చాలా రోజుల పాటు శుభ్రం చేయని బెడ్‌షీట్లపై బ్యాక్టీరియా, వైరస్‌లు, దుమ్ము-ధూళి వంటివి పేరుకుపోతాయి. వీటిని వాడడం వల్ల ఆస్తమా వంటి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, పలు చర్మ సంబంధిత వ్యాధులు సైతం వచ్చే ప్రమాదం ఉంది. మరీ ముఖ్యంగా కరోనా కలకలం సృష్టిస్తోన్న ఈ సమయంలో బెడ్‌షీట్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే ఎవరికి వారే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్న వారవుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దుస్తులపై కరోనా ఎక్కువ కాలం జీవిస్తుందన్న విషయం తెలిసిందే. ఇది బెడ్‌షీట్లకూ వర్తిస్తుంది. బయటి నుంచి వచ్చిన తర్వాత దుస్తులు మార్చుకోకముందే మంచంపై కూర్చోవడం, అవే అపరిశుభ్రమైన చేతులతో బెడ్‌షీట్లను తాకడం వల్ల అక్కడ వైరస్ అంటుకునే ప్రమాదం ఉంది. కాబట్టి బయటి నుంచి వచ్చాక వ్యక్తిగతంగా తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఇంట్లోని బెడ్‌షీట్లను కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. అదెలాగంటే..
ఎప్పుడెప్పుడు?
- సాధారణంగా బెడ్‌షీట్లను వారానికి ఒక్కసారైనా ఉతకాలి. అయితే ప్రస్తుతం అందరూ ఎక్కువ సమయం ఇంట్లోనే గడుపుతుండడం వల్ల బెడ్‌పైనే తినడం, ఎక్కువ సమయం పడుకోవడం.. లాంటివి చేస్తున్నారు. ఫలితంగా అవి త్వరగా మాసిపోయే అవకాశం ఉంది. కాబట్టి వారానికి రెండుసార్లైనా బెడ్‌షీట్లను మార్చడం ఉత్తమం.
- ఇక కొన్ని రకాల చర్మ వ్యాధులు లేదా ఇతర అనారోగ్యాలతో బాధపడే వారు క్రమం తప్పకుండా బెడ్‌షీట్లను మారుస్తూ ఉండాలి. అలాగే అందరూ వాడుకునేవి కాకుండా ప్రత్యేకంగా వారి కోసం కొన్ని బెడ్‌షీట్లను కేటాయించడం మంచిది.
- కొంతమంది తమ పెంపుడు జంతువులను కూడా బెడ్‌పైకి తీసుకురావడం, వారి పక్కనే పడుకోబెట్టుకోవడం.. వంటివి చేస్తుంటారు. ఫలితంగా వాటి వెంట్రుకలు లేదా చర్మంపై ఉండే బ్యాక్టీరియా, ఇతర క్రిములు బెడ్‌షీట్‌కి అంటుకునే ప్రమాదం ఉంది.. కాబట్టి వాటిని సాధ్యమైనంత వరకు బెడ్ పైకి తీసుకురాకుండా చూసుకోవాలి. ఒకవేళ తీసుకొచ్చినా రెండురోజులకోసారి బెడ్‌షీట్ మార్చాలన్న విషయం మర్చిపోవద్దు.