వర్షాకాలంలో ఇమ్యూనిటీని పెంచే పదార్ధాలివే! - immunity boosting foods in rainy season
కాలం మారుతున్న కొద్దీ వివిధ రకాల ఇన్ఫెక్షన్లు మన శరీరంపై దాడి చేస్తుంటాయి. వాటిని సమర్థంగా ఎదుర్కోవాలంటే రోగనిరోధక వ్యవస్థను దృఢంగా ఉంచుకోవాలి. ఈ క్రమంలోనే ఆయా కాలాల్లో లభించే పండ్లు, కాయగూరలు తీసుకోవడంతో పాటు ఆహార నియమాల్లోనూ పలు మార్పులు-చేర్పులు చేసుకోవడం అవసరం అంటున్నారు ప్రముఖ సెలబ్రిటీ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్. ఆరోగ్యం, ఫిట్‌నెస్ వంటి విషయాల్లో అందరిలో అవగాహన నింపేందుకు తరచూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే రుజుత.. వర్షాకాలంలో తీసుకోవాల్సిన ఆహార నియమాలేంటో వివరిస్తూ ఇటీవలే మరో పోస్ట్ పెట్టారు. ఈ చిటపట చినుకుల కాలంలో ఏవి తినాలి? ఏవి తినకూడదు? ఫలితంగా ఆరోగ్యానికి చేకూరే ప్రయోజనాలేంటి? తదితర విషయాల గురించి వివరిస్తూ ఆమె పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.
వర్షాకాలంలో ఇమ్యూనిటీని పెంచే పదార్ధాలివే!
By
Published : Jul 20, 2020, 4:23 PM IST
ముంబయికి చెందిన ప్రముఖ సెలబ్రిటీ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్ బాలీవుడ్ ముద్దుగుమ్మలు కరీనా కపూర్ ఖాన్, అలియా భట్‌లకు డైట్ టిప్స్ సూచిస్తుంటారు. అలాగే హెల్దీ డైట్, ఫిట్‌నెస్ కోసం చేయాల్సిన వ్యాయామాలు, సీజనల్ ఫుడ్.. వంటి అంశాలపై సోషల్ మీడియాలో తరచూ వీడియోలు, ఫొటోలు పోస్ట్ చేస్తూ ఆరోగ్యం విషయంలో అందరినీ అలర్ట్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే వర్షాకాలంలో తీసుకోవాల్సిన ఆహార పదార్థాలేంటి? వాటి వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు చేకూరతాయి? తదితర విషయాల గురించి వివరిస్తూ ఇన్‌స్టాలో ఓ సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు రుజుత.
ఈ ఆహారంతో ఆరోగ్యంగా..!
స్వయంగా తానే పచ్చటి పొలంలో నాట్లేస్తున్న ఫొటోను ఇన్‌స్టాలో పంచుకున్న రుజుత.. వర్షాకాలంలో తీసుకోవాల్సిన నాలుగు ముఖ్యమైన ఆహార పదార్థాలేంటి? వాటిలో దాగున్న ఆరోగ్య రహస్యాలేంటో వివరిస్తూ ఇన్‌స్టాలో ఓ సుదీర్ఘమైన క్యాప్షన్ పెట్టారు.
రోగనిరోధక శక్తికి ఈ కాయగూరలు!
వర్షాకాలంలో తీసుకోవాల్సిన ఆహార పదార్థాల్లో కాయగూరల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కాలంలో ఆకుకూరలు పండించడానికి నేల అనువుగా ఉండదు. అందుకే వాటికి బదులుగా తీగ జాతికి చెందిన సొరకాయ, గుమ్మడి, కాకర, బీరకాయలతో పాటు క్యారట్, చిలగడదుంప, చేమదుంప.. వంటి దుంప జాతికి చెందిన కాయగూరల్ని ఆహారంగా తీసుకోవాలి. అలాగే గోంగూర, షెవ్లా (మహారాష్ట్ర అడవుల్లో కాచే కాయగూర), లింగ్డీ (హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన కాయగూర).. ఇలా ఆయా ప్రాంతాల్లో లభించే కూరగాయలతో ప్రత్యేకమైన వంటకాలు చేసుకొని తీసుకోవచ్చు. ఇవన్నీ జీర్ణాశయంలో మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేయడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచడానికి తోడ్పడతాయి.
గింజలు - చిరుధాన్యాలు!
వర్షాకాలంలో రాగులు ఎక్కువగా పండుతాయి. కాబట్టి రాగి జావ, రాగి రొట్టె, రాగులతో తయారుచేసుకునే అప్పడాలు కూడా ఆహారంలో భాగం చేసుకోవచ్చు. ఈ కాలంలో మల్టీగ్రెయిన్ బ్రెడ్, బిస్కట్లు.. వంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇక ఇప్పుడంతా పండగల సీజనే కాబట్టి ఇక పండగల సీజన్ రాబోతోంది కాబట్టి సామలు, రాగులు, కొర్రలు.. వంటి చిరుధాన్యాలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఈ క్రమంలో వీటితో ఆయా ప్రాంతాల్లో సంప్రదాయ వంటకాల్ని తయారుచేసుకొని పెరుగు, బటర్‌తో ఆరగించచ్చు. ఇక అన్నం, జొన్నలు, గోధుమలను ఏ సీజన్‌లోనైనా తీసుకోవచ్చు. మొక్కజొన్న కూడా లోకల్‌గా దొరికేవే తీసుకోవడం ఆరోగ్యానికి శ్రేయస్కరం.
పప్పుల్లో పోషకాలెన్నో!
సాధారణంగా మన దేశంలో చాలామంది వర్షాకాలంలో మాంసం, చేపలు తినడానికి ఇష్టపడరు. అందుకే ఎండాకాలంలోనే పప్పుల్ని ఎండబెట్టి జాగ్రత్తగా నిల్వ చేసుకుంటారు. ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉన్న ఈ పప్పు ధాన్యాలు వర్షాకాలంలో మన ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలన్నీ అందిస్తాయి. ఇక వీటిలోనూ మొలకెత్తినవి తీసుకుంటే మరీ మంచిది. పప్పులతో తయారుచేసుకునే వంటకాలు, పప్పులన్నీ కలిపి తయారుచేసే సబ్జీ, అప్పడాలు.. ఇలా ఎవరి ప్రాంతానికి తగినట్లుగా వారు సరికొత్త వంటకాలు తయారుచేసుకొని తీసుకోవచ్చు. ఇక ఈ సీజన్‌లో ఉలవలు, అలసందలు మరీ మంచివి. ఈ రెండు పప్పు ధాన్యాలు చర్మ ఆరోగ్యానికి, కేశ సంరక్షణకు చాలా ఉత్తమం.
వాడిన నూనె తిరిగి వాడద్దు!
ఆహారం విషయంలోనూ ఒక్కో కాలానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఈ క్రమంలో వేసవిలో మామిడి పండ్ల హవా కొనసాగితే.. వర్షాకాలంలో వేడివేడిగా బజ్జీలు తినాలనిపిస్తుంటుంది. అయితే ఈ క్రమంలో పల్లీ, ఆవ, కొబ్బరి.. నూనెలు వాడచ్చు. అలాగే ఒకసారి ఉపయోగించిన నూనెను మళ్లీ ఇతర పదార్థాల తయారీకి వాడకూడదు. మనం తీసుకునే ఆహారంలో విటమిన్ ‘డి’, అత్యవసర కొవ్వులుండేలా చూసుకోవాలి. ఎందుకంటే అత్యవసర కొవ్వులు రక్తంలో చక్కెర స్థాయుల్ని క్రమబద్ధీకరించడానికి తోడ్పడతాయి. ఈ కాలంలో వేడివేడిగా మనం ఆస్వాదించే పకోడీలు ఇంట్లోనే తయారు చేసుకొని తినడం ఆరోగ్యదాయకం. గుండె సంబంధిత సమస్యలున్న వారు, స్థూలకాయులు, మధుమేహంతో బాధపడే వారు.. ఎవరైనా సరే వీటిని నిస్సందేహంగా తినచ్చు.. అయితే అది కూడా మితిమీరకుండా చూసుకోండి.
సో.. ఇవండీ.. వర్షాకాలంలో మనం కచ్చితంగా తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు, పాటించాల్సిన ఆహార నియమాలు. మరి, మనమూ ఈ విషయాల్ని దృష్టిలో ఉంచుకొని ఈ పదార్థాలను మన రోజువారీ మెనూలో భాగం చేసుకుందాం.. ఆరోగ్యంగా ఉందాం..!