలో తికమక పడటం, మాట తత్తరపోవటం, చూపు మందగించటం, శరీరంలో ఒకవైపు మొద్దుబారినట్టు అనిపించటం, బలహీన పడటం, ముఖం ఒకవైపునకు జారిపోవటం, నడకతీరు అస్తవ్యస్తమవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
నిర్ధరణ-చికిత్స:పక్షవాతం లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయాల్సి ఉంటుంది. మెదడు స్కాన్, ఎంఆర్‌ఐ పరీక్షలతో మెదడులో ఏ భాగం దెబ్బ తిన్నదనేది తెలుస్తుంది. గ్లూకోజు, కొలెస్ట్రాల్ పరీక్షలూ చేయాల్సి ఉంటుంది. గుండె పనితీరు తెలుసుకోవటానికి ఈసీజీ, 2డీ ఎకో పరీక్షలూ అవసరమవుతాయి. రక్తం గూడు కట్టటం మూలంగా పక్షవాతం వస్తే తొలి 4-5 గంటల్లో రక్తనాళం ద్వారా టీపీఏ ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. శస్త్రచికిత్సతోనూ పూడికను తొలగించొచ్ఛు రక్తస్రావం మూలంగా పక్షవాతం వస్తే- రక్తపోటును అదుపులోకి తేవటం ముఖ్యం. రక్తాన్ని పలుచగా చేసే మందులు వాడుతున్నట్టయితే వాటిని ఆపేసి చికిత్స చేయాల్సి ఉంటుంది. ప్లేట్‌లెట్లు తగ్గితే ప్లేట్‌లెట్లు ఎక్కించాల్సి ఉంటుంది. ఒకవేళ మరీ ఎక్కువగా రక్తస్రావమైతే శస్త్రచికిత్స చేసి తొలగిస్తారు. పక్షవాతానికి సత్వరం చికిత్స చేస్తే మంచి ఫలితం కనిపించొచ్ఛ
వ్యాయామం ముఖ్యం:పక్షవాతం బారినపడ్డవారిలో కండరాల బలహీనత, సరిగా మాట్లాడలేకపోవటం, ముద్ద మింగలేకపోవటం, మతిమరుపు వంటివి దీర్ఘకాలం ఇబ్బంది పెట్టొచ్ఛు కొందరికి ఆలోచనలు అస్తవ్యస్తం కావొచ్ఛు పక్షవాతం తలెత్తిన భాగంలో నొప్పి, సూదులతో పొడుస్తున్న భావన కలగొచ్ఛు కొందరిలో వ్యక్తిత్వమూ మారిపోవచ్ఛు వీటి నుంచి కోలుకోవటానికి కొంత సమయం పడుతుంది. అందువల్ల క్రమం తప్పకుండా ఫిజియోథెరపీ చేయటం చాలా ముఖ్యం. శరీర నియంత్రణకు, కండరాల వృద్ధికి, కండరాలు సాగటానికి తోడ్పడే వ్యాయామాలు ఉపయోగపడతాయి. రోజుకు కనీసం 30-40 నిమిషాలైనా వ్యాయామాలు చేయాలి. స్పీచ్ థెరపీ కూడా అవసరమవ్వచ్ఛు
కండరాల్లో వాపు (మయోసైటిస్)
కొందరికి కేవలం కండరాల్లోనే వాపు తలెత్తొచ్ఛు దీన్ని మయోసైటిస్ అంటారు. వాపు ప్రక్రియ ప్రేరేపితం కావటం దీనికి కారణం. ఇది కొవిడ్-19లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. చికిత్సలో భాగంగా ఇచ్చే కొన్నిరకాల మందులూ మయోసైటిస్‌కు కారణం కావొచ్ఛు దీని బారినపడ్డవారిలో కండరాల బలహీనత, వాపు, నొప్పి వంటివి ప్రధానంగా వేధిస్తుంటాయి.
నిర్ధరణ-చికిత్స: రక్తంలో కండరాల ఎంజైమ్‌లు, యాంటీబాడీల పరీక్ష చేయాల్సి ఉంటుంది. కండరాల ఎంఆర్‌ఐ పరీక్ష చేస్తే ఏవైనా మార్పులుంటే బయటపడతాయి. కండరాల్లోకి ఎలక్ట్రోడ్లను ప్రవేశపెట్టి చేసే ఈఎంజీ పరీక్ష కూడా ఉపయోగపడుతుంది. మయోసైటిస్ తగ్గటానికి ప్రెడ్నిసోన్ వంటి స్టిరాయిడ్లు ఇవ్వాల్సి ఉంటుంది.
ఫిట్స్
కొందరికి ఫిట్స్ రావొచ్ఛు శ్వాస లక్షణాలు లేకపోయినా కొందరికి ఫిట్స్‌తోనే కొవిడ్-19 బయటపడుతోంది. ముందుగా దీనికి కారణమేంటన్నది చూసుకోవాల్సి ఉంటుంది. మందులతోనా, సోడియం స్థాయులు తగ్గటంతోనా, పక్షవాతంతోనా.. దేంతో ఫిట్స్ వస్తున్నాయన్నది పరిశీలించటం ముఖ్యం. కారణాన్ని బట్టి చికిత్సను నిర్ణయిస్తారు. సోడియం స్థాయులు తగ్గితే భర్తీ చేయటం.. రక్తపోటు, గ్లూకోజు పెరిగితే అదుపు చేయటం.. పక్షవాతం కారణమైతే తగు చికిత్స చేయటం.. మందులతో వస్తే వాటిని ఆపెయ్యటం వంటివి ఉపయోగపడతాయి. అలాగే ఫిట్స్ తగ్గటానికి అవసరమైతే మందులిస్తారు. ఈఈజీ, సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ పరీక్షలతో ఫిట్స్‌ను నిర్ధరిస్తారు. వెన్నులోంచి నీరు తీసి పరీక్షించటమూ అవసరమవ్వచ్ఛు
తీవ్ర జబ్బుతోనూ
కొవిడ్-19 తీవ్రమైనవారు ఎక్కువకాలం ఆసుపత్రిలో ఉండాల్సి రావొచ్ఛు వెంటిలేటర్ అమర్చాల్సి రావొచ్ఛు ఇలా ఎక్కువ రోజులు మంచం మీద ఉండాల్సి రావటం, ఎక్కువ రకాల మందులు వాడటం, జీవక్రియల్లో తలెత్తే మార్పుల వంటి వాటితో కండరాలు దెబ్బతినొచ్ఛు ఇది క్రిటికల్ ఇల్‌నెస్ మయోపతీ, న్యూరోపతీకి దారితీయొచ్ఛు ఇది కాస్త ఇబ్బందికరమైన పరిస్థితే. వీరికి క్రమం తప్పకుండా ఫిజియోథెరపీ చేయాల్సి ఉంటుంది. ఆక్సిజన్ స్థాయులు మెరుగు పడటానికి ఎక్కువసేపు బోర్లా పడుకోబెట్టినప్పుడు కొన్ని నాడులు ఒత్తిడికి గురై ఆయా భాగాలు చచ్చుబడొచ్ఛు దీన్ని సరైన సమయంలో గుర్తించి, ఫిజియోథెరపీ చేయటం అవసరం.
రుచి, వాసన తగ్గటం
ఇవీ నాడీ సంబంధ సమస్యలే. కొవిడ్-19 బాధితుల్లో చాలామందిలో రుచి, వాసన తగ్గటం చూస్తూనే ఉన్నాం. దీనికి మూలం వాసనను పసిగట్టే నాడీ కణాలు దెబ్బతినటం. ముక్కులో వాపు ప్రక్రియతోనూ రుచి, వాసన తగ్గొచ్ఛు ఇవి క్రమంగా మెరుగవుతుంటాయి. భయపడాల్సిన పనేమీ లేదు.
కొత్త కరోనా జబ్బు రెండు విధాలా దెబ్బతీస్తోంది. ఒకవైపు ఇన్‌ఫెక్షన్‌తో నేరుగా దాడిచేస్తోంది. మరోవైపు వైరస్‌ను ఎదుర్కోవటానికి తోడ్పడే రోగనిరోధక వ్యవస్థను అతిగానూ ప్రేరేపితం చేస్తోంది. కొవిడ్-19 తీవ్రమైనవారిలో ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్, ఇంటర్‌ల్యూకిన్ 6, డీడైమర్, ఫెరిటిన్ వంటి వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్) సూచికలు అవసరమైన దాని కన్నా ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నాయి. శరీరంలో ఏ భాగం మీదైనా దాడిచేయగల ఇవి మెదడు, నాడులు, మెదడుకు రక్త సరఫరా చేసే రక్తనాళాల పైనా తీవ్ర ప్రతాపం చూపుతున్నాయి. ఫలితంగా రకరకాల నాడీ సమస్యలు బయలుదేరుతున్నాయి. కొవిడ్-19తో ఆసుపత్రిలో చేరిన దాదాపు సగం మందిలో ఏదో ఒక నాడీ సంబంధ సమస్య కనిపిస్తుండటం గమనార్హం. ఒళ్లునొప్పులు (మయాల్జియాస్), తలనొప్పులు, తికమక పడటం, తాత్కాలిక మతిమరుపు వంటివన్నీ వీటిల్లో భాగమే. వయసు పైబడినవారికి, మధుమేహం, అధిక రక్తపోటు వంటి ఇతరత్రా సమస్యలు గలవారికి వీటి ముప్పు ఎక్కువ. గతంలో పక్షవాతం బారినపడ్డవారికి, కిడ్నీ సమస్యలతో బాధపడేవారికి ముప్పు ఇంకా ఎక్కువగా ఉంటోంది. కొవిడ్ చికిత్సలో భాగంగా ఇచ్చే మందులూ కొంతవరకు కారణం కావొచ్ఛు అందువల్ల కొవిడ్‌తో ముడిపడిన నాడీ సమస్యలపై అవగాహన కలిగుండటం అవసరం.
మెదడు మీద ప్రభావం (ఎన్‌కెఫలోపతి)
వైరస్ ప్రభావం లేదా వైరస్ మూలంగా ప్రేరేపితమయ్యే వాపు ప్రక్రియ మెదడును దెబ్బతీయటం.. అలాగే కాలేయం, కిడ్నీ వంటి అవయవాలు ప్రభావితం కావటంతో తలెత్తే జీవక్రియల మార్పులు దీనికి మూలం. కొవిడ్-19 తీవ్రమైనవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. కొందరికి జబ్బు తొలిదశలోనూ రావొచ్ఛు ఇందులో మెదడు పనితీరు అస్తవ్యస్తమవుతుంది. దీంతో మానసిక స్థితి దెబ్బతింటుంది. సంధి దశలో మాట్లాడినట్టు ఏవేవో మాట్లాడుతుంటారు. తికమక పడటం, కోపం, ఆందోళన, ఎక్కువసేపు నిద్రపోవటం, అంతగా స్పృహలో లేకపోవటం, మతిమరుపు, సరిగా ఆలోచించలేకపోవటం, ఏకాగ్రత కుదరకపోవటం వంటివీ ఉండొచ్ఛు కొందరికి ఫిట్స్ కూడా రావొచ్ఛు.
నిర్ధరణ-చికిత్స:మెదడు దెబ్బతిన్నట్టు అనుమానిస్తే ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, మానసిక సామర్థ్యాలు ఎలా ఉన్నాయన్నది పరీక్షిస్తారు. సీటీ, ఎంఆర్‌ఐ, వెన్నుపాము ద్రవం, ఈఈజీ పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఆక్సిజన్ మోతాదులు తగ్గకుండా చూసుకోవటం ముఖ్యం. రక్తపోటు, గ్లూకోజు అదుపులోకి తేవటమూ ముఖ్యమే. మత్తు కలిగించే మందులు వేసుకుంటుంటే మోతాదు సరిచేసుకోవాల్సి ఉంటుంది. కిడ్నీ, కాలేయ సమస్యలుంటే వాటికీ చికిత్స చేయాల్సి ఉంటుంది. ఇతరత్రా బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు తలెత్తితే తగు యాంటీబయోటిక్ మందులు వాడుకోవాల్సి ఉంటుంది. అవసరమైతే మూర్ఛ మందులు కూడా ఇస్తారు.
గిలియన్ బారీ సిండ్రోమ్