మా అమ్మాయికి నెలలు నిండాయి. లాక్‌డౌన్ వల్ల నేను వెళ్లి పురుడుపోయలేకపోతున్నా! చుట్టుపక్కల వాళ్లు ఎవరూ సాయం చేయకపోతే తన పరిస్థితి ఏంటి? అసలే తొలిచూలు. కంగారుపడుతుందో ఏమో. ఇది ఓ తల్లి ఆవేదన. ఆమెదే కాదు.. చాలామంది తల్లులది, కుటుంబసభ్యులదీ ఇదే వేదన. ఈ పరిస్థితి నుంచి బయటపడి పండంటి పాపాయితో ఇంటికి రావాలంటే ఏయే జాగ్రత్తలు పాటించాలో చూద్దాం...
తొలిచూలు అయితే
తల్లి దగ్గరలేదు. బంధువులు, స్నేహితురాళ్లు లేరు. తొలిచూలు. అలాంటప్పుడు కంగారువద్దు మామూలుగా మొదటి కాన్పు సమయంలో నొప్పులు మొదలయిన పన్నెండు గంటల తరువాత ప్రసవం అవుతుంది. రెండో కాన్పు అయితే ఆరేడు గంటల్లో ప్రసవం అవుతుంది. నొప్పులు మొదలుకాగానే అప్రమత్తం కావాలి. ప్రసవ నొప్పులు వచ్చేదాకా ఆగకుండా.. వైద్యులు సూచించిన డెలివరీ డేట్‌ను దృష్టిలో పెట్టుకుని దానికి తగ్గట్టు ముందస్తు ప్రణాళిక వేసుకోవాలి.
ఎవరూ లేరనే కంగారు వద్దు
చుట్టుపక్కలవాళ్లు, స్నేహితుల సాయంతోపాటు మీరు సొంతంగా 100కి ఫోన్ చేయొచ్ఛు పోలీసులు మీకు సాయం చేస్తారు. వారే స్వయంగా తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్పిస్తున్నారు. లేదంటే తగిన సౌకర్యం కల్పిస్తారు. ఇందుకు కొద్దిపాటి ముందుచూపు ఉంటే చాలు.
రెడ్‌జోన్‌లో ఉంటే
అందుబాటులో ఉన్న ఆసుపత్రికి ఎలా వెళ్లాలి, వెళ్లడానికి వాహనం అందుబాటులో ఉందా లేదా అన్నది ముందే చూసుకోవాలి. ముఖ్యంగా రెడ్‌జోన్ల పరిధిలో ఉండేవారు కాస్త దృష్టి పెట్టాల్సిన విషయం ఇది. అక్కడ 24 గంటలూ పోలీసులు అందుబాటులో ఉంటున్నారు. వారి సాయం తీసుకోవచ్చు.
గ్రామాల్లో ఉన్నవారు
గ్రామాలకు చెందిన గర్భిణులైతే తమకు అందుబాటులో ఉండే ఆశావర్కర్లు, ఏఎన్‌ఎమ్‌ల వివరాలను తీసి పెట్టుకోవాలి. ఏఎన్‌ఎమ్‌లు సహజ ప్రసవాలు చేయగలరు. తనకు సంబంధించిన విషయాలు గర్భిణికి, ఆమె కుటుంబ సభ్యులకు కూడా తప్పకుండా అవగాహన ఉండాలి. ప్రణాళిక లేకుండా చివరి నిమిషంలో అధికారులపై ఫిర్యాదులు చేయడం సరికాదు.
రక్తస్రావం అయితే
నాకింకా నెలలు నిండలేదు కదా ఈ సమస్య నాది కాదు అని అజాగ్రత్తగా ఉండొద్దు. అకస్మాత్తుగా రక్తస్రావం కావొచ్చు. కొన్నిసార్లు అబార్షన్ జరగొచ్చు. కొందరికి ఫిట్స్ రావొచ్చు. లేదా ఒక్కసారిగా రక్తపోటు పెరగొచ్చు ఇవన్నీ ఎప్పుడు వస్తాయో తెలియదు కదా. అందుకే ప్రతి గర్భిణి, ఆమె కుటుంబ సభ్యులు నెలలతో సంబంధం లేకుండా అందుబాటులో ఉండే వైద్యసేవల గురించి ఆరాతీయాలి. నిమిషం వరకు ఆగి.. నొప్పులు మొదలయ్యే సమయానికి కంగారుపడటం కాకుండా ముందుగానే కొన్ని విషయాలు ఆరాతీసి పెట్టుకోవాలి. మీ చుట్టుపక్కల ఏ ఆసుపత్రి పనిచేస్తుంది? ప్రభుత్వ ఆసుపత్రి ఎంత దూరంలో ఉంది? ఈ విషయాలు కనుక్కోవాలి.
ఇవి తెలుసుకోండి
చివరి నిమిషం వరకు ఆగి.. నొప్పులు మొదలయ్యే సమయానికి కంగారుపడటం కాకుండా ముందుగానే కొన్ని విషయాలు ఆరాతీసి పెట్టుకోవాలి. మీ చుట్టుపక్కల ఏ ఆసుపత్రి పనిచేస్తుంది? ప్రభుత్వ ఆసుపత్రి ఎంత దూరంలో ఉంది? ఈ విషయాలు కనుక్కోవాలి.
అనుమానాలకి
చిన్నచిన్న అనుమానాలకు ఆసుపత్రి వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇలాంటి అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి టెలీమెడిసిన్ అందుబాటులోకి వచ్చింది. కావాలంటే డాక్టర్‌తో వాట్సాప్ కాల్‌లో మాట్లాడొచ్చు. మీకు నిజంగా సమస్య ఉందో లేదో చెబుతారు. ఆసుపత్రికి రావాల్సిన అవసరం ఉంటే వారే అంబులెన్స్‌ని పంపిస్తారు.
డబ్ల్యూహెచ్‌వో నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
డబ్ల్యూహెచ్‌వో నిబంధనల ప్రకారం గర్భం దాల్చిన నాటి నుంచి తొమ్మిది నెలల్లో కనీసం ఎనిమిదిసార్లు వైద్యులను సంప్రదించాలి. మాములుగా అయితే ఏడోనెల దాకా ప్రతినెలా చెకప్‌కి వెళ్లాలి. ఏడు నుంచి తొమ్మిదో నెల వరకు పదిహేను రోజులకోసారి వెళ్లాలి. తొమ్మిదో నెల వచ్చిన తరువాత వారానికి ఒకసారి తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి. అంతకు ముందు నాలుగు సార్లు వస్తే చాలనేవారు. మొదటి మూడు నెలల్లో ఒకసారి, ఏడో నెల దాకా ఒకసారి, ఆ తరువాత రెండుసార్లు వస్తే చాలనేవారు. డబ్ల్యూహెచ్‌వో 2014 నుంచి దీన్ని మార్చేసింది.
మొదటి మూడు నెలల్లో ఒకసారి, ఏడో నెలలోపు రెండుసార్లు, ఏడో నెల దాటిన తరువాత కనీసం అయిదుసార్లు వైద్యులను సంప్రదించాలి. మొత్తం ఎనిమిది సార్లు. ఈ విపత్కర సమయంలో ఎనిమిదికి బదులు కనీసం నాలుగుసార్లైనా వెళ్లండి. మూడో నెలలో ఒకసారి, అయిదో నెలలో ఒకసారి, మళ్లీ ఎనిమిదిలో, తొమ్మిదిలో ఒక్కోసారి. వైద్యులు పరీక్ష చేసి సహజ ప్రసవమా... సిజేరియనా అన్నది చెబుతారు. ఎలాంటి లక్షణాలు కనిపిస్తే ఆసుపత్రికి రావాలో చెబుతారు. చెకప్‌కోసం డాక్టర్ దగ్గరకు వెళ్లకుండా.. తీరా నొప్పులు మొదలయ్యాక వెళతామంటే కొందరిలో రక్తస్రావం కావొచ్చు ఎమర్జెన్సీ వరకూ ఆగొద్దు.
ఇదీ చదవండి:కారు దిగలేదని వైద్యుడిపై దుండగుల కాల్పులు!