hair fall control: నడి వయసు రాలేదు.. అప్పుడే తలపై జుట్టు పలచపడిపోతోంది. ఎందుకో తెలుసా.. జీవన శైలిలో మార్పు, ఆహార అసమతుల్యం, మానసిక ఒత్తిడి జుట్టు రాలిపోయేలా చేస్తున్నాయి. పాతికేళ్లకే బట్టతల వచ్చేస్తోంది. వృద్ధాప్య ఛాయలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితితో చదువుపై శ్రద్ధ లేకపోవడం, పెళ్లికి అమ్మాయి ఇష్టపడకపోవడంతో మానసికంగా కుంగిపోతున్న యువత ఎక్కువ మందే కనిపిస్తుంటారు. ఈ పరిస్థితి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? బట్టతల వస్తే ఎలా..? లాంటి ప్రశ్నలకు నిపుణులు ఏం చెబుతున్నారంటే...
శిరోజాలు ఎందుకు ఊడుతున్నాయి..
సాధారణంగా పురుషులకు లక్ష, మహిళలకు లక్షన్నర శిరోజాలుంటాయి. జుట్టు పెరిగే దశ, విశ్రాంతి దశ, రాలిపోయే దశలంటూ ఉంటాయి. రోజూ వంద వెంట్రుకల దాకా రాలిపోతాయి. ఇలా వెంట్రుకలు రాలిపోకుండా ఉంటే వాటిని పెంచడం కష్టంగా ఉంటుంది. వాటి పోషణ కూడా చేయలేం. తల దువ్వినా, స్నానం చేసినా, పడుకున్నా ఊడిపోతే సమస్యగా చెప్పవచ్చు. అప్పుడే వైద్యులను కలుసుకోవాలి.