International Yoga Day 2023 : ప్రతి ఏడాది జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకొంటారు. దీనిని 2015లో ప్రారంభించారు. 2014లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. యోగాకు ప్రత్యేకంగా ఒకరోజు ఉండాలని ప్రతిపాదించారు. దీనికి 193 దేశాలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. దీంతో ప్రతి ఏడాది జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలని 2014 డిసెంబర్ 11న ఐరాస ప్రకటించింది. ఫలితంగా శారీరక, మానసిక ఆరోగ్యం కోసం యోగా ఎంత ఉపయోగపడుతుందో ప్రపంచవ్యాప్తంగా అవగాహన కలుగుతోంది. ఈ ఏడాది 'వసుదైక కుటుంబానికి యోగా' అనే థీమ్‌తో ప్రచారం చేస్తున్నారు. ఈ జూన్ 21న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐక్యరాజ్య సమితిలో యోగా చేయనున్నారు.
యోగాతో శారీరక ఆరోగ్యంతోపాటు ఎన్నో మానసిక ప్రయోజనాలు ఉన్నాయి. యోగా.. కండరాలు, జాయింట్లతో పాటు మొత్తం శరీరాన్ని దృఢంగా చేస్తుంది. రోజూ యోగా ప్రాక్టీస్ చేస్తే ప్రశాంతంగా నిద్రపోతారు. ఒత్తిడిని తగ్గించి పాజిటివ్ థింకింగ్‌ను పెంచుతుంది. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు కూడా కోలుకునేందుకు.. యోగా ఉపకరిస్తుంది. క్రమం తప్పకుండా యోగా చేయడం ద్వారా పరిపూర్ణ ఆరోగ్యంతో ఉండొచ్చని వైద్యులు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంట్లోనే చేసుకునే ఐదు యోగాసనాలు, వాటి ఉపయోగాల గురించి ఇప్పుడు తెలుసుకోండి. నిత్యం వీటిని ఆచరించి ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నించండి.
శవాసనం
Shavasana Benefits : ఈ ఆసనం ఒత్తిడిని తగ్గించి శరీరానికి విశ్రాంతిని ఇస్తుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతాయి. ముఖ్యంగా నిద్రలేమి సమస్య దూరమవుతుంది. ఈ ఆసనం చేయడం కూడా సులభమే. ఈ ఆసనం వేసేందుకు వెల్లకిలా పడుకోవాలి. కాలి మడమలు లోపలికి, కాలి వేళ్లు బయటకు ఉండేలా రెండు కాళ్లను అడుగు దూరంలో ఉంచాలి. చేతులను శరీరం పక్కన ఉంచాలి. అరచేతులు ఆకాశం వైపు ఉండేలా పెట్టి చేతి వేళ్లను కొంచెం ముడిచి ఉంచాలి. ప్రశాంతంగా కళ్లు మూసుకుని విశ్రాంత స్థితిలో ఉండాలి.
వజ్రాసనం
Vajrasana Benefits : ఇది సులభంగా కూర్చొని చేసే ఆసనం. ఈ ఆసనం వల్ల అనేక లాభాలున్నాయి. కాలి కండరాలతో పాటు మడమలకు ఈ ఆసనం ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ఆసనం మొదలుపెట్టినపుడు మీ మడిమలు నొప్పి పెడతాయి. కొన్ని నిమిషాలు చేసిన తర్వాత మీకే అలవాటు అవుతుంది. ఈ ఆసనం వేసేందుకు మోకాళ్లపై కూర్చోవాలి. మడమలు, కాలి వేళ్లను లోపలికి పెట్టుకుని చేతులను మోకాలిపై ఉంచాలి.