మన శరీరమంతటికీ నాడీ వ్యవస్థ ద్వారా సమాచారం అందుతుంది. శరీరంలో లోపలే కాదు, బయటా ఏం జరుగుతుందో కూడా తెలియజేస్తుంది. ఎవరినైనా కౌగిలించుకుంటే ఒత్తిడి తగలటం, మంచు కురుస్తున్నప్పుడు బయట నిల్చుంటే చలిగా అనిపించటం వంటివన్నీ దీని మూలంగానే. నొప్పి తెలియటానికీ కారణం ఇదే. అయితే అందరిలో నొప్పి ఒకేలా ఉండదు. కొందరికి వెన్న జలదరించినట్టుగా అనిపించిన నొప్పే కొందరికి మంట పుట్టినట్టుగానూ ఉండొచ్చు. నాడీ వ్యవస్థ స్పందించటం, దాన్ని మెదడు గుర్తించటం మీద ఇది ఆధారపడి ఉంటుంది. కాబట్టి వీపులో మంటగా అనిపిస్తే ఏదో సమస్య ఉందనే అర్థం. దీనికి రకరకాల కారణాలు ఉండొచ్చు. ముందు నొప్పి ఉన్న చోట దద్దు, చర్మం రంగు మారటం వంటివేవైనా ఉన్నాయా? జ్వరం, దగ్గు, ఇతర శరీర నొప్పులు ఉన్నాయేమో కూడా పరిశీలించుకోవాలి.
- దద్దుతో.. ముఖ్యంగా ఒక వరుసలో పొక్కులతో పాటు మంటతో కూడిన నొప్పి ఉన్నట్టయితే చల్ది/సర్పి కావొచ్చు. ఆటలమ్మ (చికెన్‌పాక్స్) వచ్చి ఉన్నవారిలో ఇది తలెత్తుతుంది. ఆటలమ్మ మచ్చలు పోయినప్పటికీ వైరస్ ఒంట్లో అలాగే ఉంటుంది. ఇది చల్ది రూపంలో బయట పడుతుంది. తీవ్రమైన నొప్పి, మంట తలెత్తుతాయి. దీనికి వెంటనే చికిత్స తీసుకోవాలి. లేకపోతే దీర్ఘకాల సమస్యగా మారొచ్చు. ఇదీ మంటతో కూడిన నొప్పిని కలగజేయొచ్చు.
- వెన్ను పూసల మధ్యలో ఉండే డిస్కులు క్షీణించి, పక్కలకు జరిగినప్పుడు మొద్దుబారటం, నొప్పి, మంట వంటి లక్షణాలు కనిపించొచ్చు.
- కొన్నిసార్లు ఉన్నట్టుండి వీపు కండరాలు పట్టేస్తుంటాయి. ఇది తీవ్రమైన నొప్పికి దారితీస్తుంది. కొందరికి దీంతోనూ మంటతో నొప్పి రావొచ్చు.
- కాళ్లు, చేయి కీళ్లలోనే కాదు.. వెన్నెముక కీళ్లలోనూ వాపు (ఆర్థ్రయిటిస్) రావొచ్చు. కీళ్లు ఒరుసుకుపోకుండా చూసే మృదులాస్థి అరిగిపోవటం దీనికి మూలం. ఊబకాయం, అధిక బరువు, 55 ఏళ్లు పైబడినవారికి దీని ముప్పు ఎక్కువ. వెన్నెముక కీళ్ల అరుగుదలతో నాడులు నొక్కుకుపోయి మంటతో కూడిన నొప్పి వచ్చే అవకాశముంది.
- అరుదైన అరక్నాయిడైటిస్ అనే నాడీ సమస్యలోనూ లోపలేదో పొడుస్తున్నట్టు, మండుతున్నట్టు తీవ్రమైన నొప్పి పుడుతుంది. ఇందులో వెన్నెముకను కాపాడే కణజాలానికి సాలెగూడు ఆకారంలో మచ్చ పడుతుంది. వెన్నెముక కణజాలానికి చుట్టుపక్కల ఉండే నాడులు వాపునకు గురవటం దీనికి మూలం. వెన్నెముక శస్త్రచికిత్స, వెన్నెముకకు దెబ్బలు తగలటం, నాడులు దీర్ఘకాలంగా నొక్కుకుపోవటం వంటివి దీనికి దారితీస్తాయి. వైరస్, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు సైతం దీనికి కారణం కావొచ్చు. దీంతో కొందరిలో మొద్దుబారటం, మండుతున్నట్టు అనిపించటం వంటివి తలెత్తుతాయి.