మనసును ఆకర్షించే కొత్త రకాల వంటలను ప్రతిరోజు ఆస్వాదించటం కష్టం. కొన్ని రకాల రుచులకు అలవాటు పడిన మనం కొత్త వంటలను అలవాటు చేసుకోవటం కష్టమే. మన ఆరోగ్యాన్ని, శరీర సౌష్టవాన్ని కాపాడుకునే విధంగా ఆహారాన్ని మలచుకోవాలి. అయితే, ఆహారపుటలవాట్లలో పెనుమార్పులు తీసుకురావటం సులభం కాదు. అందువల్ల చిన్న చిన్న మార్పులతోనే ప్రారంభిద్దాం. చపాతి, కూరలు, పప్పు మొదలైనవి చేయటంలో చిన్నపాటి చేర్పులను పాటించాలి. దీక్షాచెబ్రా ఫిట్నెస్ కన్సల్టేషన్ స్థాపకులు దీక్ష చెబుతున్నట్టుగా ఎక్కువ శ్రమ లేకుండా మన ఆహారాన్ని పోషకాలతో నింపవచ్చు.
మాంసకృత్తుల బలం:
మన అమ్మలు, అమ్మమ్మలు విరిగిన పాలతో పన్నీరు, మిగిలిన పాలతో పెరుగు ఎలా చేసే వారో మనకు బాగా తెలుసు. అవి తయారైన తర్వాత మిగిలిన నీరు ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా? పన్నీర్ చేయగా మిగిలిన నీటిని పారబోస్తాం. పెరుగు తయారైన తరువాత అందులో తేట నీరు కూడా వృథా అనుకుంటాం. వాటిని పారబోయకుండా మిగిలిన నీటిని చపాతీ పిండి కలపడానికి వాడవచ్చు లేదా పప్పులోనూ, కూరల్లోనూ లేదా పాస్తాలో అయినా కలపవచ్చు. భారతీయ ఆహారంలో మాంసకృత్తులు తక్కువగా ఉంటాయి. అందువల్ల ఈ చిట్కాతో ఆలోటును పూరించవచ్చు.