రోగనిరోధక వ్యవస్థ ఎంత గొప్పగా ఉంటే.. కరోనాతో ప్రాణాపాయం ముప్పు అంత తక్కువగా ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పక వ్యాయామం, కంటి నిండా నిద్ర, ఒత్తిడిని తగ్గించుకోవటం వంటివన్నీ రోగనిరోధక వ్యవస్థకు దన్నుగా నిలుస్తాయి. అన్నింటికన్నా సమతులాహారం ముఖ్యపాత్ర పోషిస్తుంది. అందుకే మనమిప్పుడు కరోనా కాలంలో ఏబీసీడీలు నేర్చుకోవటం అత్యావశ్యకం. రోగనిరోధకశక్తి బలోపేతం కావటంలో తోడ్పడే విటమిన్ ఏ, బీటా కెరొటిన్, విటమిన్ సీ, డీ, జింక్ వంటి విటమిన్లు, పోషకాలు ఎంతో తోడ్పడుతాయి. కరోనా కాలంలో మనల్ని ఆదుకోగలిగినవి ఇవే. మరి ఏయే పోషకాలు ఎందులో ఎక్కువగా లభిస్తాయో? అవి రోగనిరోధకశక్తి పెంపొందటానికి ఎలా తోడ్పడతాయో తెలుసుకుంటే మరింత నిర్లక్ష్యం చేయకుండా తినటానికి వీలవుతుంది.
ఇవి బాగా తినండి.. కరోనాను దరిచేరనివ్వకండి! - విటమిన్లు ఈటీవీ భారత్
కరోనా మొదటి దశ పోయింది. సెకండ్ వేవ్ వచ్చింది. ఇది ఎప్పుడు పోతుంది? మూడో దశ కూడా వస్తుందా? ఇలాంటి సందిగ్ధావస్థలో మనల్ని మనం కాపాడుకునేదెలా? సార్స్-కోవ్- 2ను సమర్థంగా ఎదుర్కొనేలా సన్నద్ధం చేసుకోవటమే ఆ ప్రశ్నకు జవాబు. ఇందుకు తిరుగులేని ఆయుధం రోగ నిరోధకశక్తిని ఇనుమడింపజేసుకోవటం. మరి రోగ నిరోధకశక్తిని పెంచుకునేందుకు ఉపయోగపడే విటమిన్లు ఏంటి? అవి ఏ ఆహారపదార్థాల్లో ఉంటాయి?
చాలావరకు విటమిన్లు, ఖనిజ లవణాలను ఆహారం ద్వారానే లభించేలా చూసుకోవచ్చు. అందువల్ల సమతులాహారం తీసుకోవటం అన్నింటికన్నా ముఖ్యం. రకరకాల కూరగాయలు, పండ్ల రంగులతో పళ్లెం కళకళలాడేలా పదార్థాలు వడ్డించుకోవాలి. ఒకట్రెండు రకాల పదార్థాలను మానేసినా పోషణ లోపానికి దారితీస్తుందని గుర్తించాలి. ఒకవేళ మాత్రల రూపంలో తీసుకోవాలనుకుంటే డాక్టర్ సలహా మేరకు వివిధ విటమిన్లతో కూడిన మాత్రలతో ఆరంభించొచ్చు. కాకపోతే ఆహారం ద్వారా తీసుకునే పోషకాలనే శరీరం బాగా గ్రహిస్తుంది.
ఇదీ చూడండి:-జవం.. జీవం.. సూర్యం- ఆరోగ్యం మీ వశం!