తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

ఈ చిట్కాలతో కరోనా లక్షణాల నుంచి ఉపశమనం! - How to face coronavirus

ప్రస్తుతం ప్రపంచ దేశాలను కుదిపేస్తోంది కరోనా. ఈ వైరస్​ బారిన పడకుండా ఉండేందుకు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అందరిదీ ప్రశ్న. జాగ్రత్తగా గమనిస్తే మన కళ్ల ముందే ఎన్నో ఔషధాలు ఉన్నాయి. వంటింట్లో ఉన్న వస్తువులతోనే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అవి ఏమిటి, ఎలా ఉపయోగించాలి వంటి విషయాలు తెలుసుకుందాం.

Let's face Corona with home made tips
చిట్కాలతోనే కరోనాను ఎదుర్కొందాం ఇలా!

By

Published : Mar 31, 2020, 10:56 AM IST

Updated : May 21, 2020, 4:50 PM IST

కరోనా.. కరోనా.. కరోనా.. ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తోన్న మహమ్మారి. దీని దెబ్బకు దేశాలకు దేశాలే గిరిగీసుకొని, తమకు తామే కట్టడి చేసేసుకున్నాయి.

నిజానికి మహమ్మారులు మనకు కొత్త కాదు. అనాదిగా వెంటాడుతున్నవే. వీటిని ఎదుర్కోవటానికి, తట్టుకోవటానికి మనిషి ప్రాచీన కాలం నుంచీ పోరాడుతూనే ఉన్నాడు. రోగనిరోధకశక్తిని పెంచుకుంటూ, శారీరక సామర్థ్యాన్ని ఇనుమడించుకుంటూ మనుగడ సాగిస్తూనే వస్తున్నాడు. ప్రస్తుతం భయపెడుతున్న కొవిడ్‌-19 కొత్త ఇన్‌ఫెక్షనే అయినా మన ఆయుర్వేదం ఇలాంటి మహమ్మారుల గురించి వేల ఏళ్ల కిందటే ప్రస్తావించింది. ఇంట్లో అందరికీ అందుబాటులో ఉండే కొన్ని దినుసులతోనూ దగ్గు వంటి కరోనా లక్షణాల నుంచి ఉపశమనం పొందొచ్చు.

  • జలుబు, దగ్గు తగ్గటానికి అల్లం, పసుపు అమోఘంగా పనిచేస్తాయి. ఇవి రెండూ ఒక జాతికి చెందినవే. అల్లాన్ని ఇండియన్‌ ఆస్ప్రిన్‌ అనీ అంటారు. అల్లం అలర్జీని ప్రేరేపించే రసాయనాలను, పసుపు శోధను (ఇన్‌ఫ్లమేషన్‌) తగ్గిస్తాయి. అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి, నీటిలో మరిగించి.. అందులో కాస్త పసుపు, బెల్లం కలిపి.. గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. అల్లం చెక్కు తీసి చిన్న ముక్కలుగా చేసి నాలుక మీద వేసుకొని చప్పరించినా మేలే. అల్లం రసంలో మిరియాల పొడి కలిపి.. తేనె లేదా పాలతో తీసుకోవచ్చు.
  • పాలలో కొద్దిగా పసుపును కలిపి తీసుకోవచ్చు. పసుపు కొమ్ములను కొనుక్కొని దంచి పసుపు తయారుచేసుకుంటే ఇంకా మంచిది.
  • వెల్లుల్లి రోగనిరోధక శక్తి పెరగటానికి తోడ్పడుతుంది. దీన్ని వేయించి తినొచ్చు. ఆవిరి మీద ఉడికించి తినొచ్చు. అల్లం, వెల్లుల్లి ముద్దను కూరలో వేసుకోవచ్చు. వెల్లుల్లిని చారులో వేసుకొని తీసుకోవచ్చు. వీలైతే వెల్లుల్లి రసాన్నీ తీసుకోవచ్చు. కాకపోతే ఈ రసం చాలా ఘాటుగా ఉంటుంది.
  • అరటిపండును మిరియాల పొడితో అద్దుకొని తింటుంటే దగ్గు తగ్గుతుంది.
  • లవంగాలను నోట్లో వేసుకొని చప్పరిస్తున్నా దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది.
  • మిరియాల పొడి, దాల్చినచెక్క పొడి, పసుపును గ్రాము మోతాదులో పాలలో కలిపి తీసుకుంటే మంచి ఉపశమం కలుగుతుంది.
  • తులసి ఆకులకు వైరస్‌ను అడ్డుకునే గుణముంది. తులసి ఆకులను అలాగే తినొచ్చు. లేదూ ఆకుల రసంలో చిటికెడు పసుపు కలిపి తీసుకోవచ్చు.
  • బాదం గింజలను నానబెట్టి పొట్టుతీసి వెన్న, పంచదార కలిపి దంచి తీసుకుంటే జలుబు, దగ్గు తగ్గుతాయి.
  • తానికాయ పెచ్చులు, మిరియాలు, ఉప్పు కలిపి పొడి చేసుకోవాలి. దీన్ని కొద్దికొద్దిగా నాలుక మీద వేసుకొని చప్పరిస్తే దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.
  • పిప్పళ్లు, శొంఠి, ఎండు మునగ ఆకులు, యాలకులు కలిపి పొడి చేసుకోవాలి. దీన్ని ఒక గ్రాము మోతాదులో పాలలో లేదా తేనెతో కలిపి తీసుకుంటే దగ్గు ఉపశమిస్తుంది.
  • కొద్దిగా వేయించిన పిప్పళ్ల పొడిలో కాస్త సైంధవ లవణం కలిపి చప్పరించొచ్చు.
  • ద్రాక్ష శ్వాస సమస్యలకు బాగా పనికొస్తుంది. ఎండు ద్రాక్షను తరచూ తీసుకుంటుంటే దగ్గు తగ్గుతుంది.

కరోనా క్షుద్ర శ్వాసే

ఆయుర్వేదం ప్రకారం శ్వాస సమస్యలు రెండు రకాలు. 1. కాస. 2 శ్వాస. కాస అంటే దగ్గు. నోటి నుంచి ఒక కుత్సిత శబ్దంతో వెలువడుతుంది కాబట్టి కాస అని పేరు. ఊపిరి తీసుకోవటం, వదలటంలో ఇబ్బంది కలిగించే సమస్యలు శ్వాస కిందికి వస్తాయి. ఇందులో మహా శ్వాస, ఊర్ధ్వ శ్వాస, తమక శ్వాస, ఛిన్న శ్వాస, క్షుద్ర శ్వాస అనీ రకాలున్నాయి. వీటిల్లో కరోనా ఇన్‌ఫెక్షన్‌ లక్షణాలు, స్వభావం దాదాపుగా క్షుద్ర శ్వాసకు సరిపోతాయి. క్షుద్ర అంటే చిన్నది, తేలికైనదని అర్థం. చాలావరకు దానంతటదే తగ్గిపోయే సమస్య. మామూలు జలుబు, పడిశం (ప్రతిశ్యాయం) వంటివి క్షుద్ర శ్వాసలోనివే. ఆయుర్వేదం దృష్టితో పరిశీలిస్తే కరోనా ఇన్‌ఫెక్షన్‌ దీని కిందికే వస్తుంది. నూటికి 80% మందిలో ఇది పెద్దగా సమస్యలేవీ సృష్టించటం లేదని, దానంతటదే తగ్గిపోతోందని.. కొద్దిమందిలోనే న్యుమోనియా వంటి తీవ్ర సమస్యలకు దారితీస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నదే. కరోనా అత్యయికంగా అప్పటికప్పుడు వచ్చే సమస్య. కొద్దిరోజుల వరకూ లక్షణాలేవీ ఉండవు. ఆ తర్వాత పొడి దగ్గు వస్తుంది. ఆయుర్వేదంలో పొడిదగ్గును శుష్క కాస అంటారు. శుష్క కాసతో ముడిపడిన సమస్యలన్నీ క్షుద్ర శ్వాసగానే పరిగణించాల్సి ఉంటుంది.

శ్వాస సమస్యలకు రెండు రకాలుగా చికిత్సలు:

1 ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచటం.

ఇది ఒకట్రెండు రోజుల్లో అయ్యే పనికాదు. కనీసం రెండు మూడు నెలలైనా పడుతుంది. గాఢంగా శ్వాస తీసుకోవటం (ప్రాణాయామం వంటి పద్ధతులు), వేణువు వంటి వాద్యాలను సాధన చేయటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, వేగంగా నడవటం, బరువులెత్తటం వంటివి ఊపిరితిత్తుల బలోపేతానికి తోడ్పడతాయి. ముందు నుంచే ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే అసలు జబ్బు బారినపడకుండానే చూసుకోవచ్చు.

2 రోగనిరోధక శక్తిని పెంచుకోవటం.

మంచి ఆహారం తీసుకోవటం, కంటి నిండా నిద్రపోవటం, చిరు చెమట పట్టేంతవరకు వ్యాయామం చేయటం, శాస్త్ర విహితమైన శృంగారం, ప్రశాంతత వంటివన్నీ ఓజస్సు (వ్యాధి క్షమత్వశక్తి) వృద్ధి చెందటానికి తోడ్పడతాయి. ఇదీ అప్పటికప్పుడు పెరిగేది కాదు. క్రమబద్ధమైన జీవన విధానంతోనే సాధ్యం. మరి జబ్బులు వచ్చినప్పుడు మార్గమేంటి? ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకునే ఊపిరితిత్తులను బలోపేతం చేసే, శ్లేష్మం ఎక్కువగా తయారుకాకుండా చేసే దినుసులను, ఔషధాలను ఆయుర్వేదం సూచించింది. ఇవి చికిత్స గానే కాదు, జబ్బు రాకుండానూ కాపాడతాయి.

  • అగస్త్య రసాయనం: మనం శ్వాసించిన ప్రతిసారీ సుమారు అరలీటరు గాలిని పీల్చుకొని, వదులుతుంటాం. చాలామందిలో ఇంత సామర్థ్యం ఉండదు. దీన్ని పెంచుకోగలిగితే సూక్ష్మక్రిముల దుష్ప్రభావాల నుంచి తప్పించుకోవచ్చు. ఇందుకు అగస్త్య రసాయనం ఎంతగానో ఉపయోగపడుతుంది. శ్వాస సమస్యల చికిత్సకు, నివారణకు బాగా పనిచేస్తుంది. రెండు వేల ఏళ్లకు ముందే ఆయుర్వేదం దీన్ని సూచించింది. రసాయనాలు శరీరానికి బలాన్నిచ్చే ఔషధాలు. వీటితో ఆయుష్షు వృద్ధి చెందుతుంది. అగస్త్య రసాయనం ఊపిరితిత్తులకు మంచి బలాన్ని ఇస్తుంది. దీన్ని రోజూ 5 గ్రాముల చొప్పున తీసుకుంటే శ్లేష్మం తగ్గుతుంది. దుమ్ముధూళి, వైరస్‌ల వంటివి ప్రవేశించినా వాటిని తట్టుకునే సామర్థ్యం లభిస్తుంది.
  • కఫ కేతు రసం: ఇందులో ప్రధానంగా టంకణ భస్మం (బొరాక్స్‌) ఉంటుంది. ఇది ఊపిరితిత్తులకు మంచి బలాన్నిస్తుంది. దీనిలోని పిప్పళ్లు, శంఖ భస్మం వంటివి జలుబు, దగ్గు తగ్గటానికి తోడ్పడతాయి.
  • అభ్రక భస్మం: 100 గ్రాముల సితోపలాది చూర్ణం లేదా తాళిసాది చూర్ణంలో 2-3 గ్రాముల అభ్రక భస్మం కలిపి.. ఉదయం, సాయంత్రం 5 గ్రాముల చొప్పున తీసుకుంటే మేలు చేస్తుంది.
  • వాసా కంటకారి లేహ్యం: దగ్గు ఎక్కువగా ఉంటే ఇది బాగా ఉపయోగపడుతుంది. 5 గ్రాముల చొప్పున రోజుకు 2-3 సార్లు చప్పరించాలి.
  • హరిద్రా ఖండ్​:దీన్ని రోజుకు ఒకసారి చెంచా మోతాదులో పాలలో కలిపి తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది.
  • నేల వేము: దీన్నే కిరాత తిక్త అంటారు. మహా చేదుగా ఉంటుంది. గతంలో కరోనా జాతి వైరస్‌తోనే వచ్చిన సార్స్‌లో ఇది సమర్థంగా పనిచేస్తున్నట్టు బయటపడింది. నేల వేము చూర్ణాన్ని ఒక గ్రాము మోతాదులో తేనెతో గానీ వేడి పాలతో గానీ తీసుకుంటే యాంటీ వైరల్‌గా పనిచేస్తుంది. కరోనా వైరస్‌ ఒంట్లోకి చేరినా ఎదుర్కొనే సామర్థ్యం వస్తుంది.
  • త్రికటు చూర్ణం: రోజూ 2-3 గ్రాముల చొప్పున త్రికటుక (శొంఠి, పిప్పళ్లు, మిరియాలు) చూర్ణం తీసుకుంటే దగ్గు, ఆయాసం తగ్గుతాయి. దీన్ని మరోలా కూడా తీసుకోవచ్చు. 25 గ్రాముల త్రికటు చూర్ణంలో 50 గ్రాముల యష్టిమధు చూర్ణం, 5 గ్రాముల తిప్ప సత్తు కలిపి రోజూ 2 గ్రాముల చొప్పున ఉదయం, సాయంత్రం తేనెతో లేదా వేడి నీళ్లతోనూ తీసుకోవచ్చు. దీంతో ఆయాసం, శ్లేష్మం తగ్గుతాయి. ఊపిరితిత్తులకు బలం చేకూరుతుంది.
  • అడ్డసరం: దీన్నే వాసా అంటారు. అడ్డసరం ఆకులను నిప్పుల మీద కాస్త వెచ్చచేసి రసాన్ని తీసి.. అందులో చక్కెర కలిపి తీసుకుంటే దగ్గు, జలుబు తగ్గుతాయి.
  • అణుతైలం: ఇది నస్య క్రియగా ఉపయోగపడుతుంది. దీన్ని ఉదయం, సాయంత్రం రెండు చుక్కల చొప్పున ముక్కులో వేసుకుంటే సూక్ష్మక్రిముల బారినపడకుండా చూసుకోవచ్చు.

జన వినాశకాలు

చిట్కాలతోనే కరోనాను ఎదుర్కొందాం ఇలా!

మహమ్మారులను చరక, సుశ్రుత సంహితలు ఔపసర్గిక వ్యాధులుగా, జనపదో ధ్వంసాలుగా పేర్కొన్నాయి. వీటికి మూలం జల, వాయు, దేశ, కాల మార్పులు. ఆధునిక దృష్టితో చూస్తే వీటినే వాతావరణ మార్పులనుకోవచ్చు. వ్యాధి గలవారితో సన్నిహితంగా మెలగటం (ప్రసంగాత్‌), తాకటం (గాత్ర సంస్పర్సాత్‌), ఒకరు వదిలిన శ్వాస- తుంపర్లు పీల్చటం (నిశ్వాసాత్‌), కలిసి తినటం (సహ భోజనాత్‌), కలిసి కూర్చోవటం, పడుకోవటం (సహ శయసనాత్‌).. ఒకరి దుస్తులు, సౌందర్య సాధనాలు, ఆభరణాలు మరొకరు వాడటం (వస్త్ర, మాల్య, అనులేపనాత్‌) వంటి వాటితో ఇవి సంక్రమిస్తాయి. కరోనా వంటివీ ఇలాగే వ్యాపిస్తుండటం గమనార్హం.

జాగ్రత్త పాటించాలి

  • సబ్బుతో చేతులు కడుక్కోవటం, ముక్కుకు నోటికి రుమాలు కట్టుకోవటం, ఆరుబయట ఉమ్మకపోవటం వంటి వాటితో ఇన్‌ఫెక్షన్లు ఇతరులకు వ్యాపించకుండా చూసుకోవచ్చు. వీటితో పాటు మరికొన్ని జాగ్రత్తలూ పాటించాలి.
    చిట్కాలతోనే కరోనాను ఎదుర్కొందాం ఇలా!
  • చల్లటి పదార్థాలు, పానీయాలకు దూరంగా ఉండాలి. చల్లటి గాలికి తిరగకపోవటం మంచిది.
    చిట్కాలతోనే కరోనాను ఎదుర్కొందాం ఇలా!
  • అరగంటకు ఒకసారైనా నీళ్లు తాగాలి. గోరువెచ్చటి నీళ్లయితే ఇంకా మంచిది. ఒకవేళ వైరస్‌ గొంతులో ఉంటే నీళ్లు తాగినప్పుడు కడుపులోకి వెళ్లిపోతుంది. కడుపులోకి వెళ్లాక వైరస్‌ ఏమీ చేయలేదు.
    చిట్కాలతోనే కరోనాను ఎదుర్కొందాం ఇలా!
  • క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, సమతులాహారం తీసుకోవటం ద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని, రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు.
    చిట్కాలతోనే కరోనాను ఎదుర్కొందాం ఇలా!
  • పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే దుమ్ముధూళి, వాయు కాలుష్యానికి దూరంగా ఉంటే ఊపిరితిత్తులు బలోపేతమవుతాయి.

(పీవీ రంగనాయకులు, విశ్రాంత ఆచార్యులు- శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద కళాశాల, తిరుపతి)

ఇదీ చూడండి:'కరోనాపై పోరుకు అసాధారణ నిర్ణయాలు అనివార్యం'

Last Updated : May 21, 2020, 4:50 PM IST

ABOUT THE AUTHOR

...view details