ప్ర. నీతి అయోగ్ ఉమెన్ ట్రాన్స్ ఫార్మింగ్ ఇండియా అవార్డుకు ఎంపికైనందుకు అభినందనలు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 75 మందిలో స్థానం సాధించటం ఎలా అనిపిస్తోంది?
జ. సంతోషంగా ఉంది. దేశవ్యాప్తంగా 75 మందిని ఎంపిక చేశారు. అందులో నేను ఉండటం సంతోషంగా ఉంది. ఇది చాలా అరుదైన గౌరవంగా భావిస్తున్నాను.
ప్ర. గత పదేళ్లుగా భారత్‌లో జెనెటిక్స్ అనే పదం ఎక్కువగా వినిపిస్తోంది. అసలు జీనోం స్టడీ చేసే సంస్థ స్థాపించాలన్న ఆలోచన ఎప్పుడు, ఎలా వచ్చింది?
జ. దాదాపు 20 ఏళ్లుగా జీనోమిక్స్‌లో ఉన్నాను. 2000 సంవత్సరంలో ఆసిమం బయోసొల్యూషన్ ప్రారంభించాను. 2013 వరకు దీనిని నిర్వహించిన తర్వాత పర్సనలైజ్డ్ మెడిసిన్‌కు ప్రాముఖ్యత ఏర్పడుతోందని అర్థమైంది. ఈ నేపథ్యంలో మన దేశ ప్రజలకు ఏమైన చేయాలనుకున్నాం. వ్యాధి నివారణపై దృష్టి సారించటంతోపాటు... అందరికీ అందుబాటులో ధరల్లోనే టెస్టులను తీసుకురావాలనుకున్నాం. అలా 2013లో మ్యాపై మై జీనోం ప్రారంభించి జీనోం పత్రి పేరుతో ఆన్ లైన్ ద్వారా మొట్టమొదటి సారిగా జీనోం టెస్టింగ్ కిట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చాం. ఆ కిట్ సహాయంతో ఇంట్లోనే ఎవరికి వారే స్వాబ్‌తో టెస్టు చేసుకుని ఆ సాంపిల్‌ను మాకు పంపితే చాలు. పరీక్షించి ఫలితాలు ఈమెయిల్ లేదా కొరియర్ ద్వారా పంపుతాం.
ప్ర. జీనోం పత్రి పరీక్ష ద్వారా ఏఏ విషయాలు తెలుసుకోవచ్చు?
జ. జీనోం పత్రి టెస్టు ద్వారా లైఫ్ స్టైల్, పోషకాహారం, కుటుంబ పరంగా ఉన్న వ్యాధులు ఇతరత్రా దాదాపు 100 రకాల వ్యాధులు భవిష్యత్తులో వచ్చే అవకాశం ఏ మేరకు ఉందన్న విషయాన్ని తెలుసుకోవచ్చు. గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వాటికి సంబంధించిన జన్యుపరంగా ఎంతవరకు అవకాశం ఉందని చెప్తాం. అన్ని మందులు అందరికీ ఒకే రకమైన ఫలితాలు ఇవ్వకపోవచ్చు. ఉదాహరణకు మెట్ ఫార్మిన్... షుగర్ వ్యాధికి ఇచ్చే ఈ మందు కొందరికే పనిచేస్తుంది. మరి కొందరి శరీరం అసలు దీనికి స్పందించదు. ఎవరికి ఏ మందు ఎలా పనిచేస్తుందన్న విషయాలను జన్యు పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు. ఫలితంగా అనవసరమైన మందుల వాడకాన్ని తగ్గించుకోవచ్చు. ఇక మరికొందరికి తమ మూలలను తెలుసుకోవాలని ఉంటుంది. మన పూర్వీకులు ఏ తెగకు చెందిన వారు, మన మూలలు ఎక్కడ ఉన్నాయన్న వివరాలను సైతం ఈ పరీక్షల ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది.
ప్ర. కొవిడ్ సమయంలోనే మ్యాప్‌మై జీనోం సంస్థ సాధారణ ప్రజలకు చాలా దగ్గరైంది? నిత్యం వందల సంఖ్యలో సాంపిళ్లను పరీక్షలు చేశారు. ఎయిర్ పోర్ట్‌లో మీ కేంద్రాలను నిర్వహించటం ఎలాంటి అనుభవానిచ్చింది?
ప్ర. సాధారణంగా మేం ఇలాంటి వైరస్‌లకు సంబంధించిన పరీక్షలు చేయం. అయితే మేం చేసే ఇతరత్రా పరీక్షలకోసం వాడే పరికారలతోనే ఈ ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయొచ్చు. మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తున్న సమయంలో మా వంతు సాహాయం చేయాలని ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసేందుకు ముందుకు వచ్చాం. ముందుగా కార్పొరేట్ స్థాయిలో ఈ టెస్టింగ్ ప్రారంభించాం. ఆ తర్వాత కర్ణాటక, ఏపీల్లో టెస్టింగ్ చేసి చివరిగా ఎయిర్ పోర్ట్‌లలో మా కేంద్రాలు ఏర్పాటు చేశాం. అలా నగరానికి వచ్చే చాలా మందికి మ్యాప్ మై జీనోం సంస్థ గురించి తెలిసింది.
ప్ర. పర్సనలైజ్డ్ మందుల తయారీలో జెనెటిక్స్ ఏ మేరకు ఉపయోగపడతాయి?
జ. ఇటీవల ఎఫ్‌డీఐ క్యాన్సర్‌కు సంబంధించి జన్యు సంబంధమైన అనేక రకాల మందులకు అనుమతులు ఇచ్చింది. అయితే 2000 సంవత్సరంలోనే జీన్ లాజిక్స్ అనే సంస్థను కొనుగోలు చేసి... మేం పర్సనలైజ్డ్ మందులపై పరిశోధనలు చేశాం. జన్యువులను అధ్యయనం చేసి వ్యాధుల రిస్క్ గురించి వివరిస్తాం. దీనినే పాలిజెనిక్ రిస్క్ స్కోరింగ్‌గా చెప్తాం. మేం ఎప్పటి నుంచో ఈ రిస్క్ స్కోర్‌ను అందిస్తున్నాం... అయితే ఇటీవల కాలంలో దీనికి ఎక్కువ ప్రాధాన్యత వచ్చింది. మాకు పాలిజెనిక్ రిస్క్ స్కోర్‌కి సంబంధించిన పేటెంట్ కూడా ఉంది. ఇప్పుడు మేము జీనోమిక్స్ని బయోకెమిస్ట్రీకి జత చేసి పరీక్షలు చేస్తున్నాం. ప్రపంచంలో ఇది చేస్తున్న మొట్టమొదటి సంస్థ మ్యాప్ మై జీనోమే. ఇందుకోసం బెంగళూరు, దిల్లీల్లో ల్యాబ్‌లు ఏర్పాటు చేశాము. ముందుగా కొన్ని రకాల రక్త పరీక్షలు నిర్వహించి ప్రస్తుతం మీ ఆరోగ్య పరిస్థితిని అంచనావేస్తాం. దానికి మీ జెనెటిక్ రిపోర్టులను జత చేయటం ద్వారా భవిష్యత్తు ఆరోగ్య పరిస్థితులపై పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది.