"గర్భిణులపై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఎంత మేరకు ఆ ప్రభావం ఉంటుందనే దానిపై ఎలాంటి ఆధారాలు లేవు. కానీ, కరోనా మహమ్మారి బారిన పడకుండా తమను, తమ బిడ్డను రక్షించుకునేందుకు గర్భిణులు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సాధారణంగా జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తదితర సమస్యలను గుర్తించినట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించాలి" అని సూచిస్తున్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ నీరజ్ బోర్కర్.
కరోనా సమయంలో గర్భిణులు, చిన్న పిల్లల తల్లులు, వారి కుటుంబ సభ్యులు ఎక్కువ ఆందోళన చెందుతున్న నేపథ్యంలో డాక్డర్ నీరజ్ బోర్కర్ పలు సందేహాలను నివృత్తి చేశారు.
ప్ర. గర్భిణులపై కరోనా ప్రభావం ఎంత మేరకు ఉంటుంది?
జ.గర్భిణులపై కరోనా ప్రభావం ఏ మేరకు ఉంటుంది అనే విషయంపై ఇప్పటికే పలు పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే వీరికి సాధారణ ప్రజలకంటే ఎక్కువ ప్రమాదం ఉన్నట్లు ఆధారాలు లేవు. కానీ, గర్భిణిగా ఉన్నప్పుడు వారి రోగ నిరోధక వ్యవస్థలో మార్పుల కారణంగా వారు కొన్ని రకాల శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు లోనవుతారు. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకు జ్వరం, దగ్గు, శ్వాసకోశ ఇబ్బందులు ఎదురైతే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
ప్ర. గర్భంతో ఉన్నప్పుడు కరోనా బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
జ.కరోనా సమయంలో గర్భిణులు స్థానిక ఆరోగ్య అధికారులు సూచించే జాగ్రత్తలు తప్పక పాటించాలి.
- ఆల్కాహాల్‌తో తయారైన హ్యాండ్ రబ్ లేదా సబ్బుతో తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి
- రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లకుండా, ఇతరులకు దూరంగా ఉండడం చాలా ఉత్తమం
- కళ్లు, ముక్కు, నోటిని తాకకుండా ఉండాలి
- నిత్యం పరిశుభ్రంగా ఉండాలి. తుమ్మినా, దగ్గినా మోచేయి అడ్డుపెట్టుకోవాలి. అలాంటి సందర్భాల్లో టిష్యూలను ఉపయోగించాలి. వాడిన తర్వాత వాటిని దూరంగా పారవేయాలి.