How To Reduce Waist Size : ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో ఉన్న సమస్య ఊబకాయం. మరీ ముఖ్యంగా నడుము చుట్టూ కొలత పెరిగిపోవడం. ఈ నడుము చుట్టు కొలత పెరగడానికి ముఖ్య కారణం.. అధికంగా కొవ్వు పేరుకుపోవడమే. ఈ కొవ్వు వల్ల గుండె సంబంధింత వ్యాధులు, మధుమేహం లాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే ఈ సమస్యను అధిగమించాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు వైద్య నిపుణులు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మన నడుము చుట్టుకొలత మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నడుము, తుంటి భాగాల నిష్పత్తిని అనుసరించి.. ఆయా భాగాల్లో పేరుకున్న కొవ్వు స్థాయిని అర్థం చేసుకునే అవకాశం ఉంది. సాధారణంగా మన శరీర బరువు, ఎత్తు ఆధారంగా బాడీ మాస్ ఇండెక్స్‌ను లెక్కకడుతుంటారు. ఇది ఎక్కువ స్థాయిలో ఉంటే శరీరంలో కొవ్వు స్థాయి అధికంగా ఉన్నట్లు భావిస్తారు.
వెయిస్ట్ టు హిప్ రేషియోను లెక్కగట్టినప్పుడు నడుము, తుంటి, పిరుదుల భాగంలో పేరుకున్న కొవ్వును అంచనా వేసే అవకాశం ఉంటుంది. మన శరీరంలో ఒక్కో భాగంలోని కొవ్వు ఒక్కో రకమైన అనారోగ్యాలను కలిగించే ప్రమాదం ఉంటుంది. కనుక నడుము, తుంటి భాగాల్లో ఎంత మేరకు కొవ్వు చేరిందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. శరీరం మధ్య భాగంలో అంటే నడుము చుట్టూ అధికంగా కొవ్వు ఉండి యాపిల్ ఆకారంలో ఉండే వ్యక్తుల్లో గుండె వ్యాధులు, టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
డయాబెటిస్ రిస్క్ ఎక్కువే
'ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్న వ్యాధుల్లో మెటబాలిక్ సిండ్రోమ్ ఒకటి. ఇది బరువు, నడుము చుట్టుకొలత మీద ఆధారపడుతుంది. నడుము చుట్టుకొలత ఎక్కువగా ఉంటే తీవ్ర అనారోగ్యాల బారిన పడే ఛాన్స్ ఉంది. వీళ్లకు డయాబెటిస్ ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది. స్త్రీలలో నడుము చుట్టుకొలత అధికంగా ఉంటే పీసీఓడీ సమస్య రావొచ్చు. నడుము చుట్టుకొలత ఎక్కువగా ఉండేవారిలో ట్రైగ్లిజరైడ్ అధికంగా ఉండే అవకాశం ఉంది. వీటన్నింటితో పాటు గుండె సంబంధిత సమస్యల బారిన పడే ప్రమాదమూ అధికమే' అని ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ కేఎస్ సోమశేఖరరావు తెలిపారు.
వెయిస్ట్ టు హిప్ రేషియో ఆడవారికి 0.80 లేదా అంతకంటే తక్కువగా, మగవారికి 0.95 లేదా అంతకంటే తక్కువగా ఉంటే ఆరోగ్యపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం లేదని నిపుణులు అంటున్నారు. ఈ నిష్పత్తి ఆడవారికి 0.81 నుంచి 0.85లోపు, మగవారికి 0.96 నుంచి 1.0 వరకు ఉంటే ఆరోగ్య పరిస్థితి కాస్త మధ్యస్థంగా ఉందని అర్థం. ఈ నిష్పత్తి ఆడవారికి 0.86 అంతకంటే ఎక్కువగా ఉన్నా.. మగవారికి 1.0 లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నా ఆరోగ్యానికి హాని కలిగే ప్రమాదం అధికంగా ఉందని అర్థం.