వైద్యులు రోగులను పూర్తిగా పరిశీలించిన తర్వాతే లేజర్ చికిత్సను సూచిస్తారు. అయితే ఈ చికిత్సతో దుష్పభావాలు కొందరిలో ఎదురవుతున్నా చాలా వరకు ఇది మంచి ఫలితాలనే ఇస్తోంది. శారీరకంగా, మానసికంగా సిద్దమైన తర్వాత వెళ్తే సురక్షితంగా చికిత్సను పొందే వీలు ఉంటుంది. కంటి అద్దాలు, కాంటాక్ట్ లెన్స్‌ల అవసరం ఉండి, వాటిని వాడకూడదని అనుకునేవారు ఒక లేజర్ సర్జరీ చేయించుకోవచ్చు. అదే లాసిక్ సర్జరీ.
దగ్గరి వస్తువులే కనిపించే హ్రస్వదృష్టి లేదా దూరపు వస్తువులే కనిపించే దీర్ఘదృష్టి ఉన్నప్పుడు ఈ చికిత్స బాగా పనిచేస్తుంది. బయటి నుంచి వచ్చే కాంతి కిరణాలు కంటిలోని రెటీనా పొర మీద కేంద్రీకరించకపోవటం వల్ల కంటిలోని కార్నియా ఆకారం సరిగ్గా లేకపోవవటం వల్ల ఏర్పడే దృష్టి సమస్యలను తొలగించేందుకు లాసిక్ సర్జరీ ఉపయోగపడుతుంది.లాసిక్ సర్జరీలో లేజర్ సాయంతో కంటిలోని కార్నియా మందాన్ని, ఒంపును వైద్యులు సరిచేస్తారు.
ఈ ట్రీట్ మెంట్‌కు ముందు కంటి సర్జన్.. కంటిని ఎలా ఉందో సునిశితంగా పరిశీలిస్తారు. అలాగే కళ్లు పొడిబారటం, లకోమా, క్యాట్రాట్ లాంటి కంటి సమస్యలు ఉన్నాయో లేవో తెలుసుకుంటారు. ఈ సమస్యలు ఉన్నవారికి లేజర్ చికిత్స చేస్తే తీవ్రమైన పరిణామాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఈ చికిత్స చేసేందుకు సుమారు అరగంట సమయం పడుతుంది.
"చూపు సరిగ్గా కనిపించని వారికి మైనస్ పవర్, ప్లస్ పవర్ అనేది ఉంటుంది. మైనస్ పవర్‌ను మయోపియా, ప్లస్ పవర్‌ను హైపరోపియా అని అంటారు. ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల వినియోగం ఎక్కువయ్యే సరికి మైనస్ పవర్ పెరిగిపోతోంది. ఇప్పుడు చాలా మంది లేజర్ చికిత్స వైపు మొగ్గు చూపిస్తున్నారు. కాంటాక్ట్ లెన్స్‌ల వల్ల సమస్యలు వస్తుండటం వల్ల లేజర్ చికిత్స చేయించుకునేందుకు సిద్దమవుతున్నారు. అయితే ఈ చికిత్సకు ముందు ఒక స్క్రీనింగ్ చేస్తాం. కంటిలోని కార్నియా పొరకు ప్రమాదం లేదని నిర్దరణకు వచ్చాకే చికిత్స మొదలుపెడతాం" అని ప్రముఖ ఆప్తల్ మాలజిస్ట్ 'డాక్టర్ నిమ్మగడ్డ శ్రీలక్ష్మి చెప్పుకొచ్చారు'.
లేజర్ చికిత్సతో కంటి సమస్యలు పూర్తిగా తగ్గుతాయా?.. ఆ సమస్యలు ఉన్నవారు చేయించుకోవచ్చా? లేజర్ కంటి చికిత్సతో పలు మంచి ప్రయోజనాలు ఉన్నాయి. ఈ చికిత్స ద్వారా తక్షణ ఫలితాలను, శాశ్వత ప్రయోజనాలను పొందొచ్చు. ఇది నొప్పి లేని సర్జరీ. అయితే దీనికి వెళ్లేవారు వైద్యులు సూచించిన సలహాలను తప్పకుండా పాటించాలి. కంటి సర్జన్ సమస్యను బట్టి అవసరమైన చికిత్సను సూచిస్తారు. అలాగే రోగి తాలూకు సాధారణ ఆరోగ్యాన్ని గురించి తెలుసుకుంటారు. కళ్లకు సంబంధం లేని కొన్ని అనారోగ్యాల వల్ల లాసిక్ చికిత్సతో వచ్చే ఫలితాలు తగ్గే అవకాశం ఉంది.
అలాగే రోగనిరోధక వ్యవస్దకు సంబంధించిన కొన్ని అనారోగ్యాలు రొమటాయిడ్ ఆర్దరైటిస్, హెచ్ఐవీ లాంటివి ఉన్నప్పుడు సర్జరీ తర్వాత కోలుకోవడం కష్టమవుతుంది. నియంత్రణలో లేని మధుమేహం ఉంటే డయాబెటిక్ రెటినోపతికి దారితీసే ప్రమాదం ఉంది. కాబట్టి అలాంటి సమస్యలు లేవని నిర్దారించుకున్నాకే వైద్యులు లేజర్ చికిత్స చేస్తారు.
"స్క్రీనింగ్ లేకుండా లేజర్ చికిత్స చేయకూడదు. స్క్రీనింగ్ ద్వారా 90 శాతం రిస్క్‌ను ముందే పసిగట్టి తొలగించొచ్చు. మిగిలిన పది శాతం సర్జరీ చేసేటప్పుడు ఇన్ఫెక్షన్ రాకుండా జాగ్రత్త పడటం. అలాగే ఆపరేషన్ అనంతరం సరిగ్గా మందులు వాడటం, శుభ్రతను పాటించడం. సర్జరీ తర్వాత రెండు నుంచి మూడు వారాల వరకు శుభ్రతను పాటిస్తూ, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే దాంతో కళ్లను పదే పదే తుడవడం, ముట్టుకోవడం లాంటివి చేయకూడదు. దీని వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది. సర్జరీ తర్వాత ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే వైద్యులను సంప్రదించాలి" అని డాక్టర్ నిమ్మగడ్డ శ్రీలక్ష్మి సూచించారు.
చికిత్స చేయించుకున్నా.. అద్దాలు వాడాల్సిందే!
లేజర్ చికిత్స తీసుకున్నవారిలో దాదాపు అందరికీ చూపు సమస్యలు తగ్గే అవకాశం ఉంది. అయితే వయసు పెరిగాక చదువుతున్నప్పుడు అద్దాలు వాడాల్సిన అవసరం రావొచ్చు. రోగికి దృష్టిలోపం ఏ స్థాయిలో ఉందనే దాన్ని బట్టి ఈ చికిత్స ప్రభావం ఉంటుంది. 20 ఏళ్లు పైబడిన తర్వాత ఈ ట్రీట్ మెంట్ చేయించుకోవడం మంచిది. గర్బవతులు, పాలిచ్చే తల్లులు, స్టెరాయిడ్స్ తీసుకుంటున్నవారిలో తాత్కాలికంగా చూపు స్దాయిలో మార్పులు వస్తుంటాయి. కాబట్టి దృష్టి స్థిరం అయ్యేంత వరకు ఆగి తర్వాత లేజర్ చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది. సర్జరీ తర్వాత వచ్చే సమస్యలకు వైద్యులను అడిగి తగిన చికిత్స పొందాలి. ఆపరేషన్‌కు ముందు తర్వాత కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.