longevity diet: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం చాలా అవసరం. అది మన ఆయుర్దాయాన్ని సైతం ప్రభావితం చేయగలదు! కాబట్టి సరైన ఆహార నియమాలపై శ్రద్ధ అత్యావశ్యకం. ఇందుకోసం కీటో డైట్, మెడిటెర్రేనియన్ డైట్ వంటి పేర్లతో రకరకాల ఆహార విధానాలు ఇప్పటికే విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. అదే కోవలో ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పేరు- 'లాంజివిటీ డైట్'.
ఏమిటీ డైట్?
వాల్టర్ లాంగో అనే ఓ జీవరసాయన శాస్త్రవేత్త 'లాంజివిటీ (దీర్ఘాయువు) డైట్'ను రూపొందించారు. మనిషి జీవితకాలాన్ని బాగా పెంచేందుకు ఈ ఆహార విధానం దోహదపడుతుందని ఆయన చెబుతున్నారు. ఏం తినాలి? ఏం తినొద్దు? అనే అంశాలపై ఇందులో పలు సిఫార్సులు చేశారు. జన్యువులపై పోషకాల ప్రభావం, ఉపవాసం ఫలితాలపై లాంగో అనేక పరిశోధనలు చేశారు. లాంజివిటీ డైట్‌ను పక్కాగా పాటించడం ద్వారా 120 ఏళ్లు జీవించాలన్నది లాంగో ప్రణాళిక.
ఎవరి కోసం?
ప్రధానంగా వృద్ధుల కోసం ఈ ఆహార నియమాలను తయారుచేశారు. యువత కూడా వాటిని అనుసరించొచ్చని చెబుతున్నారు.
ఇందులో ఏముంటాయ్?:ఆకుకూరలు, ఫలాలు, బీన్స్, బాదం వంటి గింజలు (నట్స్), ఆలివ్ నూనె, పాదరసం తక్కువగా ఉండే సముద్ర సంబంధిత ఆహారం. మొక్కల నుంచి వచ్చే ఆహారంలో విటమిన్లు, ఖనిజ లవణాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. సంతృప్త కొవ్వులు, లవణాలు తక్కువగా ఉంటాయి. మొక్కల ఆధారిత ఆహారాన్నే ఈ డైట్లో అధికంగా సిఫార్సు చేశారు. ఇది మెడిటెర్రేనియన్ డైట్‌కు దగ్గరగా ఉంటుంది.
వేటికి దూరంగా ఉండాలి?
మాంసం, పాల ఉత్పత్తులు (పెరుగు మినహా) ఎక్కువగా తినకూడదు. సంతృప్త కొవ్వులు, చక్కెరలు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవద్దు. పాల ఉత్పత్తులకు దూరంగా ఉండలేనివారు.. ఆవు/మేక/గొర్రె పాలు తీసుకోవచ్చు.