తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

డెలివరీ తర్వాత జుట్టు బాగా రాలుతోంది.. ఏం చేయాలి

హాయ్‌ మేడమ్‌.. నా వయసు 24 సంవత్సరాలు. నాకు ఆరు నెలల పాప ఉంది. ఇప్పటి వరకు నా చర్మ, జుట్టు సంరక్షణ గురించి నేను అస్సలు పట్టించుకోలేదు. అయితే గత నెల నుంచి నా జుట్టు బాగా రాలుతోంది. నా ముఖం కూడా నిర్జీవంగా మారిపోయింది. పెదవుల చివర నల్లగా మారింది. ఈ సౌందర్య సమస్యలన్నింటికీ చక్కటి పరిష్కారం చెప్పండి. - ఓ సోదరి

ఆరోగ్య సూత్రాలు
beauty tips

By

Published : Apr 20, 2021, 6:30 PM IST

జుట్టు సంరక్షణ కోసం:
గుడ్డు - ఒకటి
పెరుగు - ఒక కప్పు
నిమ్మరసం – రెండు టేబుల్‌స్పూన్లు
కొబ్బరినూనె - 4 టేబుల్‌ స్పూన్లు
ఈ నాలుగింటినీ ఒక బాటిల్‌లో వేసి షేక్‌ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్రొటీన్‌ మాస్క్‌ అంటారు. దీన్ని మొదట జుట్టు కుదుళ్లకు పట్టించాలి. ఆపై మిగిలిన మిశ్రమాన్ని జుట్టంతా అప్లై చేసుకోవచ్చు. ఇలా ప్యాక్‌ వేసుకున్న తర్వాత జుట్టుని ముడివేసుకుంటే మిశ్రమం కిందికి జారిపోకుండా ఉంటుంది. కనీసం 30 నిమిషాల పాటు మాస్క్‌ను అలాగే ఉంచుకోవాలి. ఆపై మొదట సాధారణ నీటితో శుభ్రం చేసుకొని.. ఆ తర్వాత షాంపూతో తల రుద్దుకోవాలి. ఈ విధంగా కనీసం వారానికి మూడు సార్లు చేస్తే రెండు, మూడు నెలల్లో చక్కటి ఫలితం కనిపిస్తుంది. దీనితో పాటు ఐరన్‌ ఎక్కువగా ఉండే తోటకూర, బీట్‌రూట్‌, క్యారట్‌, బెల్లం.. వంటివన్నీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మరింత మెరుగైన ఫలితం పొందచ్చు. ఈ ప్యాక్‌ వేసుకునే క్రమంలో కొంతమందికి ఇలాంటి సందేహాలు రావచ్చు..

గుడ్డుని ఉపయోగించడం వల్ల వాసన వస్తుంది?

ఈ ప్యాక్‌లో నిమ్మరసం కూడా ఉపయోగిస్తున్నాం కాబట్టి ఆ సమస్య ఉండదు.

నిమ్మరసం వల్ల జుట్టు తెల్లబడుతుంది?

అయితే ఇక్కడ మనం నిమ్మరసం నేరుగా తీసుకోవడం లేదు. మిశ్రమంలో భాగంగా తీసుకుంటున్నాం. కాబట్టి ఆ సమస్య ఉండదు.


మోము సౌందర్యం కోసం...
ఓట్స్‌ పౌడర్‌ - ఒక టేబుల్‌ స్పూన్‌
బార్లీ పౌడర్‌ - ఒక టేబుల్‌ స్పూన్‌
కాచి చల్లార్చిన పాలు - నాలుగు టేబుల్‌ స్పూన్లు

మొదట ఈ మూడింటినీ బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. ఈ ప్యాక్‌ని మెడపై కూడా అప్లై చేయచ్చు. ప్యాక్‌ పెట్టుకున్న తర్వాత 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆపై చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు నుంచి మూడు సార్లు చేయాలి. అలాగే దీనితో పాటు రోజుకు 8 నుంచి 12 గ్లాసుల నీళ్లు తాగాలి.


అందమైన అధరాలు ఇలా!

మొదట నాలుగు గులాబీ రేకల్ని తీసుకొని మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ తర్వాత దానికి అంతే మొత్తంలో కాచి చల్లార్చిన పాలను జతచేయండి. ఈ మిశ్రమాన్ని పెదవులపై ఎక్కడ నల్లగా ఉందో అక్కడ రాయాలి. అలా 20 నిమిషాల పాటు ఉంచుకొని ఆపై చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి 5 సార్లు చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది.

ఇదీ చూడండి:వేపతో సౌందర్య చిట్కాలు.. ఇవి చాలా ఈజీ

ABOUT THE AUTHOR

...view details