భూమి మీద రుతువులే లేకపోతే.. జీవితం నిస్సారంగా సాగేది. సూర్యుడి ఎండలో హెచ్చుతగ్గులు, వర్షాలు, మంచు, చలికాలం, వడగండ్లు, శరత్కాల చంద్రుని వెన్నెల, ఆకురాలే కాలం ఇలా ఎన్నో ప్రకృతి లీలలు మన జీవితాలను ఆనందమయం చేస్తున్నాయి. మహకవి కాళిదాసు రచించిన రుతుసంహార కావ్యం భారత ఉపఖండంలో రుతువుల అందాన్ని అద్భుతంగా వర్ణించింది. మనసుకు కష్టాన్ని కలిగించే గ్రీష్మరుతు వర్ణనతో ప్రారంభమై మనోహరమైన వసంతరుతు వర్ణనతో ఆ కావ్యం ముగుస్తుంది. మన జీవితాల్లో వసంతరుతువులోనే కొత్త ఉత్సాహం నిండుతుంది. చైత్ర మాసం పాడ్యమిన ప్రారంభమయ్యే ఈ యేటి ప్లవ నామ సంవత్సరానికి ఆది ఉగాది.
పండుగలు మనలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. ఉగాది పండుగ అన్ని పండుగల కంటే ముందు జరుపుకునేది. వసంత రుతువు ఆరంభం ప్రకృతిలో ఎన్నో మార్పులను తెస్తుంది. వేపపువ్వు, మామిడిపిందెలు, కోకిల పాటలు, శరీరాన్ని వెచ్చబరుస్తూ భూ మధ్య రేఖను దాటిన సూర్యుని కిరణాలు, పుష్పించే వృక్షాలు, లేత ఆకులు జీవన చక్రంలో మరో ప్రారంభాన్ని సూచిస్తాయి. భవిష్యత్తు ఎలా ఉంటుందోనని చిరు ఆందోళన కల వారికి కొత్త పంచాంగం కొంగొత్త ఆశలను కల్పిస్తుంది. భక్ష్యాల కంటే ముందుగా పూజ ముగించి ఉగాది పచ్చడిని రుచి చూడటం తెలుగు కుటుంబాల్లో తరతరాలుగా ఉన్న ఆచారం. ఉగాది పచ్చడి ఆహారంగా కాకుండా ఔషధ ప్రాయంగానే తినాలి. అందులో ఉన్న 6 రుచుల (తీపి, పులుపు, ఉప్పు, వగరు, చేదు, కారం) కోసం బెల్లం, చింతపండు, ఉప్పు, వేపపువ్వు, మామిడికాయ, కారం ను సమపాళ్లలో కలిపి సిద్ధం చేస్తారు. వేరువరు ప్రదేశాల్లో లభించే పదార్ధాలను బట్టి ఉగాది పచ్చడి ఘటకాలు కొద్దిగా మారవచ్చు.