Childhood Cancer: క్యాన్సర్ అనగానే ముందుగా పెద్దవాళ్లే గుర్తుకొస్తారు. నిజమే. పెద్ద వయసులో క్యాన్సర్ ముప్పు ఎక్కువే. అలాగని పిల్లలకు రాకూడదనేమీ లేదు. క్యాన్సర్ బాధితుల్లో 5% మంది పిల్లలే. పద్నాలుగేళ్ల లోపువారిలో వచ్చే వాటిని చైల్డ్‌హుడ్ క్యాన్సర్లు అంటారు. వీరిలో కారణాలేవీ లేకుండా తలెత్తే క్యాన్సర్లే ఎక్కువ. చెడు అలవాట్ల వంటి ముప్పు కారకాలేవీ లేకపోయినా పిల్లలు క్యాన్సర్ బారినపడటం ఒకరకంగా దురదృష్టకరమనే అనుకోవచ్చు. ఇందులో చిన్నారుల తప్పేమీ లేదు. పుట్టుకతోనే జన్యువుల పనితీరు అస్తవ్యస్తం కావటం దీనికి మూలం. వంశ పారంపర్యంగా.. అంటే కుటుంబంలో ఎవరైనా క్యాన్సర్ బారినపడి ఉండటం వల్ల రావచ్చు. అసలు ఎలాంటి కారణాలు లేకపోయినా రావచ్చు. మంచి విషయం ఏంటంటే- పిల్లల్లో తలెత్తే క్యాన్సర్లన్నీ దాదాపుగా నయం చేయదగినవే! పెద్దవారిలో 60-65% మందిలో క్యాన్సర్ తగ్గితే.. పిల్లల్లో 85-90% మందిలో పూర్తిగా నయమవుతుంది. పిల్లల్లో క్యాన్సర్ నయమయ్యే స్వభావం ఎక్కువ. పెద్దవాళ్లకు కీమోథెరపీ నుంచి కోలుకోవటానికి ఎక్కువ సమయం పడుతుంది. అదే పిల్లలకు కీమోథెరపీ మాత్రమే కాదు.. ఎముకమజ్జ మార్పిడి వంటి పెద్ద చికిత్సలు చేసినా వేగంగా కోలుకుంటారు. సర్జరీ నుంచీ తేలికగా, త్వరగా బయటపడతారు. కోత త్వరగా మానుతుంది. పైగా పిల్లలకు చికిత్స చేయటమూ సులభమే. కాస్త చనువు పెరిగితే డాక్టర్లతో సన్నిహితంగా మెలుగుతారు. మాటల మధ్యలోనే చికిత్స చేయటం వీలవుతుంది. కాబట్టి 'అయ్యో.. పిల్లలకు ఇదేం కర్మ' అని అనుకోవద్దు. ధైర్యంగా ఉండాలి. పిల్లల్లో ధైర్యాన్ని నింపాలి. 3-4 నెలలు చికిత్స చేస్తే తిరిగి మామూలుగా అవుతారని తెలుసుకోవాలి.
క్యాన్సర్లు- రకరకాలు
బాల్య క్యాన్సర్లు పెద్ద వయసులో వచ్చే క్యాన్సర్ల వంటివి కావు. కాలుష్యం, తినే పదార్థాలు, రసాయనాల వంటి పరిసరాల ప్రభావంతో (ఎక్సోజీనస్) తలెత్తే ఊపిరితిత్తులు, అన్నవాహిక, మూత్రాశయ క్యాన్సర్ల వంటివి పిల్లలకు రావు. వీరిలో రక్తక్యాన్సర్ (ల్యుకీమియా), లింఫ్ వ్యవస్థ క్యాన్సర్ (లింఫోమా), మెదడు క్యాన్సర్, ఎముక క్యాన్సర్ (బోన్ సార్కోమా), కంటి క్యాన్సర్ (రెటీనోబ్లాస్టోమా), నాడీ కణాల క్యాన్సర్ (న్యూరోబ్లాస్టోమా), కిడ్నీ క్యాన్సర్ (విల్మ్స్ ట్యూమర్), కండర క్యాన్సర్ (రాబ్డోమయోసార్కోమా) ఎక్కువగా కనిపిస్తుంటాయి.
గుర్తించాలి- సత్వరం
పిల్లల్లో క్యాన్సర్లను ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. అప్పుడే త్వరగా చికిత్స అందించటం సాధ్యమవుతుంది. ఆయా లక్షణాల ద్వారా వీటిని గుర్తించొచ్చు. క్యాన్సర్ల రకాలను బట్టి లక్షణాలు ఆధారపడి ఉంటాయి.
- రక్తక్యాన్సర్‌లో- చర్మం, కళ్లు పాలిపోవటం ప్రధాన లక్షణం. బలహీనత, నిస్సత్తువ, బరువు తగ్గటమూ ఉంటాయి. పిల్లలు నడుస్తుంటే ఆయాస పడొచ్చు. ఆటల్లో త్వరగా అలసిపోయి, ఇంటికి వచ్చి పడుకోవచ్చు. గాయాలైనప్పుడు రక్తస్రావం ఆగదు. చర్మం కమిలిపోవచ్చు.
- మెదడు క్యాన్సర్‌లో- తలనొప్పి, చూపు మసకబారటం, అకారణంగా రోజూ వాంతి కావటం, నడుస్తుంటే తడబడటం, మూర్ఛ వంటివి కనిపిస్తాయి.
- నాడీకణాల క్యాన్సర్‌లో- కణితి పెద్దగా అయ్యేంతవరకు లక్షణాలేవీ ఉండవు. పెద్దగా అవుతున్న కొద్దీ కడుపులో నొప్పి వస్తుంది. స్నానం చేయిస్తున్నప్పుడు చేతికి కణితి తగులుతుంటుంది.
- కిడ్నీ క్యాన్సర్‌లో- స్నానం చేయిస్తున్నప్పుడో, ఒళ్లు నిమురుతున్నప్పుడో కడుపు మీద కణితిలాంటిది చేతికి తగులుతుంది. ఇందులో జ్వరం, నొప్పి, వాంతి, ఆకలి తగ్గటం వంటి లక్షణాలు ఉండొచ్చు.
- లింఫ్ క్యాన్సర్‌లో- కణితి తలెత్తిన చోటును బట్టి లక్షణాలు కనిపిస్తాయి. బరువు తగ్గటం, జ్వరం, నిస్సత్తువ.. చంక, మెడ, గజ్జల్లో లింఫ్ గ్రంథుల వాపు వంటివి ఉంటాయి.
- కంటి క్యాన్సర్‌లో- ఫొటోలతో దీన్ని తేలికగా కనుక్కోవచ్చు. ఫొటో తీసినప్పుడు కంట్లో తెల్లగా ఫ్లాష్‌లాగా మెరిసినట్టు కనిపిస్తుంది.
- ఎముక క్యాన్సర్‌లో- కాళ్ల మీద గానీ చేతుల మీద ఉబ్బు కనిపిస్తుంది. ముఖ్యంగా దెబ్బలేవీ తగలకుండా అకారణంగా ఉబ్బితే నిర్లక్ష్యం చేయొద్దు.
- కండర క్యాన్సర్‌లో- ఇది తల, మెడ, గజ్జలు, కడుపు, కటి భాగం, చేతులు, కాళ్లు.. ఇలా ఒంట్లో ఎక్కడైనా తలెత్తొచ్చు. ఇందులో ఆయా భాగాల్లో వాపు, లింఫ్ గ్రంథులు ఉబ్బటం ప్రధానంగా కనిపిస్తాయి.
చికిత్స- కీమోథెరపీ ముఖ్యం
పిల్లల క్యాన్సర్లలో కీమోథెరపీ చాలా ముఖ్యం. కొన్నిసార్లు సర్జరీ చేయాల్సి రావొచ్చు.
- రక్తక్యాన్సర్‌లో ప్రధానమైనవి అక్యూట్ లింఫోసైటిక్ ల్యుకీమియా, అక్యూట్ మైలాయిడ్ ల్యుకీమియా. ఇలాంటివి త్వరగా ముదురుతాయి. కాబట్టి సత్వరం చికిత్స అవసరం. ఒకో రకానికి ఒకో రకమైన చికిత్స చేయాల్సి ఉంటుంది. ల్యుకీమియా, లింఫోమాల్లో 90% మంది పిల్లలకు కీమోనే సరిపోతుంది. కొందరికి ఎముక మజ్జ మార్పిడీ అవసరమవుతుంది.
- రెటీనా బ్లాస్టోమా 99% శాతం మందికి నయమవుతుంది. దాదాపు 65% మందికి కన్ను తొలగించాల్సిన అవసరమేమీ ఉండదు. గ్రూప్ 1, గ్రూప్ 2 దశలో లేజర్ ద్వారా క్యాన్సర్ తలెత్తిన భాగాన్ని నేరుగా కాల్చేయొచ్చు. గ్రూప్ 3, గ్రూప్ 4 దశల్లో కీమోథెరపీ ఉపయోగపడుతుంది. దీంతోనే చాలావరకు నయమవుతుంది. ఒకవేళ పూర్తిగా నయం కాకపోయినా జబ్బు తీవ్రత తగ్గుతుంది. అప్పుడు లేజర్‌తో చికిత్స చేస్తే కుదురుకుంటారు. గ్రూప్ 5 దశలో ఉంటే కన్ను తొలగించి, తర్వాత క్యాన్సర్ తిరగబెట్టకుండా కీమోథెరపీ ఇవ్వాల్సి ఉంటుంది.
- పిల్లల్లో మాత్రమే వచ్చే విల్మ్స్ ట్యూమర్‌ను తేలికగా నయం చేయొచ్చు. గ్రూప్ 1, గ్రూప్ 2 దశలో తదనంతర చికిత్స కూడా అవసరం లేదు. గ్రూప్ 3 దశలో ఉంటే కీమోథెరపీ అవసరమవుతుంది. రేడియేషన్ కూడా అవసరమవ్వచ్చు.
- నాడీ కణాల క్యాన్సర్‌లో సర్జరీ ద్వారా కణితిని తొలగించి, తర్వాత కీమో ఇస్తారు. రేడియేషన్ అవసరం లేదు.
- ఎముక క్యాన్సర్‌లో దెబ్బతిన్న ఎముకను కత్తిరించి, తొలగిస్తారు. ఆ భాగంలో కృత్రిమ పరికరాన్ని అమరుస్తారు.
- కండరాల కణితులనూ సర్జరీతో తొలగించాల్సి ఉంటుంది.
- మెదడు కణితులను సర్జరీ చేసి తొలగిస్తారు.
రేడియేషన్ జాగ్రత్తగానే..