KIDNEY HEALTH TIPS: మూత్రపిండాలు.. శరీరంలోని మలినాలను బయటకు పంపించి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. మనం తీసుకున్న ఆహారంలో ఎన్నో రకాల రసాయనాలు ఉంటాయి. ఈ రసాయనాలు మన శరీరంలో ఎక్కువైనా, తక్కువైనా ప్రమాదమే. వాటిని నియంత్రణలో ఉంచేలా కిడ్నీలు వ్యవహరిస్తాయి. అయితే కిడ్నీలపై ఒత్తిడి పడకుండా ఉండాలంటే ఆయా రసాయనాలు కలిగిన ఆహారాన్ని తగిన మోతాదులో తీసుకోవడం ముఖ్యం. దీని వల్ల కిడ్నీల పనితీరు మెరుగుపడుతుంది. క్రోనిక్ కిడ్నీ డిసీజ్‌లు ఉన్నవారు కచ్చితంగా మూత్రపిండాల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. వీరు తమ ఆహారంలో తప్పక మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. సోడియం, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, పాస్ఫరస్ ఉండే ఫ్రెండ్లీ డైట్ తీసుకోవడం మంచిది.
డయాబెటిస్ ఉందా?:కిడ్నీల పనితీరు బాగుంటే.. శరీరంలో జరిగే ప్రక్రియలు సాధారణంగా ఉంటాయి. రక్తంలో ఉండే షుగర్‌ను కిడ్నీలు ఫిల్టర్ చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువైతే కిడ్నీలపై ఒత్తిడి పడుతుంది. డయాబెటిస్ వంటి వ్యాధులు వస్తే.. కొద్దికాలం తర్వాత కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలో డయాబెటిస్ వచ్చినప్పుడు షుగర్ స్థాయిలను నియంత్రించుకోవాలి. వ్యాయామం తప్పనిసరిగా చేస్తూ ఉండాలి.
ఉప్పు తినకూడదా?:అధిక రక్త పోటు సైతం కిడ్నీల వైఫల్యానికి దారితీస్తాయి. అందుకే ఉప్పు తగిన మోతాదులో తీసుకోవాలి. అధిక రక్త పోటు ఉన్నవారు.. సగం చెంచా కన్నా ఎక్కువ ఉప్పు తీసుకోకూడదని వైద్యులు చెబుతున్నారు. కూరగాయలు, పప్పుల్లో తప్పితే మిగతా వాటిల్లో ఉప్పు వాడకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. ఉదయం వాడే ఇడ్లీ, దోశ పిండిలో ఉప్పు మానేయాలి. మధ్యాహ్నం, రాత్రి భోజనానికి ఒక్కోగ్రాము చొప్పున ఉప్పు మాత్రమే తీసుకోవాలి.