కరోనా రెండోదశలో చిన్నా,పెద్ద అని తేడా లేకుండా అందరూ వైరస్ బారిన పడుతున్నారు. కుటుంబంలో ఒక్కరికి వైరస్ సోకితే మిగతా వారికీ సులభంగా వ్యాపిస్తోంది. దీంతో కుటుంబంలో మిగతావారికి కరోనా సోకకుండా ఎలా ఉండాలని ఆలోచనలు, అనుమానాలతో తలలు పట్టుకుంటున్నారు. అలాంటివారి సందేహాలు పటాపంచలు చేయాడానికే ఈ ప్రత్యేక కథనం.
ఇంట్లో ఒకరికి వస్తే..
ఇంట్లో ఒకరికి కరోనా వస్తే మిగిలిన అందరికీ కరోనా పరీక్షలు చేయాల్సిందే. అందరికీ పాజిటివ్ వస్తే కలిసే ఉండొచ్చు. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఒకరికే లక్షణాలు కనిపిస్తే ఆ ఒక్కరిని ఐసొలేషన్‌లో ఉంచి.. మిగతా వారు దూరం పాటించాలి. ఒకే గది ఉంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైతే పాజిటివ్ వచ్చిన వ్యక్తిని ఐసొలేషన్ కేంద్రంలో ఉంచాలి. లేదంటే ఇంట్లోనే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కొవిడ్ సోకిన వ్యక్తి మాస్క్ పెట్టుకొని బాత్‌రూం వినియోగించాలి. దానిని తర్వాత పూర్తిగా డెటాల్, శానిటైజర్లు, బాత్‌రూం క్లీనర్లతో శుభ్రంగా కడగాలి. పనిమీద బయటకు వెళ్లి ఇంటికి లోపలకు వచ్చే వారు సబ్బుతో చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి. లేదంటే శానిటైజర్లు వినియోగించాలి. ఆఫీసులు, కార్యాలయాలు ఇతర పని ప్రదేశాల నుంచి వచ్చేవారు ఇంట్లోకి రాగానే నేరుగా బాత్ రూంలోకి వెళ్లి దుస్తులు తీసి వేరేగా ఉంచి స్నానం చేయాలి. పిల్లలు, వృద్ధులు, గర్భిణులను ప్రత్యేకంగా ఉంచాలి. హాల్‌లో కూడా అందరూ దూరం పాటించాలి. ఒకరికి వైరస్ ఉన్నా ఇంట్లో మిగిలిన వారు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలి.
అన్నీ వేరుగా వెలుతురు ధారగా
కరోనా సోకిన వ్యక్తి వాడే వస్తువులు ప్రత్యేకంగా ఉండాలి. డిస్పోజబుల్ పేట్లు, గ్లాసులు ఉపయోగించాలి. దుస్తులు ప్రత్యేకంగా వాడాలి. లక్షణాలు లేకపోయినా రెండు, మూడు వారాల వరకు వైరస్ ఉంటుంది. కాబట్టి కరోనా సోకిన వ్యక్తి బయట తిరగకూడదు. ఐసోలేషన్ రూంను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. బట్టలు సబ్బు పెట్టి ఉతుక్కోవాలి. చేతులు తరచూ శానిటైజ్ చేసుకోవాలి. కొవిడ్ రోగులకు భోజనం అందించే వారు జాగ్రత్తలు పాటించాలి. తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. గదిలో కిటికీలు, తలుపులు తెరిచి ధారాళంగా గాలి, వెలుతురు ఉండేలా చూసుకోవాలి. కొవిడ్ రోగి వాడిన పదార్థాల అవశేషాలను డిస్పోజబుల్ బ్యాగ్‌లో ఉంచి జాగ్రత్తగా మూటగట్టి చెత్త బుట్టలో వేయాలి.