How To Control Diabetes : మధుమేహం దీర్ఘకాలంలో రకరకాల సమస్యలకు దారితీస్తుంది. ఎంతకాలంగా మధుమేహంతో బాధపడుతుంటే అంత ఎక్కువగా సమస్యల ముప్పు పెరుగుతూ పోతుంది. కాబట్టి గ్లూకోజ్‌ను నియంత్రణలో ఉంచుకోవడం కీలకం. మధుమేహం ఎక్కువకాలం నియంత్రణలో లేకపోవడం వల్ల దాని ప్రభావం అనేక అవయవాల మీద పడుతుంది. రెటినోపతిలో చూపు మందగిస్తుంది. నెఫ్రోపతిలో కిడ్నీలు దెబ్బతింటాయి. న్యూరోపతిలో నరాలు దెబ్బతినడం వల్ల నడవడం కష్టంగా మారుతుంది. గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా రావొచ్చు. షుగర్ వ్యాధి నియంత్రణలో ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మధుమేహంఉన్నవారిలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. ఇందులో టైప్-1, టైప్-2 రకాలు ఉన్నాయి. ఎక్కువ మందికి టైప్-2 రకం మధుమేహం వస్తుంది. టైప్-1 అనేది వంశపారంపర్యంగా వస్తుంది. టైప్-2 మాత్రం జీవనశైలిలో మార్పులు, వ్యాయామం చేయకపోవడం, బరువు అధికంగా ఉండటం వల్ల జబ్బు బారిన పడతారు. వీరికి ముందుగా మందులతో నియంత్రించినా, క్రమేపీ ఇన్సులిన్ ఇవ్వాల్సి వస్తుంది. షుగర్ అధికంగా ఉండటం వల్ల తరచూ మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం, ఎక్కువగా దాహం వేయడం, అధికంగా బరువు తగ్గిపోవడం, అరికాళ్లలో మంట ఉండటం, చూపు మందగించడం లాంటి సమస్యలు కనిపిస్తాయి. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.
Diabetes Tips To Lower Blood Sugar : 'మధుమేహాన్ని నియంత్రణలో ఉంచాలంటే బ్లడ్ షుగర్ లెవల్స్‌ను అదుపులో పెట్టాలి. అలాగే రక్తపోటు, కొవ్వులను కూడా అదుపులో ఉంచుకోవాలి. ఇది జీవనశైలికి సంబంధించిన వ్యాధి. కాబట్టి రోజువారీ మనం తినే ఆహారాన్ని నిర్ణీత మోతాదులో తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉండాలి. వీటితో పాటు సరైన సమయానికి నిద్రపోవడం కూడా చాలా అవసరం. అలాగే ధూమపానం, మద్యపానం లాంటి అలవాట్లు ఉంటే వెంటనే వాటిని మానేయాలి. ఇలా జీవనశైలిలో ఆహారం, నిద్ర, వ్యాయామం, ధూమపానం, మద్యపానాన్ని గనుక అదుపులో ఉంచగలిగితే రక్తంలో చక్కెర స్థాయులు, రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను కొంతమేర నియంత్రణలో ఉంచొచ్చు' అని ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ రవిశంకర్ చెప్పారు.
Diabetes Tips Control : షుగర్ వ్యాధితో బాధపడేవారి జీవనంలో వ్యాయామం కీలకపాత్ర పోషిస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల కండరాలు పటిష్ఠంగా మారి, కణాలకు ఇన్సులిన్‌ను గ్రహించే శక్తి పెరుగుతుంది. మధుమేహం బారిన పడొద్దంటే శరీర బరువును నియంత్రణలో పెట్టుకోవడం ఎంతో అవసరం. సాధ్యమైనంత ఎక్కువగా శారీరక శ్రమను చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. రోజూ కనీసం అరగంట పాటు నడవడం కానీ.. ఏరోబిక్స్ లాంటి వ్యాయామాలు చేయడం కానీ మరువరాదు. ఇలా వారంలో కనీసం ఐదుసార్లు చేస్తే మధుమేహం నివారణకు తొలి అడుగు వేసినట్లేనని గ్రహించాలి. రన్నింగ్ చేయడం, ట్రెడ్ మిల్ మీద వ్యాయామం చేయడం వల్ల వెంటనే రక్తంలో చక్కెర స్థాయులు తగ్గిపోతాయి. పని ఒత్తిడిని కూడా తగ్గించుకుంటే టైప్-2 డయాబెటిస్ బారిన పడకుండా ఉండొచ్చు.