తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

గుండె పోటు ముప్పును ముందే పసిగట్టండిలా.. - కాల్షియం హార్ట్ ఎటాక్

Calcium Heart Test: గుండెపోటు హఠాత్తుగా సంభవించేదే కావొచ్చు. కానీ దీనికి చాలాకాలం ముందే.. ఆ మాటకొస్తే ఎన్నో ఏళ్ల ముందే బీజం పడుతుంది. దీన్ని గుర్తించగలిగితే ప్రమాదాన్ని ఆదిలోనే పసిగట్టొచ్చు. పెను ప్రమాదంగా మారకుండా చూసుకోవచ్చు. మరి దీన్ని కనుక్కునేదెలా? ఇందుకు తేలికైన మార్గం లేకపోలేదు. అదే క్యాల్షియం హార్ట్‌ స్కోర్‌. గుండె రక్తనాళాల్లో పోగుపడ్డ క్యాల్షియం మోతాదును తెలిపే దీన్ని సీటీ స్కాన్‌ పరీక్షతో ఇట్టే తెలుసుకోవచ్చు. అదీ యాంజియోగ్రామ్‌ మాదిరిగా శరీరానికి కోత పెట్టాల్సిన అవసరం లేకుండానే.

calcium heart test
calcium heart test

By

Published : Jan 11, 2022, 6:42 PM IST

Calcium Heart Test: చిన్నా పెద్దా తేడా లేకుండా ఎంతోమందిని కబళిస్తున్న అతిపెద్ద సమస్య గుండెపోటు. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే ఇది మనదేశంలో పదేళ్ల ముందుగానే దాడి చేస్తోంది. దీని బారినపడుతున్నవారిలో సుమారు 50% మంది 50 ఏళ్ల లోపువారే! ఎంతోమంది చిన్నవయసులోనే దీనికి బలైపోతున్నారు. గుండెజబ్బు అనగానే అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్‌, కుటుంబంలో ఎవరికైనా గుండెజబ్బు వచ్చి ఉండటం వంటి వాటినే ప్రధానంగా చూస్తారు. ఇలాంటి ముప్పు కారకాలేవీ లేకపోతే అంతా బాగుందని, గుండె బలంగానే ఉందని భావిస్తుంటారు. ఇది పూర్తిగా నిజం కాదు. పూడికలున్నా కొందరికి ఎలాంటి లక్షణాలు లేకపోవచ్చు. పైకి అంతా బాగానే ఉండొచ్చు. అప్పటికి ముప్పు తలెత్తకపోయినా మున్ముందు ఉన్నట్టుండి విరుచుకుపడొచ్చు. అందువల్ల గుండె రక్తనాళాల్లో పూడికల ఆనవాళ్లను గుర్తించటమూ ముఖ్యమే. వీటిని లోపల్నుంచి చూడాలంటే యాంజియోగ్రామ్‌ చేయాల్సిందే. అయితే అందరికీ ఇది కుదరకపోవచ్చు. పైగా ఇందులో రక్తనాళానికి గాటు పెట్టి గొట్టాన్ని లోపలికి పంపించాల్సి ఉంటుంది. అనవసరంగా రక్తనాళానికి కోత పెట్టటం మంచిది కాదు. అంత సాహసం చేసి యాంజియోగ్రామ్‌ చేసినా పూడికల ఆనవాళ్లేవీ కనిపించకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లోనే క్యాల్షియం హార్ట్‌ స్కోరు తేలికైన, విశ్వసనీయమైన పరీక్ష మార్గంగా ప్రాచుర్యం పొందుతోంది.

ఏంటీ క్యాల్షియం స్కోర్‌?

Calcium Heart rate:గుండె కూడా కండరమే. ఇది పనిచేయటానికీ రక్తం అవసరం. ప్రధానంగా మూడు రక్తనాళాలు గుండెకు రక్త సరఫరా చేస్తుంటాయి. వీటిల్లో ఎక్కడ పూడిక తలెత్తినా ఇబ్బందే. గుండెపోటుకు మూలం ఇదే. పూడికల మూలంగా గుండెకు రక్త సరఫరా తగ్గుతుంది. కొన్నిసార్లు పూడికలు ఉన్నట్టుండి రక్తనాళం గోడ నుంచి విడిపోవచ్చు. దీంతో రక్తనాళం చిట్లిపోయి రక్తం గడ్డకట్టొచ్చు. ఫలితంగా రక్తనాళం మూసుకుపోయి, రక్త సరఫరా పూర్తిగా నిలిచిపోతుంది. ఇది గుండెపోటుకు దారితీస్తుంది. మన రక్తనాళాల గోడలో మూడు పొరలుంటాయి. వీటిల్లో పూడిక ఎక్కడైనా ఏర్పడొచ్చు. ఈ పూడికల్లో కొవ్వు మాత్రమే కాదు.. గట్టిపడిన కణజాలం, క్యాల్షియం కూడా ఉంటాయి. ఇవి క్రమంగా గట్టిపడుతూ వస్తాయి (కాల్సిఫికేషన్‌). దీంతో గుండెకు రక్తసరఫరా అస్తవ్యస్తం కావటమే కాదు, రక్తనాళాలు సాగే గుణమూ తగ్గుతుంది. పూడిక పెద్దగా ఉన్నా కొన్నిసార్లు క్యాల్షియం మోతాదు తక్కువగా ఉండొచ్చు. చిన్న పూడికల్లోనూ క్యాల్షియం మోతాదు ఎక్కువుండొచ్చు. క్యాల్షియం మోతాదు ఎంత ఎక్కువగా ఉంటే పూడిక అంత ప్రమాదకరంగా పరిణమిస్తుంది. ఒకరకంగా దీన్ని గుండెలో టైమ్‌ బాంబ్‌గా అనుకోవచ్చు. దీన్ని గుర్తించటానికే క్యాల్షియం హార్ట్‌ స్కాన్‌ పరీక్ష ఉపయోగపడుతుంది.

.

ఎక్కడిదీ క్యాల్షియం?

సాధారణంగా వయసు మీద పడుతున్నకొద్దీ రక్తనాళాల్లో క్యాల్షియం పోగుపడటం ఆరంభిస్తుంది. దీనికీ మనం ఆహారం ద్వారా తీసుకునే క్యాల్షియానికీ సంబంధం లేదు. క్యాల్షియం మాత్రలతోనూ సంబంధం లేదు. మొదట్లో పూడికలు మృదువుగానే ఉంటాయి. క్రమంగా గట్టిపడుతూ వస్తాయి. ఇందులో క్యాల్షియంతో పాటు గట్టిపడే కణజాలమూ పాలు పంచుకుంటుంది.

క్యాల్షియం స్కోర్‌ ప్రాధాన్యతేంటి?

calcium score test:గుండె స్కానింగ్‌ పరీక్షలో క్యాల్షియం ఉన్నట్టు తేలితే రక్తనాళాల్లో కొలెస్ట్రాల్‌ నూటికి నూరు పాళ్లు ఉన్నట్టే. దీని స్కోర్‌ ఆధారంగా గుండెపోటు ముప్పును చాలావరకు ముందుగానే అంచనా వేయొచ్చు. ఉదాహరణకు 45 ఏళ్ల వ్యక్తికి క్యాల్షియం స్కోర్‌ సున్నా ఉందనుకుందాం. అతడికి 15 ఏళ్ల వరకు గుండెపోటు వచ్చే అవకాశం లేదని చెప్పుకోవచ్చు. అదే క్యాల్షియం స్కోర్‌ 1000 ఉన్నట్టయితే గుండెపోటు ముప్పు 37 రెట్లు ఎక్కువ. ఇలా దీని ద్వారా మున్ముందు తలెత్తనున్న గుండెపోటును చాలావరకు అంచనా వేయొచ్చు. ఈ పరీక్ష విప్లవాత్మక మార్పులు తీసుకురానుందని అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ మార్గదర్శకాల్లో పేర్కొనటం గమనార్హం. అకస్మాత్తుగా 30-60 ఏళ్ల వయసువారిలో సంభవిస్తున్న గుండెపోటు మరణాలను దీంతో ముందే గుర్తించొచ్చని సూచిస్తోంది. అనవసరంగా యాంజియోగ్రామ్‌, స్ట్రెస్‌ పరీక్షలు చేయటాన్నీ నివారించొచ్చు. స్టాటిన్‌, ఆస్ప్రిన్‌ మాత్రలు ఎవరికి అవసరమనేది కచ్చితంగా గుర్తించొచ్చు కూడా. ఇలా అనవసరంగా ఈ మాత్రలను వాడకుండా చూసుకోవచ్చు.

పూడికల తీరుతెన్నులూ

సీటీ స్కాన్‌ పరీక్షలో క్యాల్షియం స్కోర్‌ మాత్రమే కాదు.. పూడిక మృదువుగా ఉందా? గట్టిగా ఉందా? అనేవీ తెలుస్తాయి. బుడిపెలు బుడిపెలుగా ఉన్నా బయట పడుతుంది. కొలెస్ట్రాల్‌ ఎక్కువుంటే పూడిక మృదువుగా ఉంటుంది. క్యాల్షియం ఎక్కువుంటే గట్టిగా ఉంటుంది. కొన్నిసార్లు కొవ్వుతో పాటు క్యాల్షియం కూడా కలిసి ఉండొచ్చు. వీటిని మిశ్రమ పూడికలు అంటారు. ఇవి చాలా ప్రమాదకరమైనవి. చిట్లిపోయే అవకాశం ఎక్కువ. పూడిక మీది పొర మందమూ స్కాన్‌లో బయట పడుతుంది. పొర పలుచగా ఉంటే చిట్లిపోయే అవకాశం ఎక్కువ.

రేడియేషన్‌ తక్కువే

స్కానింగ్‌తో రేడియేషన్‌ దుష్ప్రభావం పడుతుందని కొందరు భావిస్తుంటారు. నిజానికి దీంతో వెలువడే రేడియేషన్‌ 0.5 మిల్లీ సివర్ట్స్‌ కన్నా తక్కువే. ఇది ఒక వెన్నెముక ఎక్స్‌రేతో సమానం. రేడియేషన్‌ దుష్ప్రభావం ఎక్కువగా ఏమీ ఉండదు. పైగా ఇది తేలికైంది. పది నిమిషాల్లోనే పరీక్ష పూర్తవుతుంది. చవక కూడా.

ఎవరికి అవసరం?

క్యాల్షియం హార్ట్‌ పరీక్ష ఎవరికైనా ఉపయోగపడుతుంది. మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌, అధిక ట్రైగ్లిజరైడ్లు, చెడ్డ కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉండటం, మంచి కొలెస్ట్రాల్‌ తక్కువగా ఉండటం, అంతగా శారీరక శ్రమ చేయకపోవటం, కుటుంబంలో ఎవరికైనా గుండెజబ్బు వచ్చి ఉండటం, పొగ అలవాటు, ఊబకాయం గలవారికి మరింత అవసరం. ఇలాంటి ముప్పు కారకాల్లో కనీసం ఏ రెండు ఉన్నా 35-40 ఏళ్ల వయసులో ఒకసారి క్యాల్షియం స్కోరును పరీక్షించుకోవటం మంచిది. అవసరాన్ని బట్టి దీన్ని ప్రతి ఐదేళ్లకు ఒకసారి చేయించుకోవాల్సి ఉంటుంది.

ముందే జాగ్రత్త పడొచ్చు

సాధారణంగా 60 ఏళ్లు పైబడ్డవారిలో గుండె రక్తనాళాల్లో కొంత క్యాల్షియం కనిపించొచ్చు. వీరికి క్యాల్షియం స్కోర్‌ సున్నాగా ఉంటే గుండెపోటుతో మరణం సంభవించే అవకాశం చాలా తక్కువని చెప్పుకోవచ్చు. అదే 25-50 ఏళ్ల వారిలో క్యాల్షియం స్కోర్‌ తక్కువగా ఉన్నా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. జీవనశైలి మార్పులతో సమస్య త్వరగా ముదరకుండా చూసుకోవచ్చు. కొవ్వు పదార్థాలు తగ్గించుకోవాల్సి ఉంటుంది. వనస్పతి వంటి ట్రాన్స్‌ఫ్యాట్స్‌ అసలే తినొద్దు. తీపి పానీయాలు, కూల్‌డ్రింకులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. తాజా కూరగాయలు, ఆకుకూరలు, బాదం వంటి గింజపప్పులు, కొవ్వుతో కూడిన చేపలు మేలు చేస్తాయి. అలాగే క్రమం తప్పకుండా రోజూ వ్యాయామం చేయాలి.

ఎంత స్కోర్‌? ఎంత తీవ్రం?

గుండె సీటీ స్కాన్‌ ద్వారా క్యాల్షియం స్కోరును లెక్కిస్తారు. ఇదీ ఎక్స్‌రే లాంటి పరీక్షే. కాకపోతే సీటీ స్కాన్‌ పరికరం గుండె రక్తనాళాలను అన్ని వైపుల నుంచి పరీక్షిస్తుంది. ఇలా కచ్చితంగా క్యాల్షియం స్కోరును తెలియజేస్తుంది. సాధారణంగా క్యాల్షియం హార్ట్‌ స్కోర్‌ ‘0’ ఉంటే నార్మల్‌గా భావిస్తారు. ఇది ఎంత పెరిగితే రక్తనాళాల్లో పూడికల తీవ్రత అంత ఎక్కువగా ఉందని నిర్ధరిస్తారు.

  • 0: ఎలాంటి పూడికలు లేవన్నట్టు. (వీరికి గుండెజబ్బు తలెత్తే ముప్పు చాలా చాలా.. అంటే 5% కన్నా తక్కువ)
  • 1-10:క్యాల్షియం మోతాదులు చాలా తక్కువన్నట్టు. (గుండెజబ్బు ముప్పు 10% కన్నా తక్కువ)
  • 11-100: పూడిక స్వల్ప స్థాయిలో ఉందని అర్థం. (గుండె రక్తనాళాలు సంకోచించటం అతి తక్కువ).
  • 101-300: ఒక మాదిరి పూడిక ఉన్నట్టు. (3-5 ఏళ్లలో గుండెపోటు వచ్చే అవకాశం కాస్త ఎక్కువ)
  • 300-400, అంతకన్నా ఎక్కువ: పూడిక తీవ్రంగా ఉన్నట్టు. (వీరికి గుండెపోటు ముప్పు చాలా ఎక్కువ. రక్తనాళాల జబ్బు చాలా తీవ్రంగా ఉందని అర్థం)
  • క్యాల్షియం స్కోరును అధిక రక్తపోటు, మధుమేహం వంటి ఇతరత్రా ముప్పు కారకాలతోనూ కలిపి చూసి, గుండెపోటు ముప్పును అంచనా వేస్తారు. ఉదాహరణకు ఎవరికైనా క్యాల్షియం స్కోర్‌ 400 ఉండి, ఒక ముప్పు కారకం కూడా తోడైతే ప్రమాదం మరింత పెరుగుతుంది. అదే రెండు ముప్పు కారకాలుంటే ముప్పు ఇంకాస్త ఎక్కువవుతుంది. ఏడాదిలోనే క్యాల్షియం స్కోర్‌ 300 నుంచి 400కు చేరుకుంటే ప్రమాదం త్వరగా ముంచుకొస్తోందనే అర్థం. ఇలా ఆయా అంశాలను బట్టి ప్రమాద తీవ్రతను నిర్ధరిస్తారు.
  • రక్తనాళం మొదటి భాగంలో క్యాల్షియం ఎక్కువగా ఉండటం ప్రమాదకరం. క్యాల్షియం మందంగా ఉన్నా, రక్తనాళం చుట్టూరా ఉన్నా, అక్కడక్కడా రజనులా పరచుకొని ఉన్నా ప్రమాదకరమే.

-డాక్టర్ పి రమేశ్ బాబు, సీనియర్ కార్డియాలజిస్ట్, రమేశ్ హాస్పిటల్స్, విజయవాడ

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details