How To Gain Weight: లావుగా ఉండి బాధపడేవాళ్ల సంగతి ఓ ఎత్తైతే.. చిక్కిపోయిన శరీరంతో ఇబ్బంది పడే వారూ చాలా మందే ఉంటారు. ఇలాంటి వారిని ఆత్మన్యూనత సమస్య వేధిస్తోంది. ఇక లావయ్యేందుకు చేసే ప్రయత్నాలకు అంతే ఉండదు. దీని కోసం ఏది పడితే అది తినేసి ఒక్కోసారి ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటూ ఉంటారు. అయితే.. లావు తగ్గడానికి ఎన్ని జాగ్రత్తలు పాటిస్తామో, బరువు పెరగడానికి కూడా అన్నే జాగ్రత్తలు తప్పనిసరి అని వైద్యులు చెబుతున్నారు.
తిన్నంత మాత్రాన లావు అవ్వరని.. అదే విధంగా తిండి మానేస్తే సన్నబడరని వైద్యులు అంటున్నారు. ప్రస్తుతం స్థూలకాయం మీద ప్రపంచం దృష్టి ఉండటం వల్ల ప్రస్తుతం బరువు పెరగాలనుకునే వారి సంఖ్య తగ్గిందని.. నిజానికి సరైన బరువు ఉండటమే ఆరోగ్యం అని సూచిస్తున్నారు.
బరువు తక్కువగా ఉండడానికి కారణాలేంటి? తినడంలో సమస్యల నుంచి దీర్ఘకాలిక జబ్బుల వరకు ఏవైనా బరువు తక్కువగా ఉండటానికి కారణం కావొచ్చు. ముఖ్యంగా వృద్ధాప్యం వల్ల.. మనిషి సన్నబడే అవకాశాలు ఉంటాయని వైద్యులు తెలిపారు. బరువు పెరగాలని ఏది పడితే అది తినకూడదు. ఏం తినాలో, ఏం తినకూడదో ప్రణాళిక వేసుకోవాలి. లేకపోతే చెడు కొవ్వు పదార్థాల స్థాయులు పెరిగి వివిధ ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
ఆరోగ్యకరంగా బరువు పెరగాలంటే..
- శక్తిని అందించే పదార్థాలతో పాటు మిల్క్ షేక్స్, నట్స్, వెన్న, అవకాడో గింజలు రోజూ ఆహారంలో ఉండేలా చూసుకోవడం వల్ల మంచి కేలరీలతో బరువు పెరగవచ్చు.
- పండ్లు, డ్రైఫ్రూట్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ వల్ల బాగా బరువు పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. వీటిని కొంచెం మోతాదులో వాడాలి.
- ఆహారంలో డ్రై ఫ్రూట్స్ ఉండేలా చూసుకోవాలి. ఇవి రుచికరంగానే కాదు తక్షణ శక్తిని కూడా అందిస్తాయి. బాదం, కాజు, ఎండు ద్రాక్ష తీసుకోవాలి.
- తినే ఆహార పరిమాణం ఒకేసారి పెంచే బదులు.. కొంచెం కొంచెంగా పెంచడం.. కొంచెం కొంచెంగా ఎక్కువమార్లు తినడం అవసరం.
- 2-3 గంటలకోసారి తినడం వల్ల కేలరీల స్థాయులు పెరుగుతాయి. సాయంత్రం లేదా అప్పుడప్పుడు చిరుతిళ్లు అవసరం. పోషకాలు, విటమిన్స్ ఉన్న ఆహార పదార్థాలను స్నాక్స్ రూపంలో తినాలి.
- పండ్లు తక్షణ శక్తితో పాటు.. శరీరానికి కావాల్సిన పోషకాలు అందిస్తాయి. కాబట్టి ఎక్కువ శాతం పండ్లు డైట్లో ఉండేలా తీసుకోవాలి.
- అరటిపండ్లు బరువు పెరగడానికి దోహదపడతాయి. పండ్లు ఇష్టపడనివాళ్లు కనీసం జ్యూస్ రూపంలో అయినా తీసుకోవాలి.
- మాంసం, చేపలు, యోగర్ట్, బీన్స్ వంటి వాటిల్లో ప్రొటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి బరువు పెరగడానికి తోడ్పడుతాయి.
- రోజుకు 500 కేలరీల ఆహారం తీసుకుంటే వారానికి ఒక పౌండ్ చొప్పున బరువు పెరగతారు.
బరువు పెరగాలన్న ఆశతో.. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్పై మోజు పెంచుకోకూడదు. ఇవి ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా మహిళలు బరువులను ఎత్తుతూ వ్యాయామం చేయాలి. సరైన శిక్షణ ఇచ్చే ఫిట్నెస్ నిపుణుల సాయంతో.. కార్డియో, యోగా వ్యాయామాలు అవసరమే. అయితే.. దీని కోసం తక్కువ సమయం కేటాయించాలి. ఎక్కువ టెన్షన్ పడకూడదు. సమయం ప్రకారం తినాలి. రోజుకు 8 గంటలు నిద్రపోవాలి. ఆహారం, వ్యాయామం, విశ్రాంతి ఒక క్రమపద్ధతిలో ఉంటే.. ఆరోగ్యకరంగా బరువు పెరగవచ్చు.
ఇదీ చదవండి:వడదెబ్బ నుంచి రక్షణ పొందడం ఎలా?