How To Stop Child Phone Addiction :ప్రస్తుత రోజుల్లో పిల్లలకు ఫోన్ ఓ వ్యసనంగా మారిపోయింది. దీనికి తోడు పిల్లలు ఏదైనా అల్లరి చేస్తే వారి నోరు మూయించాలని తల్లిదండ్రులే వారికి ఫోన్లు అందిస్తున్నారు. దీంతో పిల్లలు ఫోన్లకు బానిసలుగా మారిపోతున్నారు. తీరా వ్యసనంగా మారిన తర్వాత వాళ్లు ఫోన్ వదిలేలా చేయడానికి తల్లిదండ్రులు నానా అవస్థలు పడుతుంటారు. అందుకే పిల్లలను ఫోన్ల నుంచి ఎలా దూరం చేయాలన్న విషయంపై నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా మీరు ఫోన్‌కు దూరంగా ఉండాలి!
సాధారణంగా పెద్దలు చేసే పనులను పిల్లలు అనుకరిస్తుంటారు. కనుక ముందుగా మీరు ఫోన్‌కు దూరంగా ఉండాలి. పిల్లల ముందు అతిగా ఫోన్ వాడడం, టీవీలు చూడటం మానుకోవాలి. పిల్లలతో ఎక్కువ సేపు గడపాలి. ఆడడం, మాట్లాడటం, కథలు చెప్పడం లాంటి చేయాలి. దీంతో వారికి, మీకు మంచి అనుబంధం ఏర్పడుతుంది. ఇంట్లో సానుకూల వాతావరణం ఉంటుంది.
టైమ్ లిమిట్ పెట్టాలి
గాడ్జెట్‌లను పూర్తిగా దూరంగా ఉంచడం సాధ్యం కాదు. అందువల్ల మరో మార్గాన్ని కనుగొనడం అవసరం. పిల్లలకు గాడ్జెట్‌లను అందించడానికి లేదా స్మార్ట్ టీవీని చూడడానికి సమయాన్ని నిర్ణయించండి. వాటిని ఏ సమయం నుంచి ఏ సమయం వరకు చూడాలో కచ్చితంగా నిర్దేశించండి. కావాలంటే అలారమ్ పెట్టండి.
పిల్లల శారీరక శ్రమపై దృష్టి పెట్టాలి
పిల్లలను ఆరుబయట ఆడుకునేందుకు ప్రోత్సహించాలి. ఆటలపై ఎంత ఏకాగ్రత పెడితే, మొబైల్‌పై అంత ఏకాగ్రత తగ్గుతుంది. ఆడుకోవడం వల్ల పిల్లల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ప్లేగ్రౌండ్స్కు, పార్కులకు తీసుకెళ్లి ఆడించడం, స్విమ్మింగ్, రన్నింగ్, జాగింగ్ లాంటివి పిల్లలకు అలవాటు చేయడం మంచిది.