తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

ఈ లక్షణాలు మీలో ఉన్నాయా..? అయితే థైరాయిడ్​ ఉన్నట్టే..! - థైరాయిడ్‌ హార్మోన్‌

వృద్ధుల్లో థైరాయిడ్‌ హార్మోన్‌ మోతాదులు తగ్గటం (హైపోథైరాయిడిజమ్‌) తరచూ చూసేదే. ఇది వయసుతో పాటు నెమ్మదిగా ఎక్కువవుతుంది కూడా. కానీ చాలామందికి హైపోథైరాయిడిజమ్‌ ఉన్నట్టయినా తెలియదు. లక్షణాలు స్పష్టంగా లేకపోవటం, ఇతరత్రా జబ్బుల లక్షణాల మాదిరిగా కనిపించటమే దీనికి కారణం. మరి థైరాయిడ్​ను ఎలా గుర్తించాలంటే...

how to recognize thyroid hormone imbalance in body
how to recognize thyroid hormone imbalance in body

By

Published : May 25, 2021, 12:49 PM IST

థైరాయిడ్‌ హార్మోన్‌ తగినంతగా లేకపోతే అవయవాల పనితీరు నెమ్మదిస్తుంది. జ్ఞాపకశక్తి తగ్గిపోవచ్చు. విషయ గ్రహణ సామర్థ్యం తగ్గొచ్చు. బరువు పెరగటం, మగత, చర్మం పొడిబారటం, మలబద్ధకం వంటివీ తలెత్తొచ్చు. వీటిని చాలావరకు వృద్ధాప్య మార్పులుగానే భావిస్తుంటారు. కుటుంబంలో ఎవరికైనా థైరాయిడ్‌ సమస్యలున్నా, గతంలో ఎప్పుడైనా థైరాయిడ్‌ సమస్యలకు చికిత్స తీసుకున్నా, మెడ వద్ద పెద్ద శస్త్రచికిత్సలు చేయించుకున్నా, రేడియోథెరపీ తీసుకున్నా ఏమాత్రం నిర్లక్ష్యం చేయరాదు. వృద్ధుల్లో హైపోథైరాయిడిజమ్‌ లక్షణాల గురించి తెలుసుకొని ఉండటం, అనుమానం వస్తే వెంటనే పరీక్ష చేయించటం మంచిది.

  • కొలెస్ట్రాల్‌ పెరగటం:కొన్నిసార్లు వృద్ధుల్లో ఇదొక్కటే హైపోథైరాయిడిజమ్‌ లక్షణం కావొచ్చు. థైరాయిడ్‌ హార్మోన్లు పడిపోయినప్పుడు శరీరం కొలెస్ట్రాల్‌ను విడగొట్టలేదు. చెడ్డ కొలెస్ట్రాల్‌ను తొలగించలేదు. దీంతో రక్తంలో కొలెస్ట్రాల్‌ మోతాదులు పెరిగిపోతాయి.
  • గుండె వైఫల్యం:హైపోథైరాయిడిజమ్‌ వల్ల రక్తం పరిమాణం తగ్గుతుంది. గుండె కండర సంకోచాలు బలహీనమవుతాయి. గుండె వేగం నెమ్మదిస్తుంది. ఇవన్నీ గుండె వైఫల్యానికి దారితీసేవే. గుండె పంపింగ్‌ సామర్థ్యం తగ్గితే నిస్సత్తువ ఆవహిస్తుంటుంది. నెమ్మదిగా నడుస్తుంటారు. సమస్య మరింత తీవ్రమైతే ఊపిరితిత్తుల్లో, కాళ్లలో నీరు చేరుతుంది. ఇది ఆయాసం, కాళ్ల వాపులకు దారితీస్తుంది.
  • విసర్జన మార్పులు:థైరాయిడ్‌ హార్మోన్లు తగ్గితే పేగుల కదలికలు నెమ్మదిస్తాయి. ఫలితంగా మలబద్ధకం తలెత్తుతుంది.
  • కీళ్లు, కండరాలు నొప్పులు:కొందరిలో ఇదొక్కటే థైరాయిడ్‌ సమస్యకు సంకేతం కావొచ్చు. హైపోథైరాయిడిజమ్‌లో జీవక్రియల వేగం తగ్గుతుంది. దీంతో ఒంట్లో నీరు ఎక్కువవుతుంది. ఇది కీళ్లు, కండరాల నొప్పులకు దారితీస్తుంది. ముఖ్యంగా కాళ్లలోని పెద్ద కండరాల నొప్పులు తలెత్తుతుంటాయి.
  • మానసిక సమస్యలు:చిన్న వయసులో థైరాయిడ్‌ పనితీరు తగ్గినవారిలో కుంగుబాటు (డిప్రెషన్‌) ఎక్కువగా చూస్తుంటాం. ఇది వృద్ధుల్లోనూ తక్కువేమీ కాదు. తేడా ఏంటంటే- వృద్ధుల్లో కుంగుబాటు ఒక్కటే హైపోథైరాయిడిజమ్‌ లక్షణం కావటం. కొందరు భ్రాంతులకూ లోనవుతుంటారు.
  • మతిమరుపు:జ్ఞాపకశక్తి తగ్గటం, ఏకాగ్రత కుదరకపోవటం, నిర్ణయాలు సరిగా తీసుకోలేకపోవటమూ హైపోథైరాయిడిజమ్‌ లక్షణాలు కావొచ్చు. ఎందుకంటే మెదడు పనితీరు, విషయగ్రహణ, మానసిక స్థితి తీరుతెన్నుల్లో థైరాయిడ్‌ హార్మోన్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి తగ్గిపోతే వీటి పనితీరూ మారిపోతుంది.

ఇదీ చూడండి: పొట్ట తగ్గాలంటే అవి తినటం ఆపి... ఇవి తింటే చాలు..!

ABOUT THE AUTHOR

...view details