How to Build Your Child's Self Confidence :సాధారణంగా పిల్లల మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది. అయితే.. చాలా మంది పిల్లలు ఆత్మన్యూనతా భావంతో తమకు ఏదీ రాదని, ఏమీ చేయలేమని అనుకుంటూ.. అందరికంటే వెనుకంజలో ఉండిపోతారు. ఏ పని చేయాలన్నా ముందడుగు వేయడానికి సంకోచిస్తారు. దీనికి ప్రధాన కారణం తల్లిదండ్రుల నుంచి సరైన ప్రోత్సాహం లేకపోవడమే అంటున్నారు మానసిక నిపుణులు. అలాంటి సందర్భాల్లో పిల్లలకు అండగా నిలుస్తూ.. వారిలో ఆత్మవిశ్వాసం(Self Confidence) పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని సూచిస్తున్నారు.
Best 10 Tips to Build Self Confidence in Your Childs :ప్రస్తుత కాలంలో చాలా మంది పిల్లల్లో ఆత్మవిశ్వాసం తగ్గిపోతుండడంతో.. చిన్న చిన్న విషయాలకే కుంగిపోతూ.. ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు. కాబట్టి పేరెంట్స్ తమ పిల్లలలో చిన్నతనం నుంచే ఆత్మవిశ్వాసం నింపేందుకు కృషి చేయాలి. పిల్లలు తమ జీవితంలో సానుకూలంగా ముందడుగు వేయడానికి అది ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి తల్లిదండ్రులు(Parents)పిల్లలకు చిన్నప్పటి నుంచే ఏదైనా సమస్య వచ్చినప్పుడు భయపడకుండా దాన్ని ఎలా ఎదుర్కోవాలో మీ జీవితానుభవం నుంచి నేర్చుకున్న పాఠాలు వారితో పంచుకోవాలి. మీ పిల్లలు ఎప్పుడైనా బెరుగ్గా, బిడియంగా ఉంటే.. వారిలో ఆత్మవిశ్వాసం తక్కువగా ఉందని గ్రహించండి. వెంటనే వారిలో ఆ భయాన్ని పోగొట్టేందుకు ప్రయత్నించండి. అలాంటి వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి తల్లిదండ్రులు పాటించాల్సిన 10 బెస్ట్ టిప్స్‌తో మీ ముందుకు వచ్చాం. అవేంటో ఇప్పుడు చూద్దాం..
సానుకూలంగా మాట్లాడండి :ఎప్పుడైనా వైఫల్యాలు ఎదురైనప్పుడు అవి పిల్లల ఆత్మవిశ్వాసంపై చాలా పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. అలాంటి సమయంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు ఓటమిని కొన్ని సందర్భాల్లో అంగీకరించాలని, వైఫల్యాలు జీవితంలో ఒక భాగమని చెప్తు వారితో సానుకూలంగా మాట్లాడండి. అలాగే మీ జీవితంలో ఎదుర్కొన్న వాటి గురించి చెప్పి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాలి.
షరతులు లేని ప్రేమను చూపండి :ఆత్మవిశ్వాసం అనేది మంచి ప్రేమ, అనుభూతి, భద్రత నుంచి వస్తుంది. కాబట్టి మీ పిల్లల పట్ల షరతులు లేని ప్రేమను చూపడం వలన వారికి భద్రత, స్వంతం అనే భావన కలుగుతుంది. అది వారికి తమ గురించి మంచి అనుభూతిని కలిగిస్తుంది. మీ బిడ్డ తప్పులు చేసినా లేదా చెడు నిర్ణయాలు తీసుకున్నప్పటికీ వారిని ప్రేమించండి. అలాగే వారిని విమర్శించకుండా ఉండండి.
మంచి రోల్ మోడల్ అవ్వండి : తల్లిదండ్రులు తమ జీవితాలను ఎలా గడుపుతున్నారు.. వైఫల్యాలను ఎలా ఎదుర్కొంటున్నారు.. విజయాన్ని ఎలా పొందుతున్నారనే విషయాలను పిల్లలు నిరంతరం గమనిస్తూ ఉంటారు. కాబట్టి మీరు అత్యంత విశ్వాసంతో ఏదైనా పని చేస్తున్నప్పుడు లేదా ఉద్యోగంలో స్థిరపడినప్పుడు అది గమనిస్తారు. అప్పుడు తాము ఏ పనినైనా చేయగలమన్న భావన.. తల్లిదండ్రులే తమ రోల్ మోడల్ అనే ఆలోచన వారిలో వస్తుంది.
మీ అమ్మాయి ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవాలంటే...
మీ పిల్లలను ఇతరులతో పోల్చకండి : మీ పిల్లలను వారి తోటివారితో పోల్చడం మానుకోండి. ఎందుకంటే.. ఇది వారి ఒత్తిడి స్థాయిలను పెంచుతుంది. పిల్లలు తమ తల్లిదండ్రులను ఎల్లవేళలా సంతోషపెట్టాలని కోరుకుంటారు. కానీ, అలా చేయలేనప్పుడు అది వారి విశ్వాసాన్ని తగ్గిస్తుంది. ప్రతి ఒక్కరూ తమ కంటే మెరుగ్గా ఉన్నారనే భావన వారిలో కలిగి ఒత్తిడికి లోనవుతారు. కాబట్టి.. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని ఇతరులతో పోల్చకండి.
వారి ప్రయత్నాలను మెచ్చుకోండి :కేవలం పిల్లలు మంచి ఫలితం సాధించినప్పుడు మాత్రమే ప్రశంసించకుండా.. వారు చేసే ప్రతి పని ప్రయత్నాన్ని, అందులో పొందే పురోగతిని మెచ్చుకోండి. ఉదాహరణకు మీ బిడ్డ కొత్త సంగీత వాయిద్యాన్ని నేర్చుకుంటున్నట్లయితే.. లేదా ప్రాజెక్ట్‌లో పని చేస్తున్నట్లయితే వారిని అభినందించండి. మీ ప్రోత్సాహం వారి అభివృద్ధికి మరింత తోడ్పడుతుంది.