జూన్ 21.. అంతర్జాతీయ యోగా దినోత్సవం. శరీరంలో రోగనిరోధక శక్తిని సహజంగా పెంచే విధానాల్లో యోగా ఒకటి. వేదకాలం నుంచి ఆదికాలం వరకు సనాతన భారత సంప్రదాయంలోనే ఇమిడి ఉంది యోగా సాధన. పూర్వీకులు శారీరక, మానసికోల్లాసానికి యోగా ఆచరించారు. ప్రాచీనకాలంలో ఎందరో మునులు, యతులు, రుషులు, యోగులు తమ తపోనిష్టకు అనారోగ్యం అడ్డు కాకుండా కనిపెట్టిన ఆసనాలు, ఆచరించిన శ్వాస సంబంధిత ప్రాణాయామాలు ఇప్పుడు ‘యోగా’ పాఠాలుగా మారాయి. మానసిక సమస్యలకు పరిష్కారం, శారీరక రుగ్మతలకు సమాధానం, అధ్మాత్మికానుభూతికి ఆలవాలం యోగానే. జీవనశైలిలో ఎన్ని హైటెక్ వసతులు, పోకడలు భాగమైనా ప్రాచీన యోగా పద్ధతులతోనే ఫలితాలు సాధిస్తున్నారు చాలా మంది. మంగళవారం ఎనిమిదో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకునేందుకు ప్రపంచం సిద్ధమైన వేళ.. ఈ ఏడాది 'యోగా ఫర్ హ్యుమానిటీ' అనే థీమ్‌తో వేడుకలను నిర్వహించాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం సూచనతో జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా 2015లో ప్రకటించింది ఐక్యరాజ్యసమితి. యోగా అంటే కేవలం బరువు తగ్గడానికో, కొవ్వు కరిగించుకోవడానికో చేసే ఆసనాలే కాదు. దానితో చాలా లాభాలు ఉన్నాయి. మనిషి శారీరక దృఢత్వాన్నీ, ఏకాగ్రతను పెంచుకోవడానికి ఇది సాయపడుతుంది. అందుకే దీన్ని అనుసరించేవారి సంఖ్య ఏటా పెరుగుతోంది. మానసిక ఒత్తిడి, కుంగుబాటు నుంచి ఉపశమనం, శారీరక ఎదుగుదల, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెంచుకోడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
గత శతాబ్దంలో యోగాలో విభిన్న ఆసనాలు ఆచరణలోకి వచ్చాయి. చాలా దేశాల్లో నగరాలు, పట్టణాల నుంచి పల్లెల వరకు యోగా శిక్షణాలయాలు వెలిశాయి. మన దేశంలోనూ స్థానికంగానే కాకుండా ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన యోగా విధానాలు అందుబాటులోకి వచ్చాయి. చికిత్స దృక్పథంతో యోగాను జీవన విధానంగా సాధన చేస్తున్న వారూ లేకపోలేదు. మంత్రం, ముద్రలు, ఆసనం, ప్రాణాయామం, యోగానిద్ర, హఠయోగ క్రియలు వంటి ఆసనాల్లో తర్ఫీదు పొందుతున్నారు. విశ్వవ్యాప్తంగా ఎందరో యోగా సాధకులుగా, గురువులుగా కొనసాగుతున్నారు.
'రెస్టొరేటివ్ యోగా'..
యోగాలో ఎన్నో ఆసనాలు, భంగిమలు ఉన్నా.. ఎక్కువమంది ఇష్టపడేది 'శవాసనం'. ఎందుకంటే ఎలాంటి కష్టం లేకుండా హాయిగా రిలాక్స్ కావచ్చు కదా..! మరి యోగా సెషన్ మొత్తం రిలాక్స్ కావడమే అయితే...? సాధారణ విశ్రాంతి భంగిమలకే కొంత యోగా ట్విస్ట్ ఇచ్చి అద్భుతమైన ఫలితాలను సాధించగలిగితే..? అలా వచ్చిందే 'రెస్టొరేటివ్ యోగా'. ఈ మధ్యే పాపులర్ అవుతున్న ఈ ప్రత్యేకమైన యోగా గురించి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.
ఎక్కడిదీ యోగా..?