ముందు చూస్తే కరోనా.. వెనుక చూస్తే క్యాన్సర్! - coronavirus condition overview
క్యాన్సర్ బాధితులకు కరోనా కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. ఒకవైపు కొవిడ్-19 ముప్పు పెరుగుతోందనే భయం, మరోవైపు అవసరమైన చికిత్సలు ఆలస్యమవుతున్నాయనే ఆందోళన ఎంతోమందికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వైద్యులు సైతం క్యాన్సర్ చికిత్సల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కరోనా నివారణకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. తీవ్రతను బట్టే చికిత్సలపై నిర్ణయం తీసుకుంటున్నారు. చికిత్సలనూ మార్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో క్యాన్సర్లు, కొవిడ్-19పై సమగ్ర కథనం...
ముందు చూస్తే కరోనా.. వెనక చూస్తే క్యాన్సర్!
By
Published : May 12, 2020, 11:17 AM IST
|
Updated : May 21, 2020, 4:50 PM IST
క్యాన్సర్ బారినపడ్డవారి పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి, వెనక గొయ్యిలా మారింది. మధుమేహం, గుండెజబ్బులు, అధిక రక్తపోటు వంటి దీర్ఘకాల సమస్యలతో బాధపడేవారితో పాటు క్యాన్సర్ బాధితులకూ కరోనా ముప్పు ఎక్కువగా ఉండటమే కాదు, తీవ్రతా అధికంగానే ఉంటోంది. కొత్త కరోనా జబ్బుతో సంభవిస్తున్న మరణాల్లో క్యాన్సర్ బాధితులూ పెద్ద సంఖ్యలో ఉంటుండటమే దీనికి నిదర్శనం. ఇటీవల అమెరికాలో నిర్వహించిన అధ్యయనం ఇదే విషయాన్ని బయటపెట్టింది. లుకీమియా, లింఫోమా వంటి రక్తక్యాన్సర్ల బాధితులకైతే మరణాల ముప్పు మరింతగా ఎక్కువగానూ ఉంటోంది. క్యాన్సర్ బాధితులు కరోనా బారినపడకుండా కాపాడుకోవటం, ఒకవేళ కరోనా సోకితే ప్రమాదకర లక్షణాలేవైనా పొడసూపుతున్నాయా అనేది గమనిస్తుండటం అత్యావశ్యకమని అధ్యయన ఫలితాలు చెప్పకనే చెబుతున్నాయి. కొన్నిరకాల క్యాన్సర్లతో పాటు క్యాన్సర్ చికిత్సలూ కరోనా దాడికి అవకాశం కలిగిస్తుండటమే దీనికి కారణం. అందుకే ఎవరి జాగ్రత్తలో వారుండటం తప్పనిసరి.
ఎందుకీ ముప్పు?
సహజంగానే లింఫోమా, లుకీమియా వంటి కొన్ని క్యాన్సర్లలో రోగనిరోధకశక్తి తగ్గుతుంది. అలాగే కీమోథెరపీ, రేడియేషన్ వంటి క్యాన్సర్ చికిత్సలతోనూ రోగనిరోధకశక్తి తగ్గుముఖం పడుతుంది. ఫలితంగా కరోనా వైరస్‌ను ఎదుర్కొనే, జబ్బును తట్టుకునే శక్తి క్షీణిస్తుంది. ఇదే క్యాన్సర్ బాధితులకు కరోనా ముప్పు పెరగటానికి దారితీస్తోంది. అంతేకాదు, చికిత్సల కోసం ఆసుపత్రికి రావాల్సి ఉండటం, ఇందుకోసం దూరాల నుంచి ప్రయాణాలు చేయాల్సి రావటం వంటివీ ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. ఆసుపత్రుల్లోనూ ఇతర రోగులతో కలిసి చికిత్సల కోసం వేచి చూడాల్సి ఉంటోంది. ఆసుపత్రి సిబ్బందితో మాటామంతీ అవసరమవుతుంది. ఈ క్రమంలో ఎవరికి కరోనా ఉన్నా వైరస్ సోకే అవకాశం లేకపోలేదు. క్యాన్సర్ బాధితుల్లోనూ గుండెజబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం, కిడ్నీజబ్బులు, నాడీ సమస్యల వంటి ఇతరత్రా సమస్యలూ ఉంటుండొచ్ఛు ఇవీ కరోనా బారినపడేలా చేసేవే. ఇలా ఎలా చూసినా క్యాన్సర్ బాధితులకు నలుదిక్కులా ముప్పు పొంచి ఉంటోంది.
తీవ్రతను బట్టి చికిత్స
కరోనా విజృంభణ మూలంగా దిగ్బంధం విధించటం, రవాణా సదుపాయాలు తగ్గిపోవటం వంటివన్నీ క్యాన్సర్ చికిత్సల మీదా ప్రభావం చూపుతున్నాయి. ఆసుపత్రుల్లోనూ వైరస్ సోకే ప్రమాదం పొంచి ఉంటోంది. అందుకే అత్యవసరమైతేనే చికిత్సలు, పరీక్షలు చేయటం అనివార్యమైంది. కాబట్టే క్యాన్సర్ నయమవుతుందా? కాదా? అనే దానికన్నా ప్రాణాలకు ప్రమాదం ఉందా అనేదే ప్రధానంగా మారింది. క్యాన్సర్ తీవ్రతను బట్టి చికిత్సలపై నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు చికిత్స చేయకపోతే 15 రోజుల్లో చనిపోయే అవకాశముందని అనిపిస్తే కరోనా జబ్బు ఉన్నా, లేకపోయినా వెంటనే చికిత్స చెయ్యాల్సిందే. మరో మార్గం లేదు. చిన్నపిల్లల్లో వచ్చే లింఫోమా, రక్తక్యాన్సర్.. పెద్దవాళ్లలో వచ్చే కొన్నిరకాల క్యాన్సర్లు ఈ కోవలోకి వస్తాయి. క్యాన్సర్ తొలిదశలోనే ఉన్నవారికి, అది 3 నెలల్లో ఒకటో దశ దాటే అవకాశం లేనివారికి, కణితి ఏదో ఒక్క చోటనే ఉన్నవారికి చికిత్సలు వాయిదా వేయటమే మంచిది. ఎందుకంటే కీమోథెరపీ, రేడియోథెరపీలతో రోగనిరోధకశక్తి తగ్గి కరోనా సోకే ముప్పు పెరుగుతుంది. ఇక క్యాన్సర్ బాగా ముదిరిపోయింది, ఇప్పటికే రెండు, మూడు సార్లు చికిత్స తీసుకున్నారు, ప్రస్తుతం ఉపశమన చికిత్సలే తీసుకోవాల్సి ఉందనుకోండి. ఇలాంటివారికి కీమో అవసరమే అయినా ఇంజెక్షన్లకు బదులు మాత్రల రూపంలో మందులు ఇవ్వటం మంచిది. క్యాన్సర్ బాగా ముదిరినట్టు కొత్తగా బయటపడినప్పుడు, చికిత్స చేయకపోతే ప్రాణాలు దక్కవని భావించినప్పుడు వెంటనే చికిత్స ఆరంభించాలి. సర్జరీ, రేడియేషన్, కీమోథెరపీ.. ఇలా అవసరమైన చికిత్సలన్నీ చేయటం తప్పనిసరి. కాబట్టి డాక్టర్లు చికిత్సలను వాయిదా వేసుకోవాలని సూచించినప్పుడు నిరాశకు లోనవటం తగదు. మన మంచి కోసమే నిర్ణయం తీసుకున్నారని తెలుసుకోవాలి.
ముప్పు ఎవరికి ఎక్కువ?
కీమోథెరపీ తీసుకుంటున్నవారికి, గత 3 నెలల కాలంలో కీమోథెరపీ తీసుకున్నవారికి
రేడియోథెరపీ తీసుకుంటున్నవారికి
గత 6 నెలల కాలంలో ఎముకమజ్జ, మూలకణ మార్పిడి చేయించుకున్నవారికి. రోగనిరోధకశక్తిని అణచిపెట్టి ఉంచే చికిత్స తీసుకుంటున్నవారికి
రోగనిరోధకశక్తిని దెబ్బతీసే లుకీమియా, లింఫోమా లేదా మైలోమా లాంటి క్యాన్సర్లలో చికిత్స ఆరంభించకపోయినా ముప్పు పెరగొచ్చు
క్యాన్సర్ చికిత్స పూర్తయినవారికి ప్రత్యేకించి కరోనా ముప్పు పెరిగే అవకాశమేదీ లేదు. ఇతరుల మాదిరిగానే ముప్పు పొంచి ఉంటుంది
లక్షణాల్లో తేడాలూ ముఖ్యమే
ఒక్క కరోనాలోనే కాదు, ఇతరత్రా ఇన్‌ఫెక్షన్లలోనూ జ్వరం రావొచ్ఛు వీటిల్లోనూ దగ్గు, ఆయాసం, వికారం, విరేచనాలు, ఆకలి మందగించటం వంటి కరోనా లక్షణాలే కనిపిస్తుండొచ్ఛు కొందరిలో క్యాన్సర్ల మూలంగానూ ఇలాంటి సమస్యలు ఇబ్బంది పెడుతుండొచ్ఛు అందువల్ల వీటి మధ్య తేడా తెలుసుకొని ఉండటం ముఖ్యం. పరీక్ష చేస్తే సమస్య బయటపడుతుంది. కరోనా లేకపోతే వెంటనే ఇతర సమస్యలకు చికిత్స చేయాల్సి ఉంటుంది. కొన్ని క్యాన్సర్ సంకేతాలను కరోనా లక్షణాలుగానూ పొరపడే అవకాశం లేకపోలేదు. ఉదాహరణకు- ఊపిరితిత్తుల క్యాన్సర్‌లోనూ దగ్గు, ఆయాసం వంటి కరోనా లక్షణాలే కనిపిస్తుంటాయి. ఛాతీ ఎక్స్‌రే, సీటీ స్కాన్‌లోనూ కరోనా మాదిరి మార్పులే కనిపిస్తాయి. అందువల్ల లక్షణాలను బట్టి కాకుండా సమస్యను నిర్ధారించటం ముఖ్యం. కొందరికి క్యాన్సర్‌తో పాటు కరోనా కూడా ఉండొచ్ఛు కరోనా ఉన్నట్టయితే ముందుగా కరోనాకు చికిత్స చేయాలి. తర్వాతే క్యాన్సర్ చికిత్స ఆరంభించాలి. కరోనా ఉన్నవారికి క్యాన్సర్ చికిత్స చేస్తే త్వరగా ప్రాణాపాయం ముంచుకురావొచ్ఛు కాబట్టి లక్షణాల తేడాను గుర్తించటం చాలా చాలా కీలకం. అవి క్యాన్సర్ మూలంగా వస్తున్నాయా? ఇతరత్రా సమస్యలతోనా? కరోనాతోనా? అన్నది జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది.
చికిత్సల్లోనూ మార్పులు
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో క్యాన్సర్ చికిత్సల్లోనూ కొన్ని మార్పులు చేయటం తప్పనిసరైంది. ఇంజెక్షన్లకు బదులు కీమో మందును మాత్రల రూపంలో ఇవ్వటం, రేడియేషన్ వ్యవధిని కుదించటం వంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇవి కరోనా ముప్పు తగ్గటానికి ఎంతగానో తోడ్పడతాయి. శస్త్రచికిత్స ఇప్పుడప్పుడే అవసరం లేనివారికి, ఇప్పటికే సర్జరీ అయిపోయినవారికి వీలుంటే మాత్రల రూపంలోనే కీమోథెరపీ ఇవ్వటానికి మొగ్గుచూపుతున్నారు. ఇవి తెల్లరక్తకణాల సంఖ్యను తగ్గించకుండానే మంచి ఫలితం చూపిస్తాయి. రేడియేషన్ విషయంలోనూ 20 రోజుల పాటు ఇచ్చే చికిత్సను 10 రోజులకే కుదిస్తున్నారు. 5 రోజుల చికిత్సను ఒక రోజుకే పరిమితం చేస్తున్నారు. దీన్నే హైపోఫ్రాక్షనేషన్ అంటారు. ఇందులో మొత్తంగా ఇవ్వాల్సిన రేడియేషన్ మోతాదును మార్చకుండానే తక్కువ రోజుల్లో చికిత్స పూర్తిచేస్తారు. అంటే ఒక దఫా ఇవ్వాల్సిన రేడియేషన్ మోతాదును పెంచుతారు. దీని మోతాదును పెంచినా దుష్ప్రభావాలేవీ ఉండవని తెలుసుకోవాలి.
* కీమోథెరపీ తీసుకునేవారికి తెల్లరక్తకణాలు పడిపోకుండా చూసే ఇంజెక్షన్లను గతంలో కొందరికే ఇచ్చేవారు. ఇప్పుడు అందరికీ ఇవ్వటం తప్పనిసరి చేశారు. అలాగే ఎర్రరక్తకణాలు పడిపోకుండానూ ఇంజెక్షన్లు విధిగా ఇస్తున్నారు.
జాగ్రత్తలు తప్పనిసరి
అధిక రక్తపోటు, మధుమేహం వంటి ఇతరత్రా సమస్యలు గలవారితో పోలిస్తే క్యాన్సర్ బాధితులకే కొవిడ్19 ముప్పు ఎక్కువ. ఇతరత్రా సమస్యల్లో వృద్ధులకే కరోనా ముప్పు ఎక్కువ. కానీ క్యాన్సర్ బాధితుల్లో వయసుతో నిమిత్తం లేకుండా అందరికీ ముప్పు ఎక్కువగా ఉంటోందన్న సంగతి గుర్తించాలి. కాబట్టి మామూలు వాళ్ల కన్నా ఇంకాస్త ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి.
చికిత్స ఆరంభించినప్పుడు కరోనా లేకపోవచ్ఛు ఆ తర్వాత రాకూడదనేమీ లేదు. అందువల్ల జ్వరం, దగ్గు వంటి కరోనా అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే నిర్ధారణ పరీక్ష చేయించటం తప్పనిసరి.
వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలి. ఇంట్లో ఉన్నప్పుడూ రోజంతా విధిగా మాస్కు ధరించాలి. ఇంట్లో మిగతావాళ్లూ వీలైనంతవరకు మాస్కు ధరించాలి. క్యాన్సర్ బాధితులను అనవసరంగా తాకొద్ధు వారి పడక మంచం మీద వేరేవాళ్లు పడుకోకుండా చూసుకోవాలి.
పరిశుభ్రత చాలా ముఖ్యం. రోజూ స్నానం చేయాలి. వీలైతే రెండు సార్లు స్నానం చేయటం మంచిది.
చెమట పట్టకుండా చూసే నూలు దుస్తులు ధరించాలి. బిగుతైన దుస్తులు ధరించొద్దు.
అన్ని పోషకాలతో కూడిన సమతులాహారం తీసుకోవాలి. అప్పుడే వండిన ఆహారం తినటం చాలా ముఖ్యం.
తొక్క తీయగలిగిన పండ్లు తినొచ్ఛు తొక్కతీయగలిగిన కూరగాయలతో చేసిన సలాడ్లే తీసుకోవాలి.
కూరగాయలను కొన్న తర్వాత పొటాషియం పర్మాంగనేట్ కలిపిన నీటిలో రెండు నిమిషాలు వేసి ఉంచాలి. దీంతో సూక్ష్మక్రిములేవైనా ఉంటే అన్నీ చనిపోతాయి.
గుడ్డు, చేప, చికెన్, మటన్ వంటివన్నీ తీసుకోవచ్ఛు నిషేధం ఏమీ లేదు.
గదిలోకి గాలి ధారాళంగా వచ్చేలా చూసుకోవాలి.
బయటకు వెళ్లినప్పుడు ఇతరులకు సన్నిహితంగా మెలగొద్ధు కనీసం రెండు మీటర్ల దూరంలో ఉండేలా చూసుకోవాలి.
కీమోథెరపీ తీసుకుంటున్నప్పుడు వాంతులు, విరేచనాలు అవుతుంటాయి. వీటితో ఒంట్లో నీటిశాతం తగ్గి, రక్తప్రసరణ దెబ్బతినే ప్రమాదముంది. అందువల్ల ద్రవాలు తగినంతగా తీసుకోవాలి. నీటిశాతం తగ్గకుండా చూసుకోవాలి. ఉప్పు కలిపిన మజ్జిగ తీసుకుంటే ఇంకా మంచిది. మజ్జిగలోని లాక్టోబాసిలై అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది పేగుల్లోని బ్యాక్టీరియా సమతుల్యత దెబ్బతినకుండా కాపాడుతుంది. పులిసిన పిండితో చేసే ఇడ్లీ, దోశ వంటివీ మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందటానికి తోడ్పడతాయి. తెలగ పిండితో (నువ్వులపొడి) చేసే ఉరుపిండి వడియాలు సైతం మేలు చేస్తాయి. వీటిల్లో ఈస్ట్ దండిగా ఉంటుంది.
చికిత్స పూర్తయినవారు మాటిమాటికి ఆసుపత్రులకు వెళ్లాల్సిన పనిలేదు. ఫోన్ ద్వారా డాక్టర్‌ను సంప్రదించి పరిస్థితి వివరిస్తే చాలు. కరోనా కలకలం తగ్గిన తర్వాత ఆసుపత్రికి వెళ్లి చూపించుకోవచ్చు.
అత్యవసరమైతేనే ఆసుపత్రికి
కరోనా బారినపడ్డా అందరికీ స్పష్టంగా లక్షణాలు కనిపించాలనేమీ లేదు. నూటికి 80 మందికి పెద్దగా లక్షణాలేవీ బయటపడటం లేదు. కాబట్టి ఎవరికి కరోనా ఉందో? ఎవరికి లేదో? చూసి తెలుసుకోవటం కష్టం. పైగా ఆసుపత్రిలో ఇతర రోగులు, వారి సహాయకులు, ఆసుపత్రి సిబ్బంది వంటి వారి మూలంగా కరోనా సోకే ముప్పు పొంచి ఉండొచ్ఛు అందువల్ల అత్యవసరమైతేనే లేదా చికిత్స తీసుకోవాల్సి ఉంటేనే ఆసుపత్రులకు రావాలి. మాస్కు వేసుకోవటం, చేతులు శుభ్రంగా కడుక్కోవటం, శానిటైజర్ రాసుకోవటం, ఇతరులకు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు విధిగా పాటించాలి.