తెలంగాణ

telangana

By

Published : Apr 28, 2023, 10:47 AM IST

ETV Bharat / sukhibhava

'వేడినీళ్లు + తేనె = ఆస్తమాకు చెక్!'.. వైద్యులు ఏమంటున్నారంటే?

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది బాధపడుతున్న దీర్ఘకాలిక వ్యాధుల్లో ఆస్తమా కూడా ఒకటి. దీనిని ఉబ్బసం అని కూడా అంటారు. ఇండియాలో కూడా ఎంతోమంది ఆస్తమాతో బాధపడుతున్నారు. అప్పుడే పుట్టిన చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కోట్లాది మంది ఈ దీర్ఘకాలిక వ్యాధి బారిన పడుతున్నారు. ఆస్తమా వచ్చినప్పుడు ఏం చేయాలి? వేడి నీటిలో తేనె కలుపుకుని తాగితే ఉబ్బసం తగ్గుతుందా? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

how to control asthma naturally in telugu
how to control asthma naturally in telugu

శ్వాసకోశ సంబంధిత వ్యాధుల్లో ఆస్తమా ఒకటి. ఈ సమస్య ఉన్నవారికి ఊపీరి తీసుకోవడం చాలా కష్టమవుతుంది. ముక్కు నాళాలు బిగుసుకుపోయినట్లు అనిపించడం వల్ల.. బలవంతంగా గాలి పీల్చుకోవాల్సి వస్తుంది. అంతే కాకుండా ఏ చిన్న పని చేసినా లేదా కొంచెం దూరం నడిచినా వెంటనే ఆయాసంగా అనిపిస్తుంది. దీని వల్ల ఆస్తమా బాధితులు శారీరక శ్రమ కలిగించే పనులు చేయడానికి చాలా కష్టపడుతుంటారు.

ఆస్తమా రోగులకు ఛాతిలో బిగుసుకుపోయినట్లు కూడా అనిపిస్తుంది. వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారిని ఈ వ్యాధి వేధిస్తోంది. కొంతమందికి వంశపారంపర్యంగా కూడా ఉబ్బసం సమస్య వస్తుందని వైద్యులు చెబుతున్నారు. తల్లిదండ్రులకు ఆస్తమా ఉంటే వారి పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఆస్తమా రావడానికి అనేక కారణాలు ఉన్నాయని వైద్యులు అంటున్నారు.

దుమ్ము, ధూళి వంటి వాటితో అలర్జీలు, జలుబుతో పాటు ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు కూడా ఆస్తమాకు దారి తీయవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే, చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆస్తమా బారి నుంచి బయటపడవచ్చు. అందులో ఒకటి ఇన్‌హేలర్స్ వాడటం. ఇన్‌హేలర్స్ వాడటం వల్ల ఆస్తమా తగ్గే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

తేనె, వేడినీళ్లు కలిపి తాగితే...?
వేడి నీళ్లల్లో తేనె కలిపి తాగడం వల్ల కూడా ఉబ్బసం తీవ్రత తగ్గుతుందట. తేనెలో రోగ నిరోధక కారకాలు ఎక్కువగా ఉండటం వల్ల కొంతమేరకు ఆస్తమా నుంచి ఉపశమనం లభిస్తుంది. కానీ దీని వల్ల ఆస్తమా పూర్తిగా తగ్గదు. ఇన్‌హేలర్స్ వాడుతూనే మిగతా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆస్తమా తగ్గుతుందని పల్మనాలజిస్టులు చెబుతున్నారు.

రోజూ వ్యాయామం చేయడం, ఆటలు ఆడటం, స్విమ్మింగ్ వంటి చేయడం వల్ల కూడా ఆస్తమా తీవ్రత తగ్గుతుందట. గాలి ఎక్కువగా వచ్చే ప్రదేశాల్లో ఉండాలని, కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఉండకూడదని వైద్యులు సూచిస్తున్నారు. ఆస్తమా రోగులకు వైరల్ ఇన్పెక్షన్లు సాధారణంగా వస్తూ ఉంటాయి. దీంతో ప్రతి ఏటా ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాలి.

ఆస్తమా రోగులు తీసుకునే ఆహారంలో కూడా జాగ్రతలు పాటించాలి. ఆహారంలో కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. ఇన్‌హేలర్స్ వాడటంతో పాటు సరైన ఆహారం, వ్యాయామం చేయడం వల్ల ఉబ్బసం అదుపులోకి వస్తుందని వైద్యులు సూచిస్తున్నారు.
వేడి నీళ్లలో తేనె కలుపుకుని తాగడం వల్ల కొంతమేరకు మాత్రమే ఉపశమనం కలుగుతుందని, కానీ పూర్తిగా ఉబ్బసం అదుపులోకి రాదని వైద్యులు చెబుతున్నారు. ఆ పని చేస్తూనే, పై జాగ్రత్తలు అన్ని పాటించడం వల్ల ఆస్తమా నుంచి బయపటడతారని అంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details