How To Overcome Phone Addiction : నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్స్ మన జీవితాన్ని చాలా సుఖమయం చేశాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మనకు కావాల్సిన సమాచారాన్ని, ఎంటర్టైన్మెంట్ను పొందడానికి; ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరితోనైనా సులువుగా కాంటాక్ట్ కావడానికి ఈ స్మార్ట్‌ఫోన్స్ మనకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. అయితే వీటిని ఒక పరిధి మేరకు ఉపయోగిస్తే మంచిదే.. కానీ చాలా మంది పరిమితికి మించి ఫోన్ వాడుతూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే ఫోన్లకు బానిసలు (అడిక్ట్) అవుతుంటారు. ఇది ఏ మాత్రం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. అందుకే ఈ ఫోన్ అడిక్షన్ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1. అవగాహన పెంచుకోవాలి :మీరు ఫోన్‌కు బాగా అడిక్ట్ అయ్యుంటే.. ముందుగా దానికి గల కారణాలను అన్వేషించాలి. మీరు అధికంగా ఫోన్ వాడడం వల్ల.. మీరు రోజూ చేయాల్సిన పనులకు ఏ మేరకు అంతరాయం కలుగుతుందో చూడాలి. అలాగే మీ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులతో గల సంబంధాలను ఫోన్ వాడకం ఏ విధంగా ప్రభావితం చేస్తుందో చూసుకోవాలి. అంటే మీ సమస్యను మీరే గ్రహించుకోగలగాలి. అవసరమైతే వేరొకరి సహాయం తీసుకోవాలి. సమస్య పరిష్కారానికి ఏం చేయాలనే విషయంపై కూడా ఒక అవగాహనకు రావాలి.
2. సరైన లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలి :ఫోన్ వాడకాన్ని అదుపులో ఉంచుకోవాలంటే.. ముందుగా మీ స్క్రీన్ టైమింగ్‌ను వీలైనంత వరకు తగ్గించుకోవాలి. అందుకోసం మీ వర్కింగ్ అవర్స్‌లో ఫోన్‌ను మ్యూట్‌లో పెట్టుకోవాలి. రాత్రి పడుకునే సమయంలోనూ ఫోన్‌ను సైలెంట్లో పెట్టుకోవాలి. అలాగే ఫోన్ ఇంటిలోనే ఉంచి, స్నేహితులతో, సన్నిహితులతో కలవాలి. కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా ఆ రోజు విశేషాల్ని పంచుకోవాలి. ఇలా క్రమక్రమంగా ఫోన్ అడిక్షన్ నుంచి బయటపడేందుకు కృషి చేయాలి.
3. మానిటరింగ్ యాప్స్ ఉపయోగించాలి : మనం రోజు వారీగా ఎంత సేపు ఫోన్ వాడుతున్నాం అనే విషయాన్ని ట్రాక్ చేసుకోవాలి. ఇందుకోసం ప్రస్తుతం ఆన్లైన్లో బోలెడ్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఒక బెస్ట్ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకుని, ఫోన్ వాడకం కోసం నిర్దిష్ట సమయాన్ని సెట్ చేసుకోవాలి. ఆ సమయం పూర్తి అయిన వెంటనే.. మీకు అలెర్ట్ వస్తుంది. దీనితో మీరు వెంటనే ఫోన్ వాడకాన్ని ఆపేయడానికి వీలవుతుంది.
4. ఫోన్-ఫ్రీ జోన్‌ను ఏర్పాటుచేసుకోవాలి : మనకు మనమే కొన్ని నియమాలు ఏర్పాటు చేసుకోవాలి. ముఖ్యంగా బెడ్ రూమ్‌లో, భోజనాల గదిలో, కార్యాలయంలో ఫోన్ ఉపయోగించకూడదని ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇది మొదట్లో కష్టంగానే ఉన్నప్పటికీ.. తరువాత క్రమక్రమంగా ఫోన్ అడిక్షన్ అనేది బాగా తగ్గుతుంది.
5. స్క్రీన్-ఫ్రీ టైమ్ : వాస్తవానికి భోజనం చేసేటప్పుడు, నిద్రపోయే ముందు ఫోన్ వాడకూడదు. అందుకే ఇలాంటి సమయంలో కచ్చితంగా ఫోన్‌ను దూరం పెట్టాలి. అప్పుడే తిన్నది వంటబడుతుంది. అలాగే మంచి నిద్ర కూడా పడుతుంది.