తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

కొత్త బట్టలను ఉతకకుండా వేసుకుంటే ప్రమాదమా? నిపుణులు ఏమంటున్నారు? - wash new clothes before wearing chemicals

మన సమాజంలో చాలా విషయాల్లో కట్టుబాట్లు, పట్టింపులు ఎక్కువగా ఉంటాయి. ఏ పని విషయంలోనైనా ఫలానా విధంగానే చేయాలి అంటూ నిబంధనలు పెడుతుంటారు. ఇలా చేస్తే మంచి జరుగుతుంది.. లేకపోతే చెడు జరుగుతుందంటూ ఉచిత సలహాలు ఇస్తుంటారు. అలాంటిదే ఒకటి కొత్త బట్టలు ఉతకకుండా వేసుకోవద్దని పెద్దలు చెబుతుంటారు. మరి అసలు దీనిలో శాస్త్రీయత ఎంతో? తెలుసుకుందాం.

Is it necessary to wash new clothes before wearing
Is it necessary to wash new clothes before wearing

By

Published : Mar 30, 2023, 2:30 PM IST

పెళ్లి, పేరంటాల దగ్గర నుంచి విద్య, ఉద్యోగం, వ్యాపారం దాకా ఇలా ప్రతి విషయంలో మన సమాజంలో ఎన్నో పట్టింపులు ఉంటాయి. ఆఖరికి మనం ధరించే బట్టల విషయంలోనూ ఇలాంటి వాటిని చూడొచ్చు. కొత్త బట్టలను ఉతికిన తర్వాతే వేసుకోవాలనేది ఇలాంటి నిబంధనల్లో ఒకటి. ఉతికిన తర్వాత వేసుకుంటే మంచిదని, కొత్త దుస్తులు అలాగే వేసుకుంటే ఆరోగ్యానికి హాని కలుగుతుందని ఇంట్లో పెద్దలు చెబుతుంటారు. మరి.. ఇందులో శాస్త్రీయత ఉందా? కొత్త బట్టలు ఉతకకుండా వేసుకుంటే అనార్యోగం బారిన పడతామా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

కొత్త బట్టల విషయంలో పెద్దలు చెప్పిన దాంట్లో నిజం లేకపోలేదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దుకాణాల్లో తీసుకున్న బట్టలపై హానికర రసాయనాలు ఉంటాయట. వాటిని ఒకసారి ఉతికి, ఎండలో ఆరబెట్టాక వేసుకుంటే ఆ రసాయనాలు పోతాయని నిపుణులు చెబుతున్నారు. కొత్త బట్టల్ని ఉతకడమే గాక ఆరిన తర్వాత ఇస్త్రీ చేసుకుని తొడుక్కుంటే ఇంకా మంచిదని సూచిస్తున్నారు. అంతేగానీ బద్దకం, నిర్లక్ష్యంతో కొత్త దుస్తులను అలాగే ధరిస్తే.. చర్మ సంబంధింత సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అజాగ్రత్తతో అనారోగ్యమే
కొత్త బట్టలను ఉతకకుండా వేసుకుంటే దురద లాంటి సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయి. ఈ విషయాన్ని అమెరికా వ్యాధి నియంత్రణ, నివారణ సంస్థతో (CDS) పాటు జాతీయ ఆరోగ్య సేవా సంస్థ (NHS) నిర్ధరించాయి. దుకాణాల్లో కొన్న బట్టలను ఎంతో మంది ట్రయల్ రూమ్స్​లో వేసుకుని ఉంటారు. అలాంటి బట్టలను శుభ్రం చేయకుండా ధరించడం వల్ల ఎన్నో సూక్ష్మక్రిములు మన శరీరంలోకి చేరే ప్రమాదం ఉంది. అలాగే ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే లక్షణం ఉన్న కరోనా లాంటి మహమ్మారుల బారిన పడతారని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా హానికర బ్యాక్టీరియా, క్రిములు, పేను పురుగులు లాంటివి కూడా మన శరీరంలోకి ప్రవేశించి.. ఇన్ఫెక్షన్లకు గురిచేసే ప్రమాదం ఉందని అంటున్నారు.

చర్మ వ్యాధులతో జాగ్రత్త
బట్టలను ఉతకకుండా వేసుకుంటే వచ్చే ప్రమాదాల్లో అతి పెద్దదిగా 'కాంటాక్ట్ డెర్మటాటిస్'ను చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇదో రకం చర్మ సంబంధింత వ్యాధి అని.. ఇది సోకితే చర్మం పొలుసులుగా మారి బాగా దురద పెడుతుందని హెచ్చరిస్తున్నారు. బట్టలు వేసుకున్న కొన్ని గంటల్లో దీన్ని గమనించొచ్చని చెబుతున్నారు. దీని వల్ల చర్మం ఎర్రగా మారి అసౌకర్యంగా అనిపిస్తుందట. చర్మ వ్యాధుల బారిన పడే వారిలో చాలా మంది ఇలా శుభ్రం చేయని దుస్తులు ధరించడం, ఒకరి బట్టలు మరొకరు వేసుకోవడం, ఆరని బట్టలను ధరించడం లాంటి వల్ల ఎదుర్కొనేవేనని నిపుణులు అంటున్నారు.

చర్మవ్యాధి నిపుణులను సంప్రదించాలి
చర్మ వ్యాధుల్లో చాలా వరకు అపరిశుభ్రత, అజాగ్రత్త వల్ల వచ్చేవేనని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధులు జన్యుపరంగా వచ్చేవి కావని గుర్తుంచుకోవాలని అంటున్నారు. ఒకవేళ కొత్త బట్టల వల్ల చర్మ సంబంధింత సమస్యలు తలెత్తితే వెంటనే చర్మవ్యాధి నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నారు. అలా చేయకపోతే అలర్జీ, దురదలు మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

పిల్లల బట్టలనూ ఉతకాలా?
పెద్దలే కాదు పిల్లల కోసం కొనే కొత్త బట్టల విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పిల్లల కోసం కొన్న బట్టలను కూడా వెంటనే ఉతకాలని.. వాటిని తప్పకుండా శుభ్రం చేయాలని సూచిస్తున్నారు. పిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. పెద్దల కంటే చిన్నారుల చర్మం మరింత సున్నితం కాబట్టి వారికి అలర్జీలు త్వరగా సోకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పిల్లలకు బట్టలు కొంటే, తప్పకుండా ఉతికిన తర్వాతే వారికి తొడగాలని సూచిస్తున్నారు.

ఇవీ చదవండి :సడెన్​గా మైకం కమ్మినట్లు అనిపిస్తుందా..? దేనికి సంకేతమో తెలుసా?

రాత్రిళ్లు ఫోన్ వాడకాన్ని తగ్గించే 7 చిట్కాలు.. ఇలా చేస్తే హాయిగా నిద్రపోవచ్చు!

ABOUT THE AUTHOR

...view details