తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

How to Face Fear of Failure in Life : భయం వెంటాడుతోందా..?

"ఎదురుగా భూతం ఏమీ ఉండదు.. కానీ మనసును ఏదో పీడిస్తూ ఉంటుంది!" "ఎదురెళ్లేది పులికో.. సింహానికో కాదు. అయినా.. గుండెను గుబులు వణికిస్తూ ఉంటుంది!!" "ఉన్నది అరణ్యంలో కాదు.. జానారణ్యంలోనే. అయినప్పటికీ.. ఏదో తెలియని అలజడి..!" కొత్త పని చేయాలంటే భయం.. కొత్తగా కనిపించాలంటే భయం.. నలుగురిలో మాట్లాడాలంటే భయం.. స్వేచ్ఛగా నవ్వాలన్నా భయమే! ఈ భయాల చిట్టా.. రాస్తే పుస్తకం అవుతుంది. తీస్తే సినిమా అవుతుంది. ఇలాంటి కండీషన్స్​ మీరు కూడా ఫేస్ చేస్తున్నారా..? అయితే.. ఈ స్టోరీ మీకోసమే. రండి.. భయం కోటను బద్ధలు కొడదాం. దాని అంతేందో తేల్చేద్దాం.

Face Fear of Failure in Life
How to Face Fear of Failure in Life

By ETV Bharat Telugu Team

Published : Sep 10, 2023, 3:31 PM IST

పది మందిలో ఏదైనా మాట్లాడాలంటే.. గొంతు వణికిపోతుంది. నాలుక తడారిపోతుంది! కొత్తగా ఏదైనా పని చేయాల్సి వస్తే.. లాస్ట్ నుంచి ఫస్ట్​లో ఉంటారు..! అది నావల్ల కానేకాదని ఫిక్స్ అయిపోతారు. ప్రయత్నం చేయడానికి కూడా "ప్రయత్నించరు". ఎప్పుడూ కంఫర్ట్​ జోన్​ కోరుకుంటారు. ఇవన్నీ.. "అటిచిఫోబియా"గా పిలువబడే.. "ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్" లక్షణాలు. అంటే.. ఓటమి భయం. ఇదొక మానసిక రుగ్మత. మొగ్గలోనే తుంచేస్తే.. ఇది పెద్ద సమస్యే కాదు. చెట్టుగా మారినా.. మహా వృక్షంగా ఎదిగినా కూడా.. కూకటివేళ్లతో పెకిలించడమం మాత్రం అసాధ్యం కాదు. పలుగు, పార పట్టుకుని సిద్ధం కండి.

అసలేంటీ భయం..?

మానసిక నిపుణులు దీన్ని "అటిచిఫోబియా"గా పిలుస్తారు. ఈ ఫోబియాతో బాధపడుతున్న వారు.. ఏ పనిచేయాలన్నా ముందు నెగెటివ్​గానే ఆలోచిస్తారు. లేని సమస్యలను కూడా భూతద్దంలో వెతికి వెతికి చూస్తారు. తమకు తామే అడ్డుగోడలు నిర్మించుకుంటారు. వాటిని చూసి.. ఈ పనిలో చివరకు తాము ఓడిపోవడం ఖాయమని ముందే ఫిక్స్ అయిపోతారు. రిస్క్ అనే పదం వింటేనే భయంతో హడలిపోతారు. ఇలాంటి వారిలో ఆత్మవిశ్వాసం అన్నది ఎంత వెతికినా కనిపించదు. ఎప్పుడూ నిరాశతో ఉంటారు.

కారణాలేంటి..?

  • ఒక వ్యక్తిలో ఈ మానసిక స్థితి ఏర్పడడానికి పలు కారణాలు ఉన్నాయి.
  • చిన్నతనంలో తల్లిదండ్రులు లేదా ఇంట్లోని ఇతరులు లేదా బయటివారి చేసే పనులు చాలా ప్రభావం చూపిస్తాయి.
  • ఇతరులతో పోల్చి నువ్వు ఎందుకూ పనికిరావు అని తిట్టడం
  • ఏ విషయంలోనైనా ఫెయిల్ అయినప్పుడు.. తల్లిదండ్రులు మద్దతుగా నిలవడానికి బదులు.. సూటిపోటి మాటలతో నిందించడం
  • "నువ్వు ఓడిపోతావని నాకు ముందే తెలుసు.. నేను అప్పుడే చెప్పాను కదా.." అంటూ చులకన చేయడం
  • ఇంట్లోని వారి నుంచి ప్రోత్సాహం లేకపోవడం
  • ఇలాంటి వాటి ద్వారా.. తాము ఎందుకూ పనికిరాని వారమనే భావన పిల్లల మనసులో బలంగా నాటుకుపోతుంది.
  • అది వారితో పాటే పెరిగి పెద్దగా అయ్యిందంటే.. సమస్య ముదిరిందని అర్థం.

వారసత్వం కూడా..

ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్​కి వారసత్వం కూడా ఓ కారణమని మానసిక నిపుణులు చెబుతున్నారు. తల్లిదండ్రులు లేదా.. వారి వారసత్వంలో ఎవరో ఒకరు మానసికంగా తీవ్ర కుంగుబాటుకు లోనైతే.. అది భావితరాలపై ప్రభావం చూపడానికి చాలా అవకాశాలు ఉన్నాయని సైకాలజిస్టులు చెబుతున్నారు.

How to Face Fear of Failure in Life : భయం వెంటాడుతోందా..?

వీరి ఆలోచన విధానం ఎలా ఉంటుంది..?

ఈ ఫోబియాతో బాధపడేవారి మనసు ఎప్పుడూ ఓటమి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అందుకే.. స్కూల్లో, కాలేజీలో ఉన్నప్పుడు సాంస్కృతిక కార్యక్రమాల వంటి వాటిల్లో పాల్గొనడానికి అయిష్టత చూపిస్తారు. లీడర్ షిప్ విషయంలోనేతా దాక్కుంటారు. పెద్దయ్యాక ఉద్యోగాలు చేసే చోట కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. కొత్తగా ఏదైనా పని చేయాల్సి వస్తే.. నెగెటివ్​గా థింక్ చేసి.. ఆ పని వాయిదా వేయడానికి చూస్తుంటారు. అంటే.. తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. నలుగురి ముందూ ధైర్యంగా తమ అభిప్రాయం చెప్పడానికి కూడా వణికిపోతారు. తద్వారా.. కెరియర్​లో ఎదగడానికి వచ్చిన అవకాశాలను కాలదన్నుకుంటారు. ఉన్నచోటు నుంచి కొత్త ప్రాంతానికి కావొచ్చు.. కొత్త ఉద్యోగానికి కావొచ్చు.. ఎక్కడి వెళ్లాలన్నా "నో" చెప్తారు.

మానసికంగా..

ఇలాంటి వారు అధిక భావోద్వేగాలు కలిగి ఉంటారు. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ మొదలు.. సిగ్గు, నిరాశ, తీవ్ర భయాందోళన వంటి ఉద్వేగాలతో మదన పడుతుంటారు. ఈ పరిస్థితి ముదిరితే మానసికంగా డిప్రెషన్​లోకి వెళ్లిపోవచ్చు. అందుకే.. వీలైనంత తొందరగా ఈ సమస్య నుంచి బయటపడాలి. దానికోసం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

ఇలా చేయండి...

  • మొదటగా జీవితపు దృక్పథాన్నే మార్చేయండి. అంటే.. ఏ పని చేసినా గెలుపు, ఓటమి లెక్కలు వేయడం మానేయండి. జీవితంలో చేసే ప్రతి పనీ ఓ ఎక్స్​పీరియన్స్​ అని గుర్తించండి.
  • గెలుపు ఓటములనేవి మనం పెట్టుకున్న గీతలే తప్ప.. వాస్తవంలో అవేవీ ఉండవని అర్థం చేసుకోండి. ప్రతీ అనుభవాన్ని టేస్ట్ చేస్తూ వెళ్లడమే జీవితం అని గుర్తించండి.
  • ఏ పని మొదలు పెట్టినా.. మరో కొత్త విషయం నేర్చుకుంటున్నాను అనుకోండి. కొత్తగా నేర్చుకుంటున్నప్పుడు పొరపాట్లు సహజం అని మనసుకు అర్థం చేయించండి.
  • చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకుంటూ ముందుకు సాగండి.. మోయలేని భారాన్ని నెత్తికొత్తుకొని కిందపడితే.. ఆత్మవిశ్వాసం సన్నగిల్లే ప్రమాదం ఉంటుంది.
  • వైఫల్యం ఎదురైతే కుంగిపోకండి.. మళ్లీ ప్రయత్నించడానికి సిద్ధమవ్వండి.
  • థామస్ అల్వా ఎడిసన్ ఎన్ని సార్లు విఫలమైన తర్వాత బల్పు కనిపెట్టాడో ఓ సారి గుర్తు తెచ్చుకోండి. మొదటి ఓటమికే ఆయన పరిశోధన వదిలేస్తే.. ఏమయ్యేదో ఆలోచించండి.
  • జీవితంలో "సక్సెస్ ఫుల్​ పీపుల్​" అని చెప్పుకునే వారి చరిత్ర గురించి తెలుసుకోండి. కనీసం.. మీకు రోల్ మోడల్​గా ఉన్న వ్యక్తి జీవితమైనా తెలుసుకోండి. ఎన్ని దెబ్బలు తిని ఈ స్థాయికి వచ్చారో తెలుస్తుంది.
  • జీవితంలో ఏదీ పర్ఫెక్ట్ గా ఉండదని తెలుసుకోండి. "ట్రయల్ అండ్ ఎర్రర్ " ప్రాసెస్​తోనే టార్గెట్ రీచ్ అవుతామని మరిచిపోకండి.
  • "సముద్రపు కెరటం నాకు ఆదర్శం.. పడిపోయినందుకు కాదు. తిరిగి లేచినందుకు" అన్న సూక్తులను మననం చేసుకోండి.
  • పడిపోవడం ఓటమి కాదు.. తిరిగి ప్రయత్నించకపోవడమే ఓటమి అన్న సంగతి నిత్యం గుర్తు చేసుకోండి.
  • మీకు ఎవరితో ఏ అవసరం ఉన్నా.. అడగడానికి మొహమాట పడకండి. అన్ని విషయాలూ తెలిసిన మనిషి ఈ భూమ్మీదనే లేడు.. ఉండడు.. అని గుర్తించండి.

చివరగా..

మీ గురించి ఆలోచించడానికి ఈ ప్రపంచానికి తీరిక.. ఓపిక లేవు. సో.. ఎవరు ఏమనుకుంటారో అనే భయం వదిలిపెట్టండి. వైఫల్యం ఎదురుకాని మనుషులు ఉండరని గుర్తించండి. నిన్నటి అనుభవాలను ఇవాళ పాఠంగా చదువుకుంటూ.. రేపటి భవిష్యత్తును నిర్మించుకోండి. ఈ ప్రయాణంలో మీకు ఎదురయ్యే ప్రతి అనుభవానికీ కర్త, కర్మ మీరే అని మరిచిపోకండి. ఫలితం ఏది వచ్చినా.. స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని మీ మనసుకు చెప్పేయండి. ఇప్పుడు.. భయం మీ చుట్టుపక్కల ఉందేమో ఓ సారి చూడండి!

ABOUT THE AUTHOR

...view details