వేసవి ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. భానుడి భగభగతో రోజువారీ ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. ఫలితంగా శరీరంలో నీటిశాతం తక్కువై.. చాలామంది డీహైడ్రేషన్‌కు గురవుతున్నారు. తొందరగా శక్తిహీనులవుతున్నారు. మరి ఈ సమస్యలను అధిగమించడం ఎలా? ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే.. డీహైడ్రేషన్, శక్తిహీనతకు చెక్ పెట్టొచ్చు? అన్న ప్రశ్నలకు సమాధానంగా కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు డాక్టర్ దివ్య గుప్తా (కన్సల్టెంట్ న్యూట్రిషనిస్ట్ అండ్ డయాబెటిస్ ఎడ్యుకేటర్).
ఇవి తీసుకుంటే సరి...
పెరుగు :ప్రోబయోటిక్ స్వభావం కారణంగా రోగనిరోధక శక్తి, జీర్ణక్రియను మెరుగుపరిచే పదార్థంగా పెరుగు పనిచేస్తుంది. మజ్జిగ, లస్సీ, రైతా... ఇలా వివిధ రూపాల్లో పెరుగును తీసుకోవచ్చు. వీటిలో అవిసె గింజ పొడిని కూడా చల్లుకోవచ్చు. శరీరంలో మంటను తగ్గించడంలో అవిసె గింజ ఉపయోగపడుతుంది.
మామిడి పండు :మామిడిలో విటమిన్ ఏ, బీ6, పొటాషియం, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఈ పండులో గ్లిజెమిక్ ఇండెక్స్ (రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచడానికి కార్బోహైడ్రేట్ల ఆహార సాపేక్ష సామర్థ్యాన్ని సూచించే సంఖ్య) తక్కువగా ఉంటుంది. అందుకే షుగర్ వ్యాధితో బాధపడుతున్నవారు కూడా మామిడిపండు తినొచ్చు. కాకపోతే.. తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి (రోజుకు సగం మామిడి పండు తింటే.. శరీరంలోని చక్కెర స్థాయిలో ఎలాంటి మార్పు ఉండదు).
చాలా మంది మామిడి పండు తింటే లావైపోతామని అనుకుంటారు. అది అవాస్తవం. మామిడిలో మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో పోషకాలుంటాయి. తగిన మోతాదులో తీసుకుంటే.. ఆరోగ్యానికి మామిడి ఎంతో మంచిది.