వ్యాధులను నిరోధించటం, ఏవైనా జబ్బులు తలెత్తితే చికిత్స చేయటం.. ఆయుర్వేదం ఉద్దేశాలివే. వీటిల్లో చికిత్స కన్నా వ్యాధులు రాకుండా ఆరోగ్యాన్ని కాపాడటానికే అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. స్వస్థవృత్తంలో పేర్కొన్న నియమాలన్నీ వీటికి ఉద్దేశించినవే. నిద్రలేవటం దగ్గర్నుంచి దంత ధావనం, కాలకృత్యాలు, నూనె మర్దన, వ్యాయామం, స్నానం, ప్రవర్తన, సామరస్యత, శాంతియుత జీవనం వరకూ అన్నీ దీనిలోని భాగాలే. కాలానుగుణంగా ఆహార పద్ధతులు, జీవనశైలిని మార్చుకోవటాన్ని.. ముందు జాగ్రత్తలను ఇందులో విపులంగా వివరించింది. ఇవన్నీ శరీర రక్షణకు దోహదం చేసే వాత, పిత్త, కఫ దోషాలు.. రస, రక్త, మాంస, మేదో, అస్థి, మజ్జ, శుక్ర ధాతువులు.. జఠరాగ్ని వంటి త్రయోదశ అగ్నులన్నీ సమానంగా ఉండటానికి తోడ్పడేవే. మనసు, శరీరం, ఆత్మ.. మూడింటినీ ఆరోగ్యంతో, ఆనందంతో తొణికిసలాడేలా చేసేవే. దోషాలు, ధాతువులు, అగ్నులు, మల క్రియలన్నీ సమానంగా, సజావుగా సాగుతూ.. శరీరంతో పాటు మనసు, ఆత్మ ఆనందంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉన్నట్టు మరి. 'సమదోష సమాగ్నిశ్చ సమధాతు మలక్రియః। ప్రసన్నాత్మేంద్రియమనః స్వస్థ ఇత్యభిధీయతే।।' అని ప్రత్యేకంగా పేర్కొనటంలోని అంతరార్థం ఇదే.
అటు రసాయనం.. ఇటు వాజీకరణం
వ్యాధుల నిరోధానికి ఆహారం, జీవనశైలితో పాటు రసాయనం, వాజీకరణ చికిత్సలనూ ఆయుర్వేదం ప్రస్తావించింది. వ్యాధులు వస్తే తగ్గించటానికే కాదు, వ్యాధులు రాకుండానూ ఇవి కాపాడతాయి. రసాయన చికిత్స రోగనిరోధకశక్తిని పెంచుతుంది. మాలిన్యాలు ఎక్కువగా తయారవ్వకుండా చూడటం, ఒకవేళ ఎక్కువగా తయారైతే వాటిని తొలగించటం దీని ప్రత్యేకత. వాజీకరణం అనగానే చాలామంది లైంగికశక్తి వృద్ధికి తోడ్పడేదని భావిస్తుంటారు. నిజానికి వాజీకరణం అంటే బలాన్ని పెంచటం. ఇది రోగనిరోధకశక్తి ఇనుమడించటానికి, సవ్యంగా పనిచేయటానికి తోడ్పడుతుంది. మన చుట్టుపక్కల పరిసరాల్లో ఉండే కొన్ని మూలికలు సైతం రసాయన, వాజీకరణ ఔషధాలుగా ఉపయోగపడతాయి. మూలికలు అంటే వేళ్లే అని కాదు. మూలం నుంచి వచ్చిన ఆకులు, తీగలు కూడా మూలికలే. అలాంటి కొన్ని ఔషధాల గురించి తెలుసుకొని ఉండటం మంచిది. చాలావరకివి అందుబాటులో ఉండేవే. ఇప్పుడు మార్కెట్లోనూ తేలికగా లభ్యమవుతున్నాయి. అందుబాటును బట్టి ఏదో ఒక మూలిక వాడుకోవచ్చు. రెండు, మూడు కలిపి తీసుకోవాలనుకుంటే మోతాదు తగ్గించి మిశ్రమం చేసుకోవాలి. ఉదాహరణకు- చెంచా తీసుకోవాలనుకుంటే రెండు మందులను అర చెంచా చొప్పున వాడుకోవాలి.
అశ్వగంధ:
ఇది బలం పెరగటానికి తోడ్పడుతుంది. బలం పెరిగితేనే రోగనిరోధకశక్తి ఇనుమడిస్తుంది. బలం తగ్గటమంటే కణాలు క్షీణించటం, పాత కణాల స్థానంలో కొత్తవి పుట్టుకురాకపోవటం, దెబ్బతిన్న కణాలు సరిగా మరమ్మతు కాకపోవటం. అశ్వగంధ వీటన్నింటనీ సరిచేస్తుంది. ఇది రసాయనంగానే కాదు, వాజీకరణంగానూ పనిచేస్తుంది. తక్షణ బలాన్ని అందిస్తుంది. కణాలకు శక్తిని అందించేవి గ్లూకోజు, ప్రొటీన్లు. అశ్వగంధ కందమూలం కాబట్టి వెంటనే సత్తువను ఇవ్వటానికి అవసరమైన గ్లూకోజు ఇందులో సిద్ధంగా ఉంటుంది. ప్రొటీన్లు సైతం సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల అశ్వగంధ దెబ్బతిన్న కణాలు మరమ్మత్తు కావటానికి, కొత్త కణాలు పుట్టుకురావటానికి తోడ్పడుతుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే వ్యాధులు దరిజేరకుండా చూసుకోవచ్చు. ఇది కాస్త చేదుగా ఉంటుంది. అందువల్ల దీని చూర్ణాన్ని పాలతో తీసుకోవటం మంచిది. పాలు మరిగించి దించే ముందు అశ్వగంధ చూర్ణాన్ని వేసి కాసేపు అలాగే ఉంచాలి. తర్వాత చక్కెర లేదా మిస్రీ కలుపుకొని తాగాలి. ఇంకాస్త రుచిగా ఉండాలంటే యాలకుల పొడి కలుపుకోవచ్చు. దీన్ని పిల్లలు అరచెంచా, పెద్దవారు చెంచా మోతాదులో తీసుకోవచ్చు.
తిప్పతీగ (గుడూచి):
సంస్కృతంలో దీన్ని అమృత అనీ అంటారు. అంటే మరణం లేకుండా చేసేదని. ఇందులో ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయి. దీని ఔషధ గుణాలు చాలావరకు కాండం, ఆకుల్లో ఉంటాయి. శరీరంలో తయారయ్యే ధాతు మాలిన్యాలను (ఆక్సిడెంట్లను) తొలగించటం దీని ప్రత్యేక గుణం. అంటే సమర్థమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుందన్నమాట. ఇలా జబ్బులు దరిజేరకుండా కాపాడుతుంది. రోగనిరోధకశక్తిని పెంచుతుంది. విషమ జ్వరాలనూ తగిస్తుంది. తాజా తిప్ప తీగను ఆకులతో పాటు దంచి, రసం తీసి తాగొచ్చు. ఎండించి పొడి రూపంలోనూ తీసుకోవచ్చు. చెంచాడు చూర్ణాన్ని వేడినీటిలో కలిపి గానీ కషాయంగా కాచుకొని గానీ తాగొచ్చు. కాండం, ఆకుల రసమైతే పావు కప్పు నుంచి అర కప్పు వరకు తీసుకోవచ్చు.
త్రిఫలాలు:
ఉసిరికాయ, కరక్కాయ, తానికాయలను కలిపి త్రిఫలాలు అంటారు. ఇవి అన్ని దోషాలను హరిస్తాయి. ఉసిరికాయ రోగనిరోధకశక్తి పెరగటానికి.. కరక్కాయ, తానికాయ మాలిన్యాలు పోవటానికి ఉపయోగపడతాయి. ప్రత్యేకించి తానికాయ ఊపిరితిత్తులను మరింత బలోపేతం చేస్తుంది. వీటన్నింటితోనూ విటమిన్ సి లభిస్తుంది. ధాతు మాలిన్యాలను తొలగించటానికి, ప్రతి జబ్బుకు కారణమయ్యే వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్) అదుపులో ఉండటానికి, సూక్ష్మక్రిముల నిర్మూలనకు త్రిఫల చూర్ణం బాగా ఉపయోగపడుతుంది. దీన్ని చెంచా మోతాదులో గోరువెచ్చటి నీటిలో కలిపి గానీ తేనె లేదా నెయ్యితో గానీ తీసుకోవచ్చు.
కిరాత తిక్త (నేల వేము):
ఇది ప్రత్యేకించి కొన్నిరకాల ధాతు మాలిన్యాలను నిర్మూలిస్తుంది. పొదలుగా పెరిగే దీని ఆకులు వేపాకు మాదిరిగానే ఉంటాయి. క్వినలోన్లనే పదార్థాలు ఇందులో ఎక్కువ. ఇవి విషమ జ్వరాలను.. అన్నిరకాల వైరస్, బ్యాక్టీరియాతో తలెత్తే జ్వరాలను నయం చేస్తాయి. రాకుండానూ నివారిస్తాయి. దీని చూర్ణాన్ని మాత్రగా చేసుకొని తీసుకోవచ్చు. లేదా పొడిని వేడి నీటిలో కలిపి గానీ తాగొచ్చు. తాజా ఆకులైతే మెత్తగా దంచి ఉండగా చేసి తినొచ్చు.