తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

'రోజూ మందు తాగే అలవాటు ఉందా? సంతానోత్పత్తి కష్టమే!' - సంతానోత్పత్తి సమస్యలు

మద్యం మత్తు వల్ల జీవితాలే నాశనమవుతున్నాయి. ఇది భార్యాభర్తల మధ్య చిచ్చుపెట్టడమే గాక వారికి సంతానం కలగకుండా చేస్తోంది. మద్యానికి బానిసైన భర్తలు, భార్యలకు సంతానం పెద్ద సమస్యగా మారుతోందనే ఓ విషయం తాజా పరిశోధనలో వెల్లడైంది. ఇందుకు సంబంధించిన మరిన్ని కీలక విషయాలు..

INFERTILITY PROBLEM IN DRINKERS
తాగుడుకు బానిసైన వారిలో సంతానోత్పత్తి సమస్య!

By

Published : Feb 16, 2022, 2:40 PM IST

Infertility problem: సంతానం కలగకపోవడం చాలామందిని వేధిస్తున్న సమస్య. వైద్యరంగంలో ఇదో పెద్ద చర్చనీయాంశం. అందుకే దీనిపై పరిశోధనలు బాగా పెరుగుతున్నాయి. దేశంలో సంతానలేమి 3.9శాతం నుంచి 16.8శాతం దాకా ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. తమిళనాడులోనూ ఈ తరహా బాధితులున్నారు. ఈ నేపథ్యంలో చెన్నైలోని చెట్టినాడు అకాడెమీ ఆఫ్‌ రీసెర్చ్​ అండ్‌ ఎడ్యుకేషన్, చెట్టినాడు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలోని ఓ పరిశోధన బృందం ఈ కీలక సమస్యపై దృష్టిపెట్టింది. సంతానం లేకపోవడానికి తాగుడు కూడా ఓ ప్రధాన కారణమని నిరూపించింది. దీనిపై వీరు ఓ జర్నల్‌ను కూడా ప్రచురించారు.

పరిశోధన ఇలా..

ఏడాదిపాటు జరిగిన ఈ పరిశోధనలో సంతానలేమి సమస్యలతో వచ్చిన కేసుల వివరాల్ని సేకరించడమే గాక వారితో వారితో మాట్లాడారు. ప్రత్యేకించి 231 మంది మగవారిపై ఈ పరిశోధన చేశారు. సంతానలేమి సమస్యకు తాగుడు ప్రధాన కారణమా? కాదా? అని తేల్చేందుకు సర్వేలో మద్యం తాగేవారిని 81మందిని, మద్యం అలవాటులేనివారిని 150మందిని తీసుకున్నారు. ఈ రెండువర్గాల వారికి డబ్ల్యూహెచ్‌ఓ ప్రమాణాల ప్రకారం.. సీమెన్‌ (వీర్య), స్పెర్మ్‌ (వీర్యకణ) పరీక్షలు నిర్వహించారు. వచ్చిన ఫలితాల్ని విశ్లేషించి కారణాలపై పరిశోధన చేశారు.

ఆల్కహాల్‌ ఎఫెక్ట్​..

మద్యం అలవాటులేనివారితో పోల్చితే మద్యం తాగేవారిలో ఫలితాలు దారుణంగా ఉన్నాయి. మద్యం తీసుకునేవారిలో వీర్యం పరిమాణం, వీర్యకణాల నాణ్యత బాగా తక్కువగా ఉన్నట్లు తేలింది. వీరిలో వీర్యకణాల వృద్ధి, వాటి సంఖ్య, చలనశీలత బాగా తగ్గిపోయాయని గుర్తించారు. ఎందుకిలా జరుగుతోందన్నదానిపై గత పరిశోధనల్నీ విశ్లేషించుకుని చూశారు. టెస్టోస్టిరాన్‌ హార్మోన్లను విడుదలచేసే వృషణంలోని లెడిగ్‌ కణాలపై ఆల్కహాల్‌ ప్రభావం చూపుతుందని పరిశోధకులు చెబుతున్నారు. వీర్యం విడుదలకు కారణమయ్యే లూటినైజింగ్‌ హార్మోన్‌ (ఎల్‌హెచ్‌), ఫోలికల్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌ (ఎఫ్‌ఎస్‌హెచ్‌)పైనా ఆల్కహాల్‌ ప్రభావముందని తెలిపారు. ఫలితంగా సంతానోత్పత్తి ప్రక్రియకు తీవ్ర ఆటంకం కలుగుతోందన్నారు. మద్యం తీసుకునే తీవ్రతను బట్టి పురుషుల వీర్యంలో, వీర్యకణాల్లో బలహీనతలు కనపడుతున్నాయన్నారు.

అతిగా తాగి..

ఈ పరిశోధనలో మద్యం అలవాటు ఉన్న 21 నుంచి 52ఏళ్ల వయసు మగవారు పాల్గొన్నారు. వీరంతా పెళ్లయినవారే. ప్రధానంగా 31-40ఏళ్ల మధ్యవారు మితిమీరి మద్యం తీసుకుంటున్నట్లు వెల్లడైంది. బీర్, వైన్, విస్కీ, బ్రాందీ తదితరాల్ని వీరు తాగుతున్నారు. సర్వేలో పాల్గొన్న 81మంది మద్యం తాగేవారిలో 36మంది రోజువారీ ఆల్కహాల్‌ తీసుకోవడానికి అలవాటుపడ్డారు. వీరి పరీక్షల ఫలితాల్లో వీర్యం పరిమాణం చాలా తక్కువగా ఉందని తేల్చారు. ఈ ప్రభావం దంపతులకు సంతానం లేకుండా చేస్తోందని పరిశోధకులు పేర్కొన్నారు.

జీవితాల్లో ఆందోళన

సంతానోత్పత్తి లేకపోవడానికి మద్యం సేవించడం కూడా ప్రధాన కారణంగా భావిస్తున్నట్లు పరిశోధకులు పీజీ స్కాలర్‌ తనూజ లెళ్ల, ప్రొఫెసర్లు ఎ.రుక్మిణి, ఎన్‌.పాండియన్, ఆర్‌.అరుణ్‌కుమార్‌ తెలిపారు. మద్యానికి బానిసలుగా మారినవారిని మెల్లగా మాన్పించే ప్రయత్నం చేయాలని, లేకపోతే వారి జీవితాలు ఆందోళనకరంగా మారొచ్చని చెబుతున్నారు. సంతానం లేకపోవడమనేదే బాధాకర విషయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

పరిశోధనలు పెరగాలి

పెళ్లయినవారిలో పిల్లలు పుట్టకపోవడానికి మగవారు కూడా ఓ కారణమేనని పరిశోధకులు చెబుతున్నారు. ఇందులో చాలా కారణాలుంటాయని కూడా సూచిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన పరిశోధనల్ని బట్టి.. హార్మోన్ల సమస్య, పర్యావరణ పరిస్థితులు, మద్యం, పోగాకు తీసుకోవడం లాంటి కారణాలు కూడా ఉండొచ్చని చెబుతున్నారు. ఇలాంటివారిలో తక్కువ వయసప్పుడే బాగా బరువు పెరగడంగానీ, బాగా బరువు తగ్గడంగానీ జరుగుతూ ఉంటుందన్నారు. ఇప్పటిదాకా ఈ కోణంలో విదేశీ పరిశోధనలే ఎక్కువగా ఉన్నాయని, స్వదేశంలో చేసినవి చాలా తక్కువని చెప్పారు. దీనిపై ఇంకా మరిన్ని పరిశోధన జరగాల్సిఉందని సూచించారు.

ఇదీ చదవండి:Golden Pearl Tea: ఈ టీ పొడి బంగారం.. కేజీ రూ.లక్ష!

ABOUT THE AUTHOR

...view details