తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

రాత్రిళ్లు ఫోన్ వాడకాన్ని తగ్గించే 7 చిట్కాలు.. ఇలా చేస్తే హాయిగా నిద్రపోవచ్చు! - రాత్రి పూట ఫోన్​ వాడకం తగ్గించడం ఎలా

ఈ రోజుల్లో ఫోన్​ వినియోగం ఎంతగా పెరిగిందో అందరికీ తెలిసిన విషయమే. చిన్నా,పెద్దా అనే తేడాల్లేకుండా ఎవరి చేతుల్లో చూసినా ఫోన్లే కనిపిస్తాయి. పిల్లవాడి నుంచి బామ్మల వరకు అందరూ ఫోన్లకు అలవాటు పడిపోయారు. కొందరికైతే ఫోన్ ఓ వ్యసనంలా మారిపోయింది. సామాజిక మాధ్యమాల ప్రవేశంతో ఫోన్ వాడకం మరీ ఎక్కువైపోయింది. యువతతో పాటు మధ్య వయస్కులు, వృద్ధులు కూడా కాస్త సమయం దొరికితే ఫోన్​కే అతుక్కుపోతున్నారు. దీనిని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

cell phone using in night
cell phone using in night

By

Published : Mar 29, 2023, 3:44 PM IST

చాలా మంది గంటల కొద్దీ సమయాన్ని ఫోన్​లోనే గడిపేస్తున్నారు. ఇలాంటి జీవన శైలి వల్ల కొత్త కొత్త జబ్బుల బారిన పడుతున్నారు. ఫోన్​ను అతిగా వాడటం వల్ల వస్తున్న సమస్యల్లో నిద్రలేమి ప్రధానం. అర్ధరాత్రి వరకు ఫోన్​నే చూస్తూ కూర్చుంటే నిద్ర ఎలా పడుతుంది చెప్పండి! కాబట్టి సాధ్యమైనంతగా మొబైల్ వాడకాన్ని తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా నిద్రపోయే ముందు ఫోన్ చూడటం ఆపేయాలని అంటున్నారు. దీనికి వారు ఇస్తున్న సూచనలు ఏంటో తెలుసుకుందాం..

బెడ్​పై ఫోన్ వద్దు
నిద్రపోయే ముందు ఫోన్​ను చూడటం మంచి అలవాటు కాదని వైద్యులు అంటున్నారు. నిద్ర పట్టేందుకు సహకరించే మెలటోనిన్ ఉత్పత్తిని ఫోన్​ తగ్గిస్తుందట. రాత్రిపూట ఫోన్​ వాడితే అందులోని బ్లూ లైట్ మన శరీరంలోని మెలటోనిన్ ఉత్పత్తిని క్రమంగా తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల సరిగ్గా నిద్రపట్టదట. అలాగే అంతర్జాలంలో అనంతమైన కంటెంట్ అందుబాటులో ఉన్నందున ఒక్కసారి ఫోన్​ పట్టుకుంటే.. అంత సులువుగా దాన్ని పక్కనపెట్టలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి బెడ్ మీదకు వచ్చాక ఫోన్​ను పక్కనపెట్టేయడం అలవాటు చేసుకోండి. అలాగే ఛార్జర్లను కూడా వేరే గదిలో పెట్టడం మంచిది.

బెడ్ టైం మోడ్​ను సెట్ చేసుకోండి
నిద్రను మెరుగుపర్చుకోవాలంటే రోజూ ఒకే సమయానికి పడుకోవడం అలవాటు చేసుకోవాలి. రోజూ ఒకే సమయానికి నిద్రపోయి.. ఒకే సమయానికి మేల్కోవడం అలవాటు చేసుకుంటే తక్కువ వ్యవధిలో మంచి ఫలితాలు వస్తాయి. వారాంతంలో కూడా దీన్ని పక్కాగా పాటించాలి. ఏ పని లేదు కదా అని శని, ఆదివారాల్లో ఆలస్యంగా నిద్రపోవడం లాంటివి చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. అందుకోసం ఫోన్లో స్లీప్ ఫోకస్​ను సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఐఫోన్లలో స్లీప్ ఫోకస్​ను సెట్ చేసుకోవాలి. అదే ఆండ్రాయిడ్ యూజర్లు అయితే బెడ్ టైం మోడ్​ను యాక్టివేట్ చేసుకుంటే సరిపోతుంది.

డార్క్ మోడ్​ను యాక్టివేట్ చేసుకోండి
రాత్రిపూట ఫోన్ వాడటం వల్ల కళ్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. కాబట్టి రాత్రిళ్లు ఫోన్​లోని బ్లూ లైట్ ఫిల్టర్​ను ఆన్ చేసుకోవాలి. అదే ఐఫోన్ వాడేవారైతే నైట్ షిఫ్ట్​ను యాక్టివేట్ చేసుకోవాలి.

స్లీప్ యాప్స్​ను వాడండి
రోజూ ఎన్ని గంటలు నిద్రపోతున్నారో తెలుసుకునేందకు స్లీప్ యాప్స్​ను వాడండి. అందుకోసం థర్డ్ పార్టీ యాప్స్​ల మీద ఆధారపడకుండా అందుబాటులో ఉన్న మెరుగైన యాప్లను ఇన్​స్టాల్ చేసుకుంటే మంచిది. ఇన్సైట్ టైమర్ లాంటి యాప్​ను ఇన్​స్టాల్ చేసుకుంటే శ్రావ్యమైన సంగీతాన్ని వింటూ హాయిగా నిద్రపోవచ్చు. కథలు వింటూ నిద్రపోవాలని ఉంటే.. అయితే బెడ్ టైం టేల్స్ అనే యాప్​ను డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంట్లో బామ్మలాగే ఎన్నో కథలను చెబుతూ మనల్ని నిద్రపోయేలా చేస్తుందీ యాప్.

ఈ-మెయిల్స్ చెక్ చేయొద్దు
రాత్రిళ్లు నిద్రపోయే ముందు ఫోన్​లో ఈ-మెయిల్స్ చెక్ చేసుకోవడం లాంటివి చేయొద్దని నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల తర్వాతి రోజు ఆఫీసులో చేయబోయే పనుల గురించి ఆలోచిస్తూ ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. అందుకు ఓ పరిష్కారాన్ని సూచిస్తున్నారు. బెడ్ పైకి రావడానికి ముందే ఆఫీసు పనులను పూర్తి చేయాలని చెబుతున్నారు.

పుస్తకాలు చదవడం అలవాటు చేస్కోండి
కొంతమంది రాత్రిళ్లు ఫోన్​ను కాసేపు చూస్తే కానీ నిద్ర పట్టదని అంటుంటారు. దీని బదులు కొత్త అలవాట్లను చేసుకుంటే ఉత్తమమని నిపుణులు అంటున్నారు. నిద్రపోయే ముందు పుస్తకాలు చదవడం లేదా రాయడం అలవర్చుకోవాలి. అలాగే ధ్యానం కూడా సాధన చేస్తూ ఉండాలి. దీని వల్ల రాత్రిపూట త్వరగా నిద్రపట్టడమే కాకుండా ఉదయం సరికొత్త శక్తితో నిద్ర లేస్తామని నిపుణులు చెబుతున్నారు.

అలారం వాడొచ్చు
నిద్రను మెరుగుపరుచుకోవడానికి సంబంధించి అలారం క్లాక్​ వాడితే మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. రాత్రిపూట నిద్రపోయే ముందు, ఉదయం లేచే సమయం ఇలా ప్రతిదీ అలారంలో సెట్ చేసుకుంటే సరిపోతుంది. అదే మిమ్మల్ని సరైన సమయానికి నిద్రపోయేలా చేస్తుంది, అలాగే మేల్కొనేలా చేస్తుందని నిపుణుల సూచిస్తున్నారు.

ఇవీ చదవండి :గురక పెడుతున్నారా? ఇలా చేస్తే ఉపశమనం!

సడెన్​గా మైకం కమ్మినట్లు అనిపిస్తుందా..? దేనికి సంకేతమో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details