తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

గుండెపోటుకు ముందు వచ్చే సంకేతాలేంటో తెలుసా..? వాటిని ఎలా గుర్తించాలి

మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన గుండె కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఒకప్పుడు వయస్సు దాటిన వారిలో వచ్చే అనారోగ్య సమస్యలు నేడు మారుతున్న పరిస్థితుల కారణంగా యుక్త వయస్సులోనే అలుముకుంటున్నాయి. కొన్ని ముందస్తు సంకేతాలను గుర్తించినట్లయితే సమస్య తీవ్రతరం కాకుండా చూడవచ్చు. మరి ఏయే ముందస్తు సంకేతాలతో గుండె సమస్యలను గుర్తించవచ్చో.. వాటి నుంచి బయటపడే మార్గాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Identifying heart problems with signs and symptoms
గుండె సమస్యను గుర్తించండిలా

By

Published : Jan 23, 2023, 7:04 AM IST

గుండె సమస్యను గుర్తించండిలా

మనిషి శరీరంలో గుండెకు ఎంత ప్రాధాన్యం ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మన శరీరంలో ఉండే ప్రతి అవయవానికి రక్తాన్ని శుద్ధి చేసి సరఫరా చేసేది గుండె. అందుకే గుండెను జాగ్రత్తగా చూసుకోవడం ఆరోగ్యవంతుని లక్షణం. హర్ట్​స్ట్రోక్, హార్ట్ ఎటాక్​కు కారణాలు మనం పాటించే ఆహారపు అలవాట్లే. ఆ ఆహారపు అలవాట్లే మన శరీరంలోని ప్రతి వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. గుండె అనారోగ్యం పాలైతే దానిని తెలపడానికి గుండె ముందస్తుగా కొన్ని సంకేతాలను ఇస్తుంది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని చెప్పే సంకేతాలేమిటంటే..

గురక
గురకను చాలా సాధారణ విషయంగా పరిగణిస్తారు. చాలా సహజంగా వచ్చేదేగా అనుకుంటారు. కానీ గురక పెట్టినప్పుడు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది అనిపిస్తే దానిని గుండె సమస్యకు సంకేతంగా భావించాలి. ఆక్సిజన్ లెవల్స్ తగ్గినప్పుడు మెదడు రక్తనాళాల ద్వారా సంకేతాలను అందిస్తుంది. రక్తపోటు అధికమవుతుంది. దాంతో గుండె కొట్టుకునే రేటు అమాంతం పెరుగుతుంది. ఇలాంటప్పుడే గుండెపోటు రావడం జరుగుతుంది. లోపల గుండె సమస్య ఉందని బయట వ్యక్తిని చూసి చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు.

కళ్లు, చెవుల ద్వారా
కళ్లలో ఉండే నల్లగుడ్డు చుట్టూ ఒక తెల్లని పొర ఏర్పడుతుంది. దీనిని 'ఆర్కస్ సెనైలీస్' అంటారు. ఈ ఆర్కస్ సెనైలీస్​ అనేది చాలా మందిలో సాధారణంగా వయసు పైబడిన వారికి వస్తుంది. అది ముందుగానే అంటే చిన్నవయస్సులోనే వస్తే గుండె జబ్బుకు ఒక సంకేతంగా చెప్పవచ్చు. కొంతమందికి చెవి దగ్గర మడత ఏర్పడుతుంది. అటువంటిది ఉన్నవారికి కూడా గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు వైద్యులు.

జాంతలీస్​మాస్
జాంతలీస్​మా అంటే కంటి పైభాగంలో కాని కింది భాగంలో కొవ్వు ఉంటుంది. ఇలా ఉన్న వారికి కూడా గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

టెండిరస్ జాంతోమాస్
ఇది ఏంటంటే మోచేతిని మడిచినప్పుడు ఆ ప్రాంతంలో గుడ్లలగా ఉంటాయి. ఇవి ఉన్న వాళ్లలో కూడా గుండె సమస్యలు అధికంగా వస్తాయి.

చేతి గోళ్లు కూడా గుండె ఆరోగ్యాన్ని తెలియజేస్తాయి
గోళ్ల మీద నల్లని మచ్చలు కనిపిస్తే.. గుండె ప్రమాదంలో ఉందని అర్థం. దీనిని ఎండో కార్థరైటిస్ అంటారు. వెంటనే జాగ్రత్త పడాలి అనే హెచ్చరికగా భావించాలి. గుండె నుంచి మెదడుకు సరిపడా రక్తం సరఫరా కాకపోవడం వల్ల బలహీనంగా, అలసిపోయినట్లుగా అనిపిస్తుంది. ఇది కూడా గుండె చేటును తెలిపే సంకేతం.

లక్షణాలు
గుండె సమస్యలు ముఖ్యంగా తల నుంచి నడుము వరకు ఉండే భాగాలలో తెలుస్తోంది. గుండె ఎడమవైపు ఉంటుంది కాబట్టి ఎడమవైపు ఛాతిలో నొప్పి వస్తే గుండెనొప్పి అనుకుంటారు చాలామంది. కానీ అలానే కానక్కర్లేదు. అవి వేరే జబ్బు కూడా అవ్వొచ్చు. దవడలు, మెడలు, భుజాలు లాగడం కూడా గుండె సమస్యకు లక్షణాలుగా పరిగణించవచ్చు. కానీ ఇవన్నీ కచ్చితంగా గుండె సమస్యే అని చెప్పలేం. కడుపులో నొప్పి రావడం కూడా గుండె సమస్య అవ్వవచ్చు. కాబట్టి తల నుంచి నడుము వరకు వచ్చే ప్రతి నొప్పి గుండె సమస్యే కాదు. కానీ ఎక్కువ శాతం గుండె సమస్య అయ్యే అవకాశం ఉంది.

  • కాళ్లు, చేతులలో బలం సన్నగిల్లడం
  • ఎక్కువ బరువులు మోయలేకపోవడం
  • తొందరగా అలసి పోవడం
  • ఛాతి వెనక, ముందు భాగంలో, పొట్టలో నొప్పి రావడం
  • ఎప్పుడూ పొట్ట నిండుగా ఉండటం
  • ఆవలింతలు రావటం
  • అధికంగా గుండె కొట్టుకోవడం
  • కాళ్లలో వాపులు
  • శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది
  • ఉన్నపాటుగా పడిపోవడం లాంటివి గుండె సమస్యకు ఖచ్చితమైన లక్షణాలు. కొంత మందికి గుండె దడగా ఉంటుంది. మరికొంతమందికి ఇదేది ఉండకుండా ఉన్నపాటుగా పడిపోవడం లాంటి లక్షణాలు ఉంటాయి.

    గుండె సమస్య ఉందని చెప్పే సంకేతాలలో చిగుళ్ల నొప్పి ఒకటి. కొంతమందికి చిగుళ్లపై రక్తం ఉన్నట్లుగా అనిపిస్తుంది. చాలా మంది దానిని చిగుళ్ల సమస్యగా పరిగణిస్తుంటారు. కానీ ఇది గుండె సమస్య. శరీరంలో ఆక్సిజన్ స్థాయి తగ్గి గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఇలాంటి సమయాలలో గుండె పోటు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా గుండె సమస్యల లక్షణాలు.

అయితే ఇవన్నీ లక్షణాలు మీకు ఉన్నాయి అనిపిస్తే మీకు మీరుగా సమస్య ఉందని నిర్ణయానికి రావొద్దని వైద్యులు చెబుతున్నారు. అలాంటి లక్షణాలు మీరు గుర్తించినప్పుడు వైద్యుడ్ని సంప్రదించి నిర్ధరణకు రావాలి. కొంతమంది గూగుల్ చేస్తుంటారు. అక్కడ వచ్చిన సమాచారాన్ని చూస్తే ప్రతి సమస్య మనలో ఉన్నట్లే అనిపిస్తుంది. కాబట్టి ఏదైనా వైద్యుని సంప్రదించి నిర్ధరణకు వచ్చి చికిత్స తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

ఇవీ చదవండి:

వింటర్​ సూపర్​ ఫుడ్​.. మీ డైట్​లో తప్పక ఉండాల్సిన డ్రైఫ్రూట్స్ ఇవే

యాంటీబయాటిక్స్ అతిగా వాడుతున్నారా? అయితే ఇది మీ కోసమే..!

ABOUT THE AUTHOR

...view details