మనకు ఆకస్మికంగా కలిగే అవాంతరాలను ఎలా ఎదుర్కోవాలో మనం చదువుకున్న చదువు, మనచుట్టూ ఉన్న సమాజం నేర్పలేదు. అటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లో ఆందోళన కలిగి మానసికంగా కుంగిపోతాం. మనందరం కొన్ని స్థిర నమ్మకాలతో, మానవ సంబంధాల గురించి కొన్ని ఊహాలతో జీవిస్తూ ఉంటాం. ఆటిజం ఉన్న పిల్లలు మన కుటుంబంలోనే ఉన్నారని తెలిస్తే దిగ్భ్రాంతికి గురవుతాం. ఇది ఊహించని పరిణామమే. భవిష్యత్ ఎలా ఉంటుందోనని, ఆ పిల్లలను ఎలా చూసుకోవాలోనని దిగులు పడటం సహజం.
జరుగుతున్న పరిణామాలను ఒప్పుకోవటం ఒక తప్పనిసరి దశ. ఇటువంటి ఎదురుచూడని పరిస్థితి వల్ల కుంగిపోవటం, మనసుకు సమాధానం చెప్పుకోవటం తరువాత నిజ జీవితాన్ని అనుభవించటం జరుగుతాయి. అయితే ఈ కుటుంబాలు వైద్య సహాయక వ్యవస్థతో సంభాషించటం చాలా అవసరం. దీన్ని ఒక జబ్బుగా కాక, ఆటిజం బిడ్డను ఒక వ్యక్తిత్వం ఉన్న మనిషిగా పరిగణించటం అనివార్యమవుతుంది.
వారి తల్లిదండ్రులకు కలిగే వ్యథ సహజంగా ఇలా కొన్ని దశల్లో సాగుతుంది.
- అవాక్కవ్వటం, తిరస్కరించటం: ఆటిజం ఉన్నట్టు వ్యాధి నిర్ధరణ అవ్వగానే తల్లిదండ్రులు వైద్యుని మాటలను సందేహిస్తారు. వైద్యులు మరింతగా పరీక్షించి కనిపిస్తున్న లక్షణాలకు వేరే కారణాలు చెబుతారని, పిల్లల ప్రవర్తన సమ ఈడు పిల్లల ప్రవర్తన కంటే భిన్నంగా ఉండటానికి మరేదైనా కారణం ఉండి ఉంటుందని భావిస్తారు.
- అపరాధభావన: తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లి, ఈ విషాద పరిస్థితికి తానే కారణమని బాధ పడుతూ, తాము చేసిన తప్పులను నెమరువేసుకుంటూ అవే ఇందుకు కారణమనుకుని తల్లడిల్లుతూ ఉంటారు.
- కోపం: భిన్నమైన మానసిక స్థితులు కలుగుతూ కోపం కట్టలు తెంచుకుంటుంది. ఆ కోపం వారిపైనా, సమాజం పైనా భర్త/భార్య పైన, దేవుడి పైన కూడా కలుగుతుంది. అటువంటి కోపాన్ని అణచటం కంటే బహిరంగ పరచటమే ముఖ్యం. ఆ కోపం వెనుక ఎప్పటికీ శాంతించని బాధ, అన్నీ పోగొట్టుకున్న భావన ఉంటాయి. నాకే ఎందుకు ఇలా జరిగిందని ప్రశ్నించుకుంటారు.
- విషాదం: నియంత్రించుకోలేని బాధతో చివరకు ఏకాంత భావనకు, నైరాశ్యానికి, సంతానాన్ని పోగొట్టుకున్న భావనకు లోనవుతారు. ఇది ఒక అనివార్యమైన దశ.
- అంగీకరించటం: ఏది జరిగినా, ఎలా జరిగినా చివరకు దాన్ని అంగీకరించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతుంది. తల్లిదండ్రులు ఆటిజం పిల్లల వల్ల కలిగిన కొత్త బాధ్యతలను నిర్వర్తించటానికి ఒప్పుకుని వైద్యుల సహాయం కోరుతారు. కొన్ని పనులను ఇతరులకు అప్పగించి మార్చలేని పరిస్థితులకు తగ్గట్టుగా జీవించటం వారు ప్రారంభిస్తారు. వైద్య పరిచారికల సహాయ సహకారాలు పొందటం కూడా చేస్తారు.