తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

చలికాలంలో గొంతు నొప్పి వేధిస్తోందా? ఇలా చేస్తే అంతా సెట్!

How To Cure Throat Pain In Winter : చలికాలం రాగానే చాలా మంది జలుబు, దగ్గు బారిన పడతారు. గొంతు నొప్పితోనూ బాధపడతారు. కొందరిలో ఇది తొందరగానే తగ్గినా మరికొందరిలో ఎక్కువ రోజులు ఉంటుంది. చలికాలంలో గొంతు నొప్పి రావడానికి గల కారణాలేంటి? ఆ నొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే ఏం చేయాలి?

Throat Pain In Winter
Throat Pain In Winter

By ETV Bharat Telugu Team

Published : Jan 6, 2024, 8:07 AM IST

How To Cure Throat Pain In Winter : శీతాకాలంలో మనకు తరచూ జలుబుతో పాటు గొంతు నొప్పి కూడా వస్తుంటుంది. వాతావరణంలో మార్పుల కారణంగా హానికారక బ్యాక్టీరియా, వైరస్​లు గొంతులో తిష్ట వేసుకుని ఉంటాయి. ఫలితంగా గొంతంతా అసౌకర్యంగా అనిపిస్తుంది. దీని మూలంగా తినడం, తాగడం కూడా కష్టమవుతుంది. గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

సీజన్ మారిన ప్రతిసారీ మనలో చాలా మందికి జలుబు చేస్తుంది. వారం, పది రోజుల దాకా తిప్పలు పడాల్సి ఉంటుంది. జలుబుకు తోడు గొంతు నొప్పి కూడా వేధిస్తుంది. ఇలాంటి సమయాల్లో తినడం, తాగడం కూడా కష్టమైన పనులుగా మారిపోతాయి. గొంతులో గరగరగా ఉండి ఒకటే అసౌకర్యంగా ఉంటుంది. వాతావరణంలోని హానికారకాలైన బ్యాక్టీరియా, వైరస్​లు గొంతులో చేరి అక్కడే ఉంటే మనకు గొంతు నొప్పి ఒక సమస్యగా మారుతుందని వైద్యులు చెబుతున్నారు.

"చలికాలంలో మనకు వచ్చే సాధారణ ఆరోగ్య సమస్యల్లో గొంతు ఇన్​ఫెక్షన్ ఒకటి. చాలా మందిలో చల్లటి ఈదురు గాలులు, వర్షంలో తడిసినా, చలిగా ఉన్న ప్రాంతంలో తిరిగినా వెంటనే గొంతు సంబంధిత సమస్యలు వస్తాయి. చలికాలంలో వైరల్ ఇన్ ఫెక్షన్ రేటు ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఇన్​ఫ్లుయెంజా, పారా ఇన్​ఫ్లుయెంజా, ఎడినో వైరస్​ల వ్యాప్తి ఎక్కువయ్యాయి. అటు పిల్లల్లోనూ, ఇటు పెద్దల్లోనూ ఈ వైరస్​లు వస్తున్నాయి. క్లోజ్డ్ ఎన్విరాన్​మెంట్​లో ఉన్నా, కాలుష్యం అధికంగా ఉన్నా గొంతు సమస్యలు వస్తాయి. గొంతు నొప్పి వచ్చిన మొదటి రెండు రోజుల్లో నిర్లక్ష్యం చేస్తే ఇది ఎక్కువయ్యే అవకాశముంటుంది. అందుకే లక్షణాల్ని గమనించిన వెంటనే శరీరానికి విశ్రాంతి ఇచ్చి, తరచూ ఆవిరి పట్టాలి. చల్లటి, పుల్లటి పదార్థాలకు దూరంగా ఉండాలి. ఆయిల్ ఫుడ్, ఎక్కువ స్పైసీగా ఉన్న వాటిని తినొద్దు" అని ఈఎన్​డీ సర్జన్ డాక్టర్ సి.ఆంజనేయులు తెలిపారు.

"చల్లటి వాతావరణానికి దూరంగా ఉంటూ ఒత్తిడికి దూరంగా ఉంటే తగ్గిపోతుంది. కానీ ఎంత నొప్పి ఉన్నా పనులు, ఉద్యోగాలకు వెళితే సమస్య మరింత తీవ్రమవుతుంది. సమస్య ఏ మాత్రం ఎక్కువగా అనిపించినా వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి. సాధారణంగా 5 నుంచి 7 రోజుల పాటు మందులు వాడితే ఇన్​ఫెక్షన్ తగ్గిపోతుంది. అలాగే శీతాకాలం ముందు ఇన్​ఫ్లుయాక్ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఏటా దీన్ని తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభించడమే కాకుండా రోగ నిరోధక వ్యవస్థ కూడా పెరుగుతుంది. చలికాలంలో ఎలర్జీతో బాధపడేవారు, డయాబెటిక్స్, సీఓపీడీ, సైనసైటిస్ సమస్యలతో బాధపడేవారు అప్రమత్తంగా ఉండాలి."
-- డా. సి.ఆంజనేయులు, ఈఎన్​టీ సర్జన్

గొంతు నొప్పి ఉన్నప్పుడు తీవ్ర అసౌకర్యంగా ఉంటుంది. కొందరు లాలాజలాన్ని కూడా మింగలేకపోతారు. కొన్ని సార్లు నొప్పికి తోడు జ్వరం కూడా వస్తుంది. నీరసం, ఆకలి మందగించడం, దగ్గు, గొంతు బొంకరు పోవడం, ముక్కు కారడం, మెడలో గంతలు వాయటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. టాన్సిలాయిట్స్, ఎడినాయిడ్ గ్రంథుల్లో వాపు వచ్చినప్పుడు కూడా గొంతులో నొప్పి సమస్యగా మారుతుంది.

ఇలా చేస్తే ఉపశమనం
తమలపాకు రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే గొంతు నొప్పి నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే తులసీ రసంలో కొంచె తేనె కలిపి తీసుకున్నా గొంతు బొంగురు తగ్గుతుంది. గోరు వెచ్చని చికెన్, టమాటా సూప్​లను తీసుకున్నా మంచిదే. గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, కొంచెం తేనె కలిపి తీసుకున్నా మంచి ఫలితం కనిపిస్తుంది. పాలల్లో కొంచెం మిర్యాల పొడిని కలుపుకుని తాగడం వల్ల సమస్య నుంచి బయటపడొచ్చు. అల్లపు రసాన్ని తరచూ చప్పరించడం వల్ల గొంతులో నొప్పి తగ్గే అవకాశముంటుంది.

పాటించాల్సిన జాగ్రత్తలు
గొంతు నొప్పి నివారణకు చల్లటి వాతావరణంలో తిరగకూడదు. సురక్షితమైన మంచినీరు మాత్రమే తాగాలి. కాచి చల్లార్చి వడపోసిన నీటిని తాగడం మేలు. శీతల పానీయాలు, ఐస్ క్రీమ్స్, బేకరీ ఐటెమ్స్ బాగా తగ్గించాలి. కారం, మసాలా, పులుపు వస్తువులను మితంగా తీసుకోవాలి. రోజూ ఉదయం, సాయంత్రం రెండు పూటలా వేడి నీళ్లతో ఆవిరి పట్టుకోవడం అలవాటుగా మార్చుకోవాలి. బెటాడిన్ అనే ద్రావణంలో తరచూ నోటిని పుక్కిలిస్తూ ఉండాలి. ఇలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా గొంతు నొప్పిని చాలా వరకు నివారించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

చలికాలంలో గొంతు నొప్పి వేధిస్తోందా? ఇలా చేస్తే అంతా సెట్!

ABOUT THE AUTHOR

...view details