How To Look Young Forever :వయసు పెరుగుతున్న కొద్దీ మన ముఖంలో, శరీరంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తుంటాయి. చర్మం ముడతలు పడి అందం కోల్పోతుంది. శరీర ఆకృతి, సౌష్టంలో తేడాలోస్తాయి. అయితే మన ఆలోచనలు, అలవాట్లు, జీవనశైలి సవ్యంగా ఉంటే వయసు పెరుగుతున్నప్పటికీ అందంగా, ఆరోగ్యంగా, యవ్వనంగా ఉండవచ్చు. పెరుగుతున్న వయసు తాలుకు లక్షణాలను నివారించాలంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కంటినిండ నిద్ర చాలా అవసరం!
మన ఆరోగ్యానికి నిద్ర చాలా అవసరం. తగినంత నిద్ర లేకపోతే శరీరం ముడతలు పడిపోయి వయసు మీరిన లక్షణాలు త్వరగా కనబడతాయి. ఈ క్రమంలో కార్టిసాల్ హార్మోన్‌తో పాటు మరికొన్ని హార్మోన్లు ఎక్కువగా విడుదలవుతాయి. పెద్దవారు రోజుకు కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోయేలా చూసుకోవాలి. చిన్నపిల్లలు అయితే రోజుకు కనీసం 8 గంటల నుంచి 12 గంటలు నిద్రపోవాలి. కంటినిండా నిద్ర లేనప్పుడు మన శరీర అవ్యయవాల పనితీరు కూడా దెబ్బతింటుంది. దీంతో మన శరీరానికి విశ్రాంతి దొరక్కపోగా అనేక అనారోగ్య సమస్యల బారిన పడతాం.
మన శరీరానికి తగిన విశ్రాంతి ఇవ్వనప్పుడు చర్మం, మెదడు యాక్టివ్‌గా పనిచేయలేవు. ఇది మీ యవ్వనత్వంపై ప్రభావం చూపుతుంది. అందుకే రోజుకు సరిపడా నిద్ర పోవడం ద్వారా మీ బాడీ రిలాక్జ్ అవుతుంది. తద్వారా మీ మెదడుకు మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. దీంతో మనం యవ్వనంగా కనబడతాం.
సిగరెట్‌కు ఆమడ దూరంలో!
పొగాకు అలవాటు ఉన్నవారిలో కూడా వయసు మీరిన లక్షణాలు త్వరగా బయటపడతాయి. తరచు సిగరెట్ తాగేవారు వైద్యుల సలహాలు తీసుకొని ఆ అలవాటు నుంచి బయటకు రావడం మంచిది. ధూమపానం మానేయటం ద్వారా మన బ్రెయిన్ యవ్వనంగా ఉంటుంది. ఇది మన ఆలోచనా శక్తిని కూడా మెరుగు పరుస్తుంది. అంతేకాకుండా పొగాకు ద్వారా కలిగే అనేక అనారోగ్య సమస్యల నుంచి కూడా సులువుగా బయటపడవచ్చు.
ఎండలో ఎక్కువగా ఉండేవారిలోనూ!
ఎండలో ఎక్కువగా ఉండేవారిలో కూడా చర్మ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎండలో తిరగటం వలన చర్మం మందమై రంగు తగ్గుతుంది. ముడతలు, మచ్చలు వస్తాయి. ఎండలో తిరిగే వారు చర్మానికి ఎండ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సన్‌గ్లాస్‌లు, టోపీ, పొడవు చేతుల దుస్తులు వంటివి వాడాలి. SPF 30 అంతకంటే ఎక్కువగా ఉన్న సన్‌స్క్రీన్‌ను వాడటం వలన చర్మానికి ఎండ నుంచి రక్షణ లభిస్తుంది.
వీటికి దూరంగా ఉండాలి!
నిద్ర సమస్య ఉన్నవారు నిద్రకు ముందు మద్యపానం, కెఫిన్‌కు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ద్వారా కలిగే దుష్ఫలితాలు అనేకం. ఈ రోజుల్లో చాలామంది కనీసం 10 నుంచి 12 గంటల వరకు ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లపైనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. కొందరు వృత్తిరీత్యా ఈ పనిచేస్తుంటే.. మరికొందరు కాలక్షేపానికి ఎక్కువసేపు స్క్రీన్‌పైనే తమ సమయాన్ని స్పెండ్ చేస్తున్నారు. ఇది మన కళ్ల మీద విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అలాగే గంటల తరబడి ఫోన్లలో మాట్లాడటం వల్ల ఏర్పడే తరంగాలు కూడా మన మెదడుపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. తద్వారా మీ ఏజింగ్ ప్రక్రియ వేగంగా జరిగి మీ ముఖంలో యవ్వన ఛాయలు చిన్న వయసులోనే తగ్గిపోతాయి.
క్రమం తప్పకుండా వ్యాయామం మస్ట్!
ప్రతిరోజూ వ్యాయామం చేసేవారిలో ఏజింగ్ ప్రక్రియ నెమ్మదిస్తుందని డాక్టర్లు అంటున్నారు. అంతేకాకుండా రోజుకు కొద్దిసేపు యోగా, ధ్యానం లాంటివి చేస్తే కూడా మీ యవ్వనత్వాన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చని సూచిస్తున్నారు. అలాగే క్రమం తప్పకుండా చేసే వ్యాయామం వలన మీలో వయసు మీరిన లక్షణాలను నివారించుకోవచ్చు. వ్యాయామంతో శరీర కండరాలు శక్తిమంతమవుతాయి. అలాగే వయసు పెరగటం వలన వచ్చే అనారోగ్యాలను కూడా నివారించే అవకాశం ఉంటుంది.
మానసిక ఒత్తిళ్లకు దూరం!
ముఖంలో ముసలితనం ఛాయలు రాకుండా ఉండాలంటే ముఖ్యంగా మానసిక, శారీరక ఒత్తిళ్లకు దూరంగా ఉండాలి. ఒక్కోసారి మనకి తెలియకుండా మనమే తీవ్ర ఒత్తిళ్లకు లోనవుతుంటాం. దీంతో మీ ముఖంలో, శరీరంలో కీలక మార్పులు జరుగుతాయి. ఇవి మీరు త్వరగా యవ్వనత్వాన్ని కోల్పోయేలా చేస్తాయి. రోజుకు 10 నుంచి 20 నిమిషాల పోటా ధ్యానం చేస్తే స్ట్రేస్కు దూరంగా ఉండవచ్చు.