'మనిషిక్కడ.. మనసెక్కడో..' వద్దు!
How to improve romance in your relationship : పని చేస్తున్నంత సేపూ దాని పైనే పూర్తి దృష్టి పెడతాం.. కానీ శృంగారం దగ్గరికొచ్చే సరికి మాత్రం 'మనిషిక్కడ.. మనసెక్కడో..' అన్నట్లుగా చాలామంది దంపతులు వ్యవహరిస్తారంటున్నారు నిపుణులు. ఇందుకు కారణం.. సిగ్గు, బిడియం, నెర్వస్‌నెస్. శరీరాకృతి, బరువు, చర్మ ఛాయ, అందం.. వంటి విషయాల్లో తాను తన భాగస్వామికి నచ్చుతానో, లేదోనన్న భయంతో కొందరు అడుగు ముందుకు వేయరు. ఇలా మిమ్మల్ని మీరు విమర్శించుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం తగ్గడంతో పాటు క్రమంగా మీ భాగస్వామికీ దూరమయ్యే ప్రమాదం ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే.. గదిలోకి వెళ్లే ముందే ఇలాంటి ప్రతికూల ఆలోచనలన్నీ బయటే వదిలిపెట్టమంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఎలా ఉన్నా మిమ్మల్ని మీరు స్వీకరించడం, అంగీకరించడం ముఖ్యం. ఈ స్వీయ ప్రేమే ఇద్దరి మధ్య రొమాన్స్‌ను కలకాలం కొనసాగేలా చేస్తుంది.
ఇష్టం లేకపోతే చెప్పొచ్చుగా..!
మనసు పెట్టి చేసినప్పుడే అన్ని పనుల్లాగే శృంగారాన్నీ ఆస్వాదించగలం. అయితే పని ఒత్తిడి, వ్యక్తిగత-వృత్తిపరమైన, ఇతర అనారోగ్య కారణాల వల్ల ఒక్కోసారి దానిపై ఆసక్తి ఉండకపోవచ్చు. మరి, ఆ విషయం మీ మనసులోనే ఉంచుకుంటే మీ భాగస్వామికి ఎలా తెలుస్తుంది? పైగా ఇలా అయిష్టంగా, అవతలి వారి ఒత్తిడితో అడుగు ముందుకేస్తే.. దాని వల్ల మీరు శారీరకంగానే కాదు.. మానసికంగానూ ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇది క్రమంగా మీ ఆత్మవిశ్వాసాన్నీ దెబ్బతీస్తుంది. కాబట్టి మీకు ఆసక్తి లేనప్పుడు.. నిర్మొహమాటంగా ఈ విషయాన్ని మీ భాగస్వామితో చెప్పడంలో తప్పు లేదంటున్నారు నిపుణులు. అలాగే దాని వెనకున్న కారణాన్ని వారికి వివరిస్తే తప్పకుండా వారు అర్థం చేసుకుంటారు. ఫలితంగా ఇద్దరి మధ్య ఎలాంటి అనుమానాలకూ తావుండదు. ఇలా ఈ విషయంలో ఒకరినొకరు అర్థం చేసుకొని మసలుకుంటే ఆత్మవిశ్వాసమూ పెరుగుతుంది.
అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏంటంటే.. కొంతమంది ఆసక్తి లేదంటూ పదే పదే భాగస్వామిని దూరం పెడుతుంటారు. ఇది కరక్ట్ కాదు. కాబట్టి మీ సమస్యను నిపుణుల దగ్గర పరిష్కరించుకుంటే శృంగార జీవితాన్ని ఆస్వాదించచ్చు.
నవ్వు.. దివ్యౌషధం!
'నవ్వు నాలుగు విధాలుగా మేలు' అంటారు పెద్దలు. ఇదే నవ్వు దంపతుల్లో శృంగార సామర్థ్యాన్నీ పెంచుతుందంటున్నాయి పలు అధ్యయనాలు. ఏ జంటలైతే సంతోషంగా ఉంటారో, వారి మధ్య చనువు పెరుగుతుందని, ఇది క్రమంగా లైంగిక కోరికల్నీ పెంపొందిస్తుందని ఓ పరిశోధనలో వెల్లడైంది. అదెలాగంటే.. ఎప్పుడూ సంతోషంగా, ఉల్లాసంగా ఉండే వ్యక్తి.. తమ భాగస్వామినీ ఒత్తిళ్ల నుంచి దూరంగా ఉంచుతారట! తద్వారా వారిలో సానుకూల దృక్పథం పెరిగి.. ఇద్దరూ త్వరగా దగ్గరవుతారని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటప్పుడు భార్యాభర్తలిద్దరిలో ఆత్మవిశ్వాసం మరింత పెరగడమే తప్ప కోల్పోయే పరిస్థితి ఎదురవదు. ఫలితంగా లైంగిక జీవితాన్నే కాదు.. వారి జీవితంలోని ప్రతి సందర్భాన్నీ ఎంజాయ్ చేయగలుగుతారు.