పగటి కలలు.. చాలా మంది జీవితాల్లో సర్వసాధారణం. అవి మనసుకు ఉల్లాసం కలిగించి.. ఒంటరితనం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. చాలా మంది మనసులో మెదిలే ప్రతికూల భావాల నుంచి బయటపడడానికి పగటి కలలను ఆశ్రయిస్తుంటారు! కానీ పగటి కలలు మంచివి కావని కొందరు చెబుతుంటారు. మరికొందరు 'ఏంటి.. పగటి కలలు కంటున్నావా?' అని హేళన కూడా చేస్తుంటారు. అయితే పగటి కలల వల్ల మనుషుల్లో సృజనాత్మకత, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
నిద్రలో వచ్చే కలలకు, పగటి కలలకు చాలా తేడా ఉంటుంది. ఇవి కేవలం మెలకువలో ఉన్నప్పుడే వస్తుంటాయి. అవి కూడా కొన్ని సెకన్ల పాటు మాత్రమే ఉంటాయి. మనం ఏదైనా సృజనాత్మకంగా పని చేసేటప్పుడు, సమస్య పరిష్కారంలో బిజీ ఉండేటప్పుడు ఎక్కువగా పగటి కలలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. పని ఒత్తిడితో బాగా అలిసిపోయినప్పుడు.. మన మెదడు పగటి కలలు కంటుందని అంటున్నారు. పగటి కలల స్థితిని మెదడు విశ్రాంతి తీసుకోవడంగా భావించాలని తెలిపారు.
"చాలా మంది పగటి కలలు మంచివి కావని చెబుతుంటారు. మరికొందరైతే.. పగటి కలలను వెక్కరిస్తుంటారు. కానీ మనం 30-50 శాతం సమయం పగటి కలల్లోనే ఉంటామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పగటి కలల వల్ల సృజనాత్మకంగా మనకు చాలా లాభాలు ఉన్నాయి. మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు దృష్టి దానిపైనే ఉంటుంది. కానీ పగటి కలలు కనడం వల్ల మనకు తెలియని విషయాలు మెదడులోకి వస్తుంటాయి. అప్పుడు మనలో ఉన్న క్రియేటివిటీ పెరుగుతుంది."