How to Check Turmeric Quality in Telugu :భారతీయ వంటకాల టేస్ట్ సీక్రెట్.. సుగంధ ద్రవ్యాలు అని చెప్పుకోవచ్చు. కానీ.. అవన్నీ ఇప్పుడు కల్తీమయమే. వాటిని గుర్తించడం కూడా సామాన్యులకు అసాధ్యమే. అంత పక్కాగా కల్తీ చేస్తున్నారు. అయితే.. తేడా గుర్తించకపోతే దీర్ఘకాలంలో అనేక వ్యాధుల బారినపడే ఛాన్స్ ఉంది.
అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తూ.. దివ్య ఔషధంగా పేరొందిన పసుపు కూడా కల్తీ రంగు పులుముకుంది. మార్కెట్లో అనేక రకాల బ్రాండ్ల పేరుతో లభించే ఈ పసుపు.. ఏ ప్యాకెట్లో స్వచ్ఛంగా ఉందో? ఎందులో కల్తీగా ఉందో చెప్పడం కష్టం. సాధారణ జనానికి ఈ కల్తీ పసుపును గుర్తించడం సవాలుతో కూడుకున్నదే. అయితే.. దానిలో ఉండే ఓ పదార్థంతో ఈజీగా దాని నాణ్యతను తెలుసుకోవచ్చని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. ఇంతకీ ఆ పదార్థం ఏంటి? క్వాలిటీని ఎలా చెక్ చేయాలి? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పసుపులో కర్కుమిన్ (Curcumin) అనే బయోయాక్టివ్ పదార్థం ఉంటుంది. ఈ కర్కుమిన్ అనే సమ్మేళనం శరీర వృద్ధికి తోడ్పడే రసాయనాలను కలిగి ఉంటుంది. అయితే.. మనం వాడే పసుపు నాణ్యతను ఈ పదార్థం సహాయంతో చెక్ చేయవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
లేత పసుపు రంగులో ఉండే పసుపులో కర్కుమిన్ 3 శాతం మాత్రమే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అదే కాస్త చిక్కటి (Dark Colour) రంగులో ఉండే పసుపులో మాత్రం ఈ కాంపౌండ్ శాతం 7 వరకు ఉంటుందంటున్నారు. కాబట్టి.. మెరుగైన ఆరోగ్య ప్రయోజనాల కోసం ప్రజలు చిక్కటి రంగు కలిగిన పసుపునే వాడాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.