తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

పిల్లలో ఒత్తిడి తగ్గిస్తే జంక్‌ఫుడ్‌కి దూరం అవుతారట - పిల్లల ఫేవరెట్ జంక్‌ఫుట్

Kids Eat Junk food due to stress పిల్లల్లో ఒత్తిడికి వారు తినే ఆహారానికి అవినాభావ సంబంధం ఉందని, ఎక్కువ ఒత్తిళ్లు ఎదుర్కొనే చిన్నారులు జంక్‌ఫుడ్‌ అధికంగా తీసుకుంటున్నారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. జర్నల్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ బిహేవియర్‌లో ముద్రితమైన ఈ అధ్యయనం ప్రకారం ఒత్తిడి ఎక్కువగా ఉన్న సమయంలో పిల్లలు తీసుకునే ఆహార పదార్థాల్లో 40 శాతం వరకూ స్వీట్లు, పేస్ట్రీ కేకులు ఉంటున్నాయి. 35 శాతం చిప్స్‌, ఇతర వేపుడు నిల్వ పదార్థాలుండగా 25 శాతం మంది చక్కెర ఎక్కువగా ఉన్న శీతల పానీయాలు తాగుతున్నట్లు తేటతెల్లమైంది. ఈ నేపథ్యంలో పిల్లల్లో ఆహారపుటలవాట్లు, దుష్ప్రభావాలు తదితర అంశాలపై ప్రముఖ పిల్లల మానసిక నిపుణులు సుజాత రాజమణితో ఈనాడు, ఈటీవీ భారత్‌ ప్రత్యేక ముఖాముఖి.

Kids Eat Junk food due to stress
Kids Eat Junk food due to stress

By

Published : Aug 17, 2022, 7:52 AM IST

  • ఒత్తిడికి, జంక్‌ఫుడ్‌కు సంబంధమేంటి?

Kids Eat Junk food due to stress : ఒత్తిడి పెరగగానే వెంటనే శరీరం ప్రతిస్పందిస్తుంది. పిండి పదార్థాలు తీసుకోవాలని మెదడు సంకేతాలను పంపిస్తుంది. ఫలితంగా చిప్స్‌, చాక్‌లెట్లు, పేస్ట్రీ కేకులు, తీపి పదార్థాలు వంటివి తినాలని బలంగా అనిపిస్తుంది. అంతర్గతంగా జరిగే ఈ చర్య అటు పిల్లలకు, ఇటు తల్లిదండ్రులకూ తెలియదు. పిల్లలు చిరుతిళ్లు తినడానికి మొగ్గుచూపుతున్నారంటే వారు ఒత్తిడిలో ఉన్నారని అర్థం చేసుకోవాలి.

  • తమ పిల్లలు బాగా చదువుకోవాలని తల్లిదండ్రులంతా కోరుకుంటారు కదా.. అది ఒత్తిడి పెంచడమెలా అవుతుంది?

ఒత్తిడి రెండు రకాలుగా పడొచ్చు. మొదటిది ఇంట్లో తల్లిదండ్రుల మధ్య గొడవలు, ఆ ప్రభావం పిల్లలపై పడడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. రెండోది బాగా చదువుకోవాలనే ఒత్తిడి. అందరూ మొదటి స్థానంలో నిలవడం సాధ్యం కాదు కదా.. ఒక్కో విద్యార్థికి ఒక్కో దాంట్లో నైపుణ్యం ఉంటుంది. అది తెలుసుకొని తల్లిదండ్రులు, పాఠశాలలో అధ్యాపకులు ప్రోత్సహించాలి. ఒక్క మార్కుల విషయంలోనే కాదు.. హాబీగా నేర్చుకునే సంగీతం, నాట్యం, క్రీడల వంటి వాటిలో కూడా తమ పిల్లలు అత్యుత్తమ ప్రతిభ కనబర్చాలనీ, ఇతరుల కంటే ముందు వరుసలో నిలవాలని కోరుకుంటున్నారు. ఈ ధోరణి చిన్నారులను ఒత్తిడిలోకి నెట్టేస్తోంది. హాబీలు పిల్లల్లో ఒత్తిడి తగ్గించాలి. వారిలో సానుకూల దృక్పథం పెంపొందించాలి. వాటి వల్ల కూడా ప్రతికూలత ఎదురవకూడదు.

  • పిజ్జాలు, బర్గర్లు ఇప్పుడు ఆహారపు అలవాట్లలో భాగమయ్యాయి కదా?

కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలకు అల్పాహారంగా చిప్స్‌, బిస్కట్లు, చాక్‌లెట్లు వంటి వాటిని పెడుతున్నారు. ఈ వైఖరి సరైంది కాదు. తమ పిల్లలకు ఎటువంటి ఆహారాన్ని అందించాలనే అవగాహన ముందుగా తల్లిదండ్రుల్లో రావాలి. వారు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటూ.. పిల్లలకూ అలవాటు చేయాలి. భారతీయ ఆహారాల్లో ఇడ్లీ ఆరోగ్యకరమైన అల్పాహారంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. ఇలాంటి వాటిని వదిలేసి నూడుల్స్‌, గార్లిక్‌ బ్రెడ్‌ వంటివాటి వెంట పరుగులు పెడుతున్నాం. పైగా పిల్లలు వద్దని మారాం చేసినా తల్లిదండ్రులు కుక్కి కుక్కి పెడుతుంటారు. ఇలా ప్రేమను తిండి రూపంలో చూపించడం అలవాటైంది. పిల్లలు కూడా అదే అలవాటు చేసుకొని.. ఏ చిన్న సందర్భం లభించినా ఏదో ఒకటి తినడానికి మొగ్గుచూపుతున్నారు. నిజానికిదో విష సంస్కృతి.

  • ఒత్తిడి తగ్గించడంలో తల్లిదండ్రుల పాత్ర ఏమిటి?

పిల్లలు ఒత్తిడి నుంచి బయటపడేందుకు తల్లిదండ్రులు సహకరించాలి. వ్యాయామం అనేది కుటుంబ అలవాటుగా మారాలి. పొద్దున లేచి తల్లిదండ్రులు నడిస్తే పిల్లలు కూడా అనుసరిస్తారు. నడక, పరుగు, యోగా, ధ్యానం, ప్రాణాయామం, ఈత, ఆటలు తదితర రూపాల్లో శారీరక శ్రమ చేయడం వల్ల సానుకూల మానసిక స్థితి ఏర్పడుతుంది. దీంతో పిల్లలకు జంక్‌ ఫుడ్‌ తినాలనే ఆలోచన తగ్గుతుంది. శారీరక శ్రమ మంచి చేసే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. డార్క్‌ చాక్‌లెట్‌ ఒత్తిడిని తగ్గిస్తుంది. పాఠశాలలో చేర్పించేటప్పుడే ఆ బడిలో ఆటలు ఆడిస్తారా? వాటికి ప్రాధాన్యత ఉందా? అసలు మైదానముందా? ఇలాంటివి పరిశీలించాలి. సాంకేతికంగా పరిశీలించినా.. మన మెదడు 45 నిమిషాల కంటే ఎక్కువసేపు చదవలేదు. కచ్చితంగా ప్రతి 45-50 నిమిషాల తర్వాత కనీసం 10-15 నిమిషాల మానసిక విశ్రాంతి అవసరం. అప్పుడే పునరుత్తేజం పొందుతారు.

  • జంక్‌ఫుడ్‌తో పిల్లలపై ఎటువంటి దుష్ఫలితాలుంటాయి

కార్బోహైడ్రేట్లను తిన్నప్పుడు శరీరం వాటి నుంచి అధిక మొత్తంలో కొవ్వును స్వీకరించడంతో చిన్నతనంలోనే ఊబకాయం బారినపడే అవకాశాలున్నాయి. దీంతోపాటు అనేక సమస్యలూ చుట్టుముడతాయి. ఆత్మన్యూనత, ప్రతికూల ఆలోచనలు పెరుగుతాయి. 25 ఏళ్లు దాటక ముందే అధిక రక్తపోటు, మధుమేహం, కీళ్లనొప్పులు, అమ్మాయిల్లో అయితే నెలసరి సమస్యలు, హార్మోన్లలో అసమతౌల్యం వంటి సమస్యలు వస్తాయి.

ABOUT THE AUTHOR

...view details