ఎత్తు, వయసుకు తగ్గట్టుగా శరీర బరువును కలిగి ఉంటే ఎలాంటి సమస్యలు రావు. కానీ చాలామంది తాము ఉండాల్సిన బరువు కన్నా ఎక్కువ ఉండటం వల్ల అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఊబకాయంతో బాధపడే వారు తమ బరువును తగ్గించుకోవడానికి అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. అధిక బరువు పెరగడానికి కారణాలు ఏంటో, బరువు పెరగకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించవచ్చో ఇప్పుడు చూద్దాం.
మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు కారణంగా ప్రస్తుతం చాలా మంది బరువు పెరుగుతున్నారు. స్థూలకాయ సమస్యతో పాటుగా.. అనేక అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. తీసుకునే ఆహారం నుంచి వాడే మందుల వరకు అనేక కారకాలు బరువు పెరగడానికి దారితీస్తుంటాయి. ముఖ్యంగా మానసిక సమస్యలు, ఒత్తిడి, ఒంటరితనంతో బాధపడే వారు ఎక్కువగా బరువు పెరగడానికి అవకాశం ఉంటుంది.
ముఖ్యంగా థైరాయిడ్‌తో బాధపడే వారిలో అధిక బరువు సమస్య వేధిస్తుంటుంది. శరీరంలో కీలక వ్యవస్థలను ప్రభావితం చేసే థైరాయిడ్‌కు సమస్య తలెత్తితే దాని వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. చాలామంది తాము తినే ఆహారం రుచిగా ఉండాలని, చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉండాలనే ఉద్దేశంతో అనేక రంగులు, పదార్థాలను కలుపుతుంటారు. వీటి వల్ల బరువు అధికంగా పెరుగుతారు. ఇలా కాకుండా సహజ రంగులను ఆహారంలో వాడటం ఉత్తమం.
ఒకప్పుడు శారీరక శ్రమ ఉండేది. ప్రతి ఒక్కరు తమ శరీరాలకు ఏదో ఒక రకంగా పని చెప్పే వాళ్లు. కానీ ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా శారీరక శ్రమ చాలా వరకు తగ్గింది. శరీరానికి తగిన పనిలేకపోవడమే కాకుండా.. ఫోన్లు, టీవీలు చూస్తూ ఎక్కువ ఆహారం తీసుకోవడం కూడా బరువు పెరగడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల త్వరగా బరువు పెరుగుతారు. అలాగే అధికంగా ఉప్పును తీసుకోవడమూ బరువు పెరగడానికి ఓ ప్రధాన కారణమే.
మారిన జీవన విధానం కూడా అధిక బరువుకు కారణం అవుతోంది. అర్ధరాత్రి తినడం, రాత్రి పూట ఆలస్యంగా నిద్రపోవడం.. లేటుగా నిద్ర లేవడం వల్ల అధిక బరువు పెరుగుతారు. అలాగే మద్యపానం వల్ల శరీరంలో కొవ్వు పెరుగుతుంది. నూనె వస్తువులను మోతాదుకు మించి తీసుకోవడం వల్ల కూడా అధిక బరువు పెరగడానికి కారణం అవుతోంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించడం వల్ల అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు. శరీరానికి అన్ని రకాల పోషకాలు అందే ఆహారాన్ని సమపాళ్లలో తీసుకోవాలి. అధికంగా నీటిని శరీరానికి అందించాలి. సమయానికి తినడం, రోజు శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి. జంక్ ఫుడ్, ఆల్కహాల్ లాంటి వాటికి దూరంగా ఉండాలి.
స్థూలకాయ సమస్య మిమ్మల్ని వేధిస్తుందా.. బరువు పెరగడానికి కారణాలు ఏంటో తెలుసా?