తల్లిపాలే బిడ్డలకు అమృతం. ఆరోగ్యాన్ని ప్రసాదించే ప్రకృతి అద్భుతం. తొలిసారి చనుబాలు పట్టించే సమయంలో ఆ తల్లీబిడ్డలు పొందే మధురానుభూతిలో.. జీవితకాలపు ఆరోగ్యం ఇమిడి ఉంటుంది. అందుకే వైద్యులు శిశువు జన్మించిన అరగంటలోగా తల్లి ముర్రుపాలు పట్టించమంటారు. కానీ, అందరు తల్లులకూ ఆ అదృష్టం ఉండకపోవచ్చు. కొందరిలో చనుబాల ఉత్పత్తి తక్కువగా ఉండొచ్చు. మరికొందరు అనారోగ్యాల వల్ల పాలు పట్టించలేకపోవచ్చు. మరి అలాంటి, అత్యవసర సమయాల్లో బ్లడ్ బ్యాంకుల్లాగే పనిచేసే స్వచ్ఛమైన చనుబాల బ్యాంకులున్నాయని మీకు తెలుసా ?
తల్లిపాల వారోత్సవాల సందర్భంగా చనుబాల బ్యాంకుల గురించి... ప్రముఖ గైనకాలజిస్ట్, ప్రసూతి నిపుణులు డాక్టర్ రాజశ్రీ కట్కేతో ఈటీవీ భారత్ మాటామంతి.....
చనుబాల బ్యాంక్ అంటే..?
ఆరోగ్యకరమైన తల్లలు దానం చేసే స్తన పాలను శాస్త్రీయ పద్ధతిలో భద్రపరిచి, అవసరమైన శిశువులకు పంపిణీ చేసే చోటే తల్లిపాల బ్యాంక్. తల్లిపాలు పట్టించే వీలు లేని పిల్లలకు ఇలాంటి పాలు పట్టించడం.. వారి ఆరోగ్యకరమైన పెరుగుదలకు ఉపయోగపడుతాయి.
పాలదానం ఎవరు చేయొచ్చు?
పాలిచ్చే తల్లులు ఎవరికైతే హెచ్ఐవీ, హెపటైటిస్ బి, సిఫిలిస్ వంటి ప్రమాదకర వ్యాధులు లేవని తేలుతాయో వారు పాలదానం చేయొచ్చు.
తల్లిపాలు దానం చేసే తల్లుల రక్తంలో కనీసం 10 గ్రాముల హిమోగ్లోబిన్ కలిగి ఉండాలి. అంతే కాదు, ఆరోగ్య సమస్యలేవీ లేవని ధ్రువీకరించాకే పాలదానం చేసే అవకాశముంటుంది.
చనుబాల బ్యాంకుతో లాభమేంటి?
- పుట్టగానే తల్లిని కోల్పోయిన పిల్లలు, కావాలనే తల్లి వదిలేసిన శిశువులకు ఆహార కొరత లేకుండా చేస్తాయి ఈ తల్లిపాల బ్యాంకులు.
- బిడ్డకు జన్మనిచ్చాక, తల్లి అనారోగ్యంతో బాధపడుతూ పాలు పట్టించలేని స్థితిలో ఈ బ్యాంకులు అత్యుత్తమ సేవలందిస్తాయి.
- తల్లిలో పాల ఉత్పత్తి తగు మోతాదులో లేనప్పుడు.
- పిల్లలు పుట్టగానే దత్తత తీసుకున్న సమయంలో ఈ బ్యాంకులు బిడ్డ ఆకలిని తీర్చగలవు.