కరోనా కారణంగా వ్యాయామశాలలు దాదాపు నాలుగు నెలల క్రితం మూతపడ్డాయి. అయితే ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్న అన్‌లాక్-3.0తో జిమ్‌లు తెరుచుకోనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దేశంలో రోజురోజుకు రికార్డు స్థాయిలో వైరస్ కేసులు బయటపడుతున్న తరుణంలో జిమ్‌కు వెళ్లడం మంచిదేనా?
వాటిపైనే ఆధారపడి ఉంది..
మీరు నివసిస్తున్న ప్రాంతం, వెళ్లాలనుకుంటున్న జిమ్‌లో సిబ్బంది తీసుకునే జాగ్రత్తలపైనే అంతా ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కరోనా నియంత్రణ చర్యలు సరిగ్గా లేని ప్రాంతాల్లోని ప్రజలు జిమ్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదంటున్నారు. అయితే వైరస్ కట్టడి చర్యలు మెరుగ్గా ఉన్న ప్రాంతాల్లోని ప్రజలు వ్యాయామశాలలకు వెళ్లొచ్చని చెబుతున్నారు.
ఇదీ చూడండి:-అన్‌లాక్ 3.0: ఆంక్షల 'తెర' తొలగుతోంది!
జిమ్ ఇలా ఉంటే హాయే...
ప్రతి ఒక్కరు కనీసం 6 అడుగుల దూరం పాటించేందుకు వీలుగా జిమ్ సిబ్బంది ఏర్పాట్లు చేయాలి. అవసరమైతే ప్రత్యేక పరికరాలతో కదలికలను పరిమితం చేయాలి. దీనిని దృష్టిలో పెట్టుకునే ప్రజలను లోపలకు అనుమతించాలి. వ్యాయామాలకు సంబంధించిన పరికరాలను సిబ్బంది ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి.
జిమ్‌లో రద్దీపై వ్యక్తిగతంగా కాకుండా ఆన్లైన్లో చూసుకునేందుకు వ్యవస్థను ఏర్పాటు చేస్తే మంచిదని అమెరికాలోని రోగ నియంత్రణ, నివారణ కేంద్రం పేర్కొంది. అంతేకాకుండా సాధ్యమైనప్పుడల్లా జిమ్ లోపల కాకుండా ఆరుబయట వ్యాయామాలు చేయాలని సూచించింది.
మీరు చేయాల్సినవి...
లాకర్ రూమ్స్ వాడకపోవడం, సొంతంగా నీళ్ల సీసా తీసుకెళ్లడం, శానిటైజర్లను వాడటం వల్ల వైరస్ సోకే ప్రమాదం తగ్గుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. జిమ్ లోపల కూడా మాస్కులు ధరించాల్సిందేనని తేల్చిచెబుతున్నారు. అవి చెమటతో తడిసిపోయే అవకాశముండటం వల్ల మరో మాస్కును వెంటతీసుకెళ్లాలని సూచిస్తున్నారు.
అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జిమ్‌లు ప్రమాదకరమేనని అంటున్నారు నిపుణులు. భౌతిక దూరం వంటి నిబంధనలు పాటించడం కష్టమని చెబుతున్నారు. అందువల్ల జిమ్‌కు వెళ్లకుండానే.. ఇంటి బయట చమటోడ్చటం శ్రేయస్కరమన్నది వారి మాట.
ఇవీ చూడండి:-టైటానిక్ ప్రేమికులు పెట్టుకున్నారు మాస్కులు!