sex tips for couples: భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని దృఢం చేసే అంశాల్లో శృంగారానిది కీలక పాత్ర. కానీ వివిధ కారణాల రీత్యా చాలా జంటలు దీనిపై ఆసక్తి చూపరు. ఒకే గదిలో కలిసి పడుకుంటున్నప్పటికీ నెలల తరబడి.. ఎడమొహం, పెడమొహంగానే వ్యవహరిస్తారు. ఇలాంటి అనుబంధాన్నే 'డెడ్ బెడ్‌రూమ్ రిలేషన్‌షిప్'గా పిలుస్తారు. అయితే ఇందుకు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా వివిధ అంశాలు కారణమవుతున్నాయని చెబుతున్నారు నిపుణులు.
ఇందుకే 'కోరికలు' కొండెక్కుతున్నాయట!
- దంపతుల్లో ఒకరికి శృంగారంపై ఆసక్తి ఉన్నా.. మరొకరు అయిష్టత చూపడం, సిగ్గుపడడం.. వంటి కారణాల వల్ల చాలామంది దంపతులు దూరంగా ఉండాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో అవతలి వారు చిన్న బుచ్చుకునే ప్రమాదం ఉంటుంది.
- గది వాతావరణానికి సర్దుకోకపోవడం వల్ల కూడా భార్యాభర్తలు దూరంగా ఉండాల్సి వస్తుందట. అంటే.. ఒకరు ఏసీ కావాలని, మరొకరు వద్దని.. ఒకరు వెలుతురు ఉండాలని, మరొకరు చీకటిని కోరుకోవడం.. ఇలాంటి వాగ్వాదాల మధ్య మానసిక ప్రశాంతత కొరవడుతుంది. ఇది కూడా శృంగార జీవితాన్ని దెబ్బతీస్తుంది.
- ఉమ్మడి కుటుంబాల్లో ఉండే వారిలో చాలామంది తరచూ శృంగార జీవితాన్ని ఆస్వాదించలేకపోతున్నట్లు తమ వద్దకొచ్చే కేసుల్ని బట్టి నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఇతర కుటుంబ సభ్యులు ఏమనుకుంటారోనని జంటలు అసౌకర్యానికి గురవడం, సిగ్గు, బిడియం.. వంటివి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.
- కొంతమంది భార్యాభర్తలు వృత్తిరీత్యా వేర్వేరు ప్రాంతాల్లో ఉండాల్సి రావచ్చు. ఈ దూరం కూడా దాంపత్య బంధంలో చిచ్చు పెట్టచ్చంటున్నారు నిపుణులు.
- మహిళల్లో చాలామందికి పిల్లలు పుట్టాక లైంగిక కోరికలు తగ్గుతున్నట్లు కొన్ని అధ్యయనాల్లో రుజువైంది. ఇందుకు పిల్లల బాధ్యతల వల్ల తీరిక లేని షెడ్యూల్, శరీరంలో హార్మోన్ల మార్పులు, ప్రసవానంతరం ఆలస్యంగా కోలుకోవడం.. వంటివి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు.
- కెరీర్‌పై పెట్టే శ్రద్ధ దాంపత్య జీవితంపై పెట్టకపోవడం మరో కారణంగా చెబుతున్నారు నిపుణులు. ఈ క్రమంలో వృత్తిరీత్యా విపరీతమైన అలసట, ఒత్తిడి వల్ల చాలామందిలో లైంగికాసక్తి తగ్గుతున్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది.
- కొంతమంది లైంగిక వ్యాధులకు భయపడి.. మరికొందరు థైరాయిడ్, మధుమేహం, నరాల సమస్యలు, క్యాన్సర్.. వంటి దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతూ శృంగార జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారట!
- ఒత్తిడి, ఆందోళనల్ని తగ్గించే మందులు, గర్భనిరోధక మాత్రలు.. వంటివి లైంగికాసక్తిని దెబ్బతీస్తాయి. ఇది కూడా డెడ్ బెడ్‌రూమ్ రిలేషన్‌షిప్‌కి దారితీస్తుంది.
- కొన్ని జంటలు కుటుంబ ఒత్తిళ్ల వల్ల సంతానం కోసం బలవంతంగా కాపురం చేస్తున్నాయని.. ఇక పిల్లలు పుట్టాకా ఆరోగ్యకరమైన దాంపత్య జీవితాన్ని గడపట్లేదని తమ వద్దకొచ్చిన కొన్ని కేసుల గురించి చెబుతున్నారు నిపుణులు. దీనినీ ఓ తరహా ‘డెడ్ బెడ్‌రూమ్ రిలేషన్‌షిప్’గా పరిగణిస్తున్నారు.